ఉప రాష్ట్రపతి సచివాలయం
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి – ఉపరాష్ట్రపతి
• స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉద్దేశాల్లో రైతుల ప్రగతి కూడా ఒకటి.
• రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ అవార్డుల ప్రదానం
• రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం.
• ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్ష
• కోవిడ్ పరిస్థితుల్లోనూ ఆహారోత్పత్తి పెంచే దిశగా అన్నదాతల కృషి మరువలేనిది
• అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
• చదువుకున్న యువత, తమ విజ్ఞానంతో వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
• శాస్త్రవేత్తలు, అధికారులు, పాత్రికేయులు ముగ్గురూ కలిసి త్రిమూర్తుల్లా రైతుల కోసం సమన్వయంతో పని చేయాలని సూచన
Posted On:
16 DEC 2020 2:43PM by PIB Hyderabad
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదని, లోకానికి అన్నం పెట్టడానికని తెలియజేసిన ఉపరాష్ట్రపతి, అమ్మ తర్వాత అంత గొప్పమనసు రైతన్నలదే అని తెలియజేశారు.
హైదరాబాద్‌లోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ‘రైతు నేస్తం’, ‘ముప్పవరపు ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ఆయన ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారాన్ని’, బ్రిగేడియర్ పోగుల గణేశం గారికి ‘కృషిరత్న’ పురస్కారాలను అందజేశారు. ఇటీవల ముప్పవరపు ఫౌండేషన్ సహకారంతో, రైతునేస్తం నిర్వహించిన ‘పల్లె పథం’ వ్యవసాయ లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వీరితో పాటు రైతులు, విస్తరణ విభాగ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాత్రికేయులు తదితరులకు సైతం పురస్కారాలు అందజేశారు.
వ్యవసాయానికి విజ్ఞానం మరింత చేరువ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్న ఉపరాష్ట్రపతి, మంచిని ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి అని తెలిపారు. మంచి పని చేసిన ఒక్కరిని ప్రోత్సహించడం ద్వారా మరెంతో మంది అదే స్ఫూర్తితో మరెన్నో మంచి కార్యక్రమాల దిశగా ముందుకు వస్తారన్నారు. గత 16 ఏళ్ళుగా అన్నదాతలకు రైతునేస్తం, పశునేస్తం, ప్రకృతినేస్తం మాస పత్రికల ద్వారా అన్నదాతలకు చేదోడుగా నిలవడమే గాక, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ ఐ.వి.సుబ్బారావు గారి పేరిట అవార్డులను అందిస్తున్న రైతునేస్తం వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహిత శ్రీ యడ్లపల్లి వేంకటేశ్వరరావు గారికి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది లఘుచిత్ర పోటీల్లో విజేతలను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన ముప్పవరపు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ హర్ష గారికి కూడా అభినందనలు తెలియజేశారు.
‘ఉత్తం ఖేతి మధ్యం వాన్ కరె చాకిరి కుకర్ నినాన్’ అనే హిందీ సామెతను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి భారతదేశ ప్రజలు వ్యవసాయానికి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారని, భారతీయుల దృష్టిలో వ్యవసాయం అంటే సిరులు మాత్రమే కాదని, సంస్కృతి కూడా అని తెలిపారు. అందుకే మన పండుగలు, పబ్బాలు, ఆచార వ్యవహారాలు అన్నీ వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయన్నారు. అగ్ని, వాయు పురాణాలు, వరాహమిహురుని బృహత్ సంహిత, సురఫలుని వృక్ష ఆయుర్వేదం, పరాశరుని కృషి పరాశరం గ్రంథాల్లని వ్యవసాయ విజ్ఞానం గురించి తెలియజేసిన ఉపరాష్ట్రపతి.. సింధు నాగరికత నాటి వ్యవసాయ స్వర్ణయుగ పరిస్థితులను వివరించారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, శాస్త్రీయ విజ్ఞానం లాంటి ప్రతి అంశంలోనూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, బ్రిటీష్ వారి పాలనా కాలంలో చదువు రాని వారు మాత్రమే వ్యవసాయం చేస్తారనే ఓ ముద్ర పడిపోయిందని, తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు చేస్తున్న నిరుపమానమైన సేవలకు జేజేలు పలుకుదామన్న ఉపరాష్ట్రపతి, అదే సమయంలో చెప్పుకోదగిన స్థాయిలో దిగుబడి పెంచేందుకు కృషి చేసిన అన్నదాతల గొప్పతనాన్ని సైతం గుర్తించాలని తెలిపారు. కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్ళ నేపథ్యంలో రాబోయే రోజల్లో తీవ్ర ఆహారం సంక్షోభం రానుందన్న ఐక్య రాజ్య సమితి ఆహార సంస్థ నివేదికను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, అన్ని వేళలా శ్రమించేందుకు సిద్ధంగా ఉండే అన్నదాతలకు మనం సకాలంలో చేయూతను అందించగలిగితే, మన ఆహార అవసరాలను తీర్చుకోవడమే కాదు, ప్రపంచం ఆకలి తీర్చేందుకు కూడా భారతదేశం మరో నాలుగు అడుగులు ముందుకు రావచ్చన్నారు. రైతులకు మంచి ధరను అందించడంతో పాటు, వారికి సకాలంలో సరసమైన విధంగా రుణాలు అందేలా చూడడం, అన్ని స్థాయిల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం తదితర కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేయాలని సూచించారు.
2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కనీస మద్దతు ధర అందించడంతో పాటు, సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) లాంటి ఎన్నో పథకాల ద్వారా రైతుల ఆర్థిక స్థితిని పెంచి, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వంతో పాటు, రైతుకు చేయూతనందిస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దేశ వ్యాప్త స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన, వ్యవసాయ సంబంధమైన వ్యాపారంలో గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పెట్టుబడులు, సృజనాత్మక కార్యకలాపాల దిశగా చొరవ తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ.. రైతుల ఆందోళనలను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రజల మనసుల్లో వ్యవసాయ రంగాన్ని చూసే దృష్టి కోణం మారాలన్న ఉపరాష్ట్రపతి, చదువుకున్న యువతరం తమ విజ్ఞానంతో వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులు, పాత్రికేయులు ముగ్గురూ కలిసి త్రిమూర్తుల్లా రైతుల కోసం సమన్వయంతో పని చేయడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం సాధ్యమౌతుందని, ఫలితంగా యువతరాన్ని సైతం వ్యవసాయ రంగం దిశగా ఆకర్షించవచ్చని తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలమేరకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి వచ్చిందన్న ఉపరాష్ట్రపతి ప్రస్తుతం కరోనా టీకాకు సంబంధించి మంచి వార్త విన్నామని, వచ్చే ఏడాది కరోనాకు టీకా వచ్చి అన్నీ సర్దుకున్న తర్వాత మరింత ఆత్మీయంగా, ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. అప్పటివరకు సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటిచండంలో అలసత్వం వహించొద్దని ఉపరాష్ట్రపతి సూచించారు.
కార్యక్రమం ప్రారంభంలో ట్రస్టు ప్రాంగణంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఉపరాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టు హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ చిగురుపాటి కృష్ణప్రసాద్, ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ముప్ప్వరపు హర్షవర్ధన్ పాటు రైతునేస్తం వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ శ్రీ ఘంటా చక్రపాణితోపాటు ఈ అవార్డుల న్యాయనిర్ణేతల కమిటీ సభ్యులు, అవార్డు గ్రహీతలు, శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణార్థులతో మాటామంతీ
అంతకుముందు, స్వర్ణభారత్ ట్రస్టులో ఫార్మాతోపాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆరుబయట ఉపరాష్ట్రపతి సంభాషించారు. భారతదేశ యువతలో శక్తిసామర్థ్యాలకు కొదవలేదని.. అయితే కావాల్సిందల్లా ఆ సామర్థ్యానికి నైపుణ్యాన్ని జోడించడమేనని, దీని ద్వారా అద్భుతాలు చేసే సత్తా మన యువతకు ఉందన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ అదే లక్ష్యంతో.. యువత నైపుణ్యానికి సానబెట్టేందుకు వివిధ విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
ప్రపంచ ఫార్మారంగానికి మన దేశం దిక్సూచిగా మారిందని.. కరోనా సమయంలో భారత ఫార్మారంగమే ప్రపంచానికి భరోసా ఇచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ రంగంలో భారత్ మరింత ప్రగతి సాధించేందుకు వీలుందని.. ఇందుకోసం అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత సకలసన్నద్ధతతో సిద్ధంగా ఉండాలన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని.. జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని శిక్షణార్థులకు సూచించిన ఉపరాష్ట్రపతి.. వ్యాయామాన్ని దైనందిన జీవితంలో తప్పనిసరిగా చేయాలన్నారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక సంతులనం సాధ్యమవుతుందన్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చక్కటి ఆలోచనలతో జీవితంలో ముందుడుగు వేసేందుకు అవసరమైన సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యమని.. మన పూర్వీకులు అనుభవంతో రంగరించి, మేళవించి మనకిచ్చిన ఆహార పద్ధతులను అలవర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, మాతృభూమిని గురువును మరిచిపోవద్దని శిక్షణార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ ఐదు విషయాలను ఎప్పటికీ మదిలో ఉంచుకుని ఆచరణలో చూపించాలని అప్పుడే మనం సాధించే ప్రగతికి సార్థకత చేకూరుతుందని ఆయన అన్నారు.
ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాషను మరవొద్దని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. తల్లిగర్భం నుంచి మనం నేర్చుకున్న భాషే మన అస్తిత్వమని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వాహక బృందాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు.
***
(Release ID: 1681048)
Visitor Counter : 243