మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సి.బిఎస్.ఇ. పరీక్షలు ఫిబ్రవరిలో కాదు: రమేశ్ పోఖ్రియాల్ ప్రకటన
బాగస్వామ్య వర్గాలతో చర్చల తర్వాత పరీక్షల తేదీలను
అతిత్వరలో వెల్లడిస్తామన్న కేంద్ర విద్యా మంత్రి
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వర్చువల్ సంభాషణ
Posted On:
22 DEC 2020 6:48PM by PIB Hyderabad
త్వరలో జరగనున్న పోటీ పరీక్షలు, బోర్డు పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో వర్చువల్ పద్ధతిలో ముచ్చటించారు. ఈ సందర్భంగా పోఖ్రియాల్ మాట్లాడుతూ గురువు యొక్క ప్రాముఖ్యత ఎల్లప్పుడూ దేవుని కంటే మిన్నగానే ఉంటూ వస్తోందని, అందుకే ఆచార్య దేవో భవ అన్న సూక్తి స్ఫూర్తిగా ఉపాధ్యాయులు అందరినీ మనం గౌరవించాలని అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే దేశంలో ఆన్‌లైన్ విద్యా విధానం విజయవంతమైనట్టు రుజువైందన్నారు. కోవిడ్-19 వైరస్ పై విద్యార్థుల్లో, సమాజంలో తగిన అవగాహనను కలిగించినందుకు ఉపాధ్యాయులందరికీ కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19పై జరిగిన ఈ యుద్ధంలో పూర్తి చిత్తశుద్ధితో పాల్గొన్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఎప్పుడూ విద్యార్థుల ప్రయోజనాల కోసమే తాము పనిచేశామని అన్నారు. 2021వ సంవత్సరపు పరీక్షల నిర్వహణకు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సి.బి.ఎస్.ఇ.) తగిన సన్నాహాలు చేస్తోందన్నారు. అయితే, బోర్డు పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరగబోవని, త్వరలోనే భాగస్వామ్య వర్గాలన్నంటితో చర్చించిన మీదటనే అతి త్వరలో పరీక్షల తేదీలను సి.బి.ఎస్.ఇ. ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.
తొమ్మిదవ తరగతిలో వృత్తి విద్యను అందించాలన్న సూచనను ఆయన ప్రస్తావిస్తూ, దేశంలో వృత్తి విద్యను అందించే సి.బి.ఎస్.ఇ. పాఠశాలలు దాదాపు 8,583 వరకూ ఉన్నాయన్నారు. 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చిన తర్వాత 2,80,000కి పైగా మాధ్యమిక పాఠశాలలు, దాదాపు 40,000 కళాశాలలు, వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు ఇన్ టర్న్ షిప్ సదుపాయంతో కూడిన వృత్తి విద్యను అందించే అవకాశం ఉందన్నారు.
పాఠశాలల్లో సామర్థ్యం ఆధారిత విద్యాబోధనను ప్రవేశపెట్టాలన్న సూచనపై ఆయన ప్రతిస్పందిస్తూ, విద్యా మంత్రిత్వ శాఖ నిశితా (ఎన్.ఐ.ఎస్.హెచ్.ఐ.టి.హెచ్.ఎ.) కార్యక్రమాన్ని అమలు చేసినట్టు చెప్పారు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను నిర్మింపజేయడమే లక్ష్యంగా నిశితా కార్యక్రమాన్ని దేశంలోని 42లక్షల ప్రాథమిక విద్యాసంస్థల ఉపాధ్యాయులకు, పాఠశాలల హెడ్మాస్టర్లకు వర్తింప జేసినట్టు చెప్పారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు ఈ నిశితా పథకం కింద ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. తర్వాత మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యాబోధనకు, విద్యాభ్యాసానికి ఆన్ లైన్ పద్ధతిలో ఈ పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. సందర్భానికి తగినట్టుగా కార్యక్రమాన్ని వందశాతం ఆన్ లైన్ పద్ధతిలో అమలుచేసినట్టు చెప్పారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు మొదలు కాగానే, ఆన్ లైన్ ద్వారా విద్యాబోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి సి.బి.ఎస్.ఇ., కేంద్రీయ విద్యా సంఘటన్ (కె.వి.ఎస్.), జవహర్ నవోదయ విద్యాలయ (జె.ఎన్.వి.) భారీ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాయన్నారు. సాధ్యమైన ప్రతిచోటా విద్యాభ్యాస కార్యక్రమాన్ని కొనసాగించే కృషిలో భాగంగా ఆన్ లైన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ఈ ప్రక్రియలో సి.బి.ఎస్.ఇ. 4,80,000మంది ఉపాధ్యాయులకు, కె.వి.ఎస్. 15,855మంది టీచర్లకు, జె.ఎన్.వి. 9,085మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించినట్టు చెప్పారు. ఆన్ లైన్ మధింపునకు సంబంధించి నవోదయ విద్యా సమితి టీచర్లకు శిక్షణ అందించిందన్నారు. ఆవిష్కరణ ఆధారిత, ప్రయోగాత్మక విద్యాబోధన కార్యక్రమం కింద టీచర్లకు నిర్విరామంగా శిక్షణ అందించినట్టు పోఖ్రియాల్ చెప్పారు. పాఠశాల విద్యకోసం కొత్త పాఠ్యాంశాల వ్యవస్థ (ఎన్.సి.ఎఫ్.)ను జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) ప్రవేశపెట్టిందని, కొత్త ఎన్.సి.ఎఫ్.కు అనుగుణంగా పాఠ్య పుస్తకాల్లో ఎన్.సి.ఇ.ఆర్.టి. మార్పులు చేసే అవకాశం ఉందని చెప్పారు. సృజనాత్మక ఆలోచన, జీవన నైపుణ్యాలు, భారతీయ ఇతిహాసాలు, కళలు, సమైక్యత వంటి అంశాలను కొత్త పాఠ్యాంశాల వ్యవస్థలో పొందుపరచవలసి ఉంటుందని చెప్పారు.
విద్యార్థులు నైతిక విలువలను, నైతిక తార్కిక హేతుపద్ధతను పెంపొందించుకోవాలని, మానవత్వ విలువలను, “రాజ్యాంగ విలువల”ను కూడా తెలుసుకుని వాటిని అనుసరించాలని జాతీయ విద్యావిధానం సూచిస్తోందన్నారు. లైంగికపరమైన సున్నితత్వం; ప్రాథమిక బాధ్యతలు; పౌరసత్వ విలువలు; దేశంపై విషయజ్ఞానం; పర్యావరణ పరిజ్ఞానం, నీటి వరనుల రక్షణ, పారిశుధ్థ్యం పాటించడం, లౌకిక పరిజ్ఞానం, స్థానిక సంఘాలు, రాష్ట్రాలు, దేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై పరిజ్ఞానం వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునేలా జాతీయ విద్యా విధానం తగిన సూచనలు చేస్తుందన్నారు. నూతన విద్యా విధానంలో పొందుపరిచిన ఆశయాలకు అనుగుణంగా, ఉపాధ్యాయులు విద్యార్థుల మనస్తత్వాన్ని పరివర్తన చెందించి, వారిలో నైతికతను, విలువలను పెంపొందించుకోవచ్చని మంత్రి అన్నారు.
మానసిక, శారీరక ఆరోగ్య సాధనే లక్ష్యంగా యోగా, క్రీడలు, ధ్యానం వంటి అంశాల ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవటానికి వీలుగా, తమ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని పోఖ్రియాల్ చెప్పారు. శారీరక ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల ఆన్‌లైన్ లైవ్ సెషన్లలో విద్యార్థులకు ప్రమేయం కల్పించడానికి ఫిట్ ఇండియా ఉద్యమంతో సి.బి.ఎస్.ఇ.,.. చేతులు కలిపిందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఇళ్లకు పరిమితమైన విద్యార్థులకోసం ఈ ఆన్ లైన్ కార్యక్రమాలను జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రముఖ క్రీడాకారులు నిర్వహించారన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన 645మంది క్రీడా ఉపాధ్యాయులు లైవ్ సెషన్ల ద్వారా, విద్యార్థుల ఫిట్‌నెస్ కోసం వ్యాయామాలు, ఇతర సాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సెకండరీ స్థాయిలో వ్యాయామం, ఇతర శారీరక కార్యకలాపాలపై కొత్త పాఠ్యాంశాన్ని సి.బి.ఎస్.ఇ. 9వ తరగతిలో ప్రవేశపెట్టిందన్నారు. విద్యార్థులలో శారీరక దారుఢ్యం, యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజెప్పేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కూడా ఆన్ లైన్ సెషన్లను నిర్వహించిందని చెప్పారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం గురించి మంత్రి ప్రస్తావిస్తూ, తమ మంత్రిత్వ శాఖ ‘మనోదర్పణ్’ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. కోవిడ్ సంక్షోభం తలెత్తిన తరుణంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు మనోధైర్యం, మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు.
డిజిటల్ డివైడ్ కార్యక్రమానికి సంబంధించిన పలు కార్యకలాపాల నిర్వహణకు పి.ఎం. ఇ విద్య పథకం సహాయంతో పలు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకోసం స్వయంప్రభ టెలివిజన్ చానల్ ద్వారా దీక్షా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నామని, రేడియో ద్వారా ఇదే ప్రసారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టీవీ, రేడియోల్లో కూడా ఆన్ లైన్ విషయాలే అందుబాటులో ఉన్నందున ఈ కార్యక్రమాలకోసం అందరికీ ఇంటర్నెట్ తప్పనిసరికాదన్నారు.
- ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేని విద్యార్థులకోసమే స్వయంప్రభ డి.టి.హెచ్. చానల్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాబోధన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు 32 టెలివిజన్ ఛానల్స్ ను విద్యామంత్రిత్వ శాఖ కేటాయించిందని మంత్రి చెప్పారు. ఇందులో 12 చానళ్లను ఒక తరగతికి ఒక చానల్ కింద కేటాయించినట్టు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పాఠశాల విద్య, సాక్షరత శాఖకు ఈ చానళ్లను కేటాయించినట్టు కేంద్రమంత్రి వివరించారు.
ఆన్ లైన్ సదుపాయానికి నోచుకోని మారుమూల ప్రాంతాల విద్యార్థులకోసం రేడియో ప్రసారాలను వినియోగించుకుంటున్నట్టు పోఖ్రియాల్ చెప్పారు. ఇందుకోసం ఎన్.సి.ఇ.ఆర్.టి. నిపుణులైన కళాకారుల సహాయంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన శ్రవణ కార్యక్రమాలను నిర్మిస్తోందన్నారు. ఇందుకు సంబంధించి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృత భాషల్లో దాదాపు 2,000 కార్యక్రమాలను సి.ఐ.ఇ.టి.-ఎన్.సి.ఇ.ఆర్.టి. తయారు చేసినట్టు చెప్పారు.
ఆన్ లైన్ తరగతుల నిర్వహణలో అడ్డంకులను అధిగమించేందుకు మల్డీ మీడియా మార్గాల్లో విద్యాకార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. పి.ఎం. ఇ విద్యా పథకం కింద చేపట్టిన దీక్షా, స్వయంప్రభ, సామాజిక రేడియో, శిక్షా వాణి, తదితర కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉదహరించారు. ఆన్ లైన్ తరగతులకోసం ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండరును, డిజిటల్ విద్యపై మార్గదర్శక సూత్రాలను అనుసరించవలసిందిగా వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించినట్టు పోఖ్రియాల్ చెప్పారు.
2021వ సంవత్సరపు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జె.ఇ.ఇ.) సిలబస్ గత ఏడాదిలాగానే ఉంటుందని పోఖ్రియాల్ చెప్పారు. కొన్ని విద్యా బోర్డులు సిలబస్ ను కుదించినందున ఎదురయ్యే ఇబ్బందిని అధిగమించేందుకు 2021 సంవత్సరపు జె.ఇ.ఇ. ప్రధాన పరీక్ష ప్రశ్నపత్రాల్లో 90 ప్రశ్నలు ఉంటాయని, అందులో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితంలో 30చొప్పున ప్రశ్నలు పొందుపరుస్తారని వాటిలో 75 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రాల్లో ఒక్కో దానిలో 25చొప్పున ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రమంత్రి పోఖ్రియాల్ తెలిపారు.
****
(Release ID: 1683003)
Visitor Counter : 246