జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశంలోని వాయవ్య ప్రాంతంలో మెట్ట ప్రాంతాలలో అధిక సమర్ధత ఉన్న జలాశయాలను గుర్తించి నిర్వహించడానికి కేంద్ర భూగర్భ జల బోర్దు (సి జి డబ్ల్యూ బి) మరియు శాస్త్రవిజ్ఞాన, పారిశ్రామిక పరిశోధనా మండలి

- జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ (సి ఎస్ ఐ ఆర్ - ఎన్ జి ఆర్ ఐ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Posted On: 21 DEC 2020 6:47PM by PIB Hyderabad

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర భూగర్భ జల బోర్దు (సి జి డబ్ల్యూ బి) ,మరియు సి ఎస్ ఐ ఆర్ - ఎన్ జి ఆర్ ఐ, హైదరాబాద్ మధ్య  అత్యంత అధునాతన పద్ధతిలో జలాశయాల గుర్తింపు కార్యక్రమం కింద రాజస్థాన్, గుజరాత్ మరియు హర్యానా రాష్ట్రాలలో  భూ భౌతిక సర్వే మరియు ఇతర శాస్త్రీయ అధ్యయనాలు జరిపేందుకు సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది.  అవగాహన ఒప్పందంపై  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్,  కేంద్ర శాస్త్రవిజ్ఞాన , టెక్నాలజీ మరియు ఆరోగ్య  & కుటుంబ సంక్షేమ మరియు భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమక్షంలో ఢిల్లీలో  కేంద్ర భూగర్భ జల బోర్దు  చైర్మన్ మరియు సి ఎస్ ఐ ఆర్ - ఎన్ జి ఆర్ ఐ, డైరెక్టర్  సంతకాలు చేశారు.  
             
           రూ. 54 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రాజెక్టు మొదటి దశలో దాదాపు ఒక లక్ష చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వే చేస్తారు.   ఇందులో 65,500 చదరపు కిలోమీటర్లు రాజస్థాన్ రాష్ట్రంలో (బికానెర్, చూరు, గంగ నగర్, జాలోర్,  పాలీ, జైసల్మేర్, జోద్పూర్ మరియు సీకర్ జిల్లాలలోని ప్రాంతాలు),  32,000 చదరపు కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో (రాజకోట్,  జామ్ నగర్,  మోర్బీ,  సురేంద్రనగర్ మరియు దేవభూమి ద్వారక జిలాలలోని ప్రాంతాలు) మరియు 2500 చదరపు కిలో మీటర్లు హర్యానా రాష్ట్రంలో (కురుక్షేత్ర మరియు యమునానగర్ జిల్లాలలోని ప్రాంతాలు)  ఉన్నాయి.  

           ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశం  హెలికాఫ్టర్ నుంచి నిర్వహించే భూ భౌతిక శోధన / సర్వే సహాయంతో  అధిక సమర్ధత  గల జలాశయాలను గుర్తించడం.  తద్వారా భూగర్భ జల సంగ్రహణకు అనువైన స్థలాలను ఎంపిక చేయడం,  కృత్రిమ పద్ధతులు లేక పునరావేశం ద్వారా జల సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  

           దేశంలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న మెట్ట భూములు, అర్ధశుష్క ప్రాంతాలలో ఉన్న జలాశయాలను గుర్తించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.  అతి కొద్దీ సమయంలో భూగర్భ జలాలకు సంబంధించిన డేటాను సేకరించడం ద్వారా నీటి కొరత / సమస్య తీవ్రంగా ఉన్న పైన పేర్కొన్న  ప్రాంతాలలో  భూగర్భ జలాల నిర్వహణకు కేంద్ర భూగర్భ జల బోర్దు త్వరితగతిన ఆర్ధిక ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుంది.  ఈ అధ్యయనాల ఫలితాలు నీటి కొరత తీవ్రంగా  ఉన్న ప్రాంతాలలో భూగర్గ జల స్థాయి పెంచడానికి వీలుగా ఆయా స్థలాలకు అనువైన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడానికి  సహాయపడుతాయి. అంతేకాక భూగర్భ జల వనరులను ధారణీయ స్థాయిలో నిర్వహించడానికి మార్గ నిర్దేశం చేయడానికి తోడ్పడుతుంది.

***



(Release ID: 1682797) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Tamil