పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పునరుత్పాదక ఇంధన పథకాల్లో బాగస్వాములు కండి

పెట్టుబడిదారులకు, డెవలపర్లకు, వాణిజ్యసంస్థలకు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

Posted On: 28 NOV 2020 7:20PM by PIB Hyderabad

భారతదేశం చేపట్టిన పునరుత్పాదక ఇంధన పథకాల కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్టుబడి దారులకు, డెవలపర్లకు, వాణిజ్య సంస్థలకు ఆహ్వానం పలికారు. ఈ రంగం ఎంతో లాభదాయకంగా, ఉభయపక్షాలకు పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని హామీ ఇచ్చారు.  రీ ఇన్వెస్ట్-2020 సదస్సు సందర్భంగా 2020 నవంబరు 28న జరిగిన ముగింపు కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ,.. పునరుత్పాదక ప్రాజెక్టుల్లో పెట్టుబడికి సంబంధించి భారతదేశం ఎంతో సానుకూల దృష్టితో పురోగమిస్తోందన్నారు. గత ఆరేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి 6,400కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు చెప్పారు.

 

  ఇంధన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐ.లకు) సంబంధించి భారతదేశం ఎంతో ఉదార విధానం అనుసరిస్తోందని మంత్రి అన్నారు. “పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పాదనా ప్రాజెక్టుల్లో విదేశీయులు సొంతంగా అయినా, భారతీయుల భాగస్వామ్యంతో అయినా పెట్టుబడులు పెట్టవచ్చు. విద్యుత్ ఉత్పత్తి పథకాలకు భారతీయ భాగస్వామ్య సంస్థలతో కలసి ఆర్థిక, సాంకేత పరిజ్ఞానపరమైన సహకారాన్ని అందించవచ్చు.” అని సూచించారు. “సులభతర వాణిజ్య నిర్వహణ”కు ఎంతో ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. “ఒప్పందాలకు బద్ధులమై ఉంటూ, పెట్టుబడుల రక్షణకు మేం ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు సదుపాయంగా ఉండేలా, అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రాజెక్ట్ అభివృద్ధి విభాగాలను (పి.డి.సి.లను), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.ల) విభాగాలను  ఏర్పాటు చేశాం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సంస్థల, పెట్టుబడి దారుల ఆందోళనల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నాం.” అని ప్రధాన్ అన్నారు. ఇంధన పేదరికాన్ని అంతం చేసేందుకు దేశం కట్టుబడి ఉందని, ఆ కృషిలో  ఇపుడు కీలకమైన పరివర్తన దశలో ఉందని అన్నారు. స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవడానికి, అవి అందుబాటు యోగ్యంగా ఉండేలా చూడటానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యమైన ఇంధన వనరులను ఆమోదయోగ్యమైన మిశ్రమంతో వినియోగించడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా కృషి చేస్తున్నామన్నారు. ఇంధన రంగంపై ఎప్పటికప్పుడు విధానాల రూపకల్పన,  వాటి ప్రక్షాళనకోసం, చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. ఐదు కీలక సూత్రాల ఆధారంగా, ఇంధనంకోసం రేపటి తరానికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందరికీ ఇంధనం అందుబాటులో ఉండటం, పేదవర్గాలకు కూడా అందుబాటు యోగ్యంగా ఉండటం, ఇంధన వినియోగంలో సామర్థ్యం, వాతావరణ మార్పులను తట్టుకునేలా బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరసత్వంతో ఇంధన సుస్థిరత సాధన, ఇంధనపరంగా ప్రపంచ అస్థిరతల పరిష్కారానికి తగిన చర్యలు వంటి కీలక సూత్రాల ఆధారంగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. ”ఇంధన రంగంపై మన అజెండా,.. సమ్మిళితం, మార్కెట్ ఆధారితం, వాతావరణ స్పందితం”. అని అన్నారు.

   పునరుత్పాదక ఇంధన రంగం పరిధి విస్తరణకోసం భారతీయ చమురు, గ్యాస్ పరిశ్రమ అనేక చర్యలు తీసుకుందని, పెట్టుబడుకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని ప్రధాన్ అన్నారు. “ఇప్పటికే మనం పెద్దఎత్తున జీవ ఇంధన కార్యక్రమం చేపట్టాం. జీవ ఇంధనం భారతదేశానికే కాక, యావత్ ప్రపంచానికీ పరిష్కార మంత్రం. పర్యావరణానికి, ఆర్థికాభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించే శక్తి దీనికి ఉంది. జీవాధారిత ఇంధనాలను భారీస్థాయిలో ప్రోత్సహించేందుకు 2018లో జాతీయ జీవ ఇంధన విధానం (ఎన్.బి.పి) ప్రారంభించాం. 2030కల్లా పెట్రోల్ లో 20శాతం ఇథనాల్, 5శాతం బయో డీజిల్ మిశ్రం చేయగలిగే స్థాయిని సాధించాలన్నది  లక్ష్యం. రోజుకు 1,100కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో  11 రాష్ట్రాల్లో 12 టూజీ ఇథనాల్ బయో-రిఫైనరీలను ఏర్పాటు చేస్తున్నాం.” అని అన్నారు.

   గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లక్ష్యంగా ‘ఒకే దేశం..ఒకే గ్యాస్ గ్రిడ్’ పేరిట ముందుకు సాగుతున్నట్టు  చెప్పారు. “ఇప్పటికే, 16,800 కిలోమీటర్లకు పైగా నిడివితో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేశాం. అదనంగా 14,700 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. గ్యాస్ సరఫరా మౌలిక సదపాయాల అభివృద్ధికోసం 6,000 కోట్ల అమెరికన్ డాలర్లమేర పెట్టుబడి అంచనాతో పథకం వేసుకున్నాం. గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం, నగరాల్లో గ్యాస్ పంపిణీకి ఏర్పాట్లు, ద్రవీకృత వంట గ్యాస్ రీగ్యాసిఫికేషన్ కేంద్రాల నిర్మాణం.., ఈ పథకంలో భాగం. విస్తృతస్థాయిలో ఏర్పాటయ్యే ఈ మౌలిక సదుపాయాలతో వివిధ ఇంధన వనరులను సమీకృతం చేసే అవకాశం ఏర్పడుతుంది. విస్తృతమైన పెట్టుబడి అవకాశాలతో అభివృద్ధిని సాధించే మరో రంగం ఇది.” అని అన్నారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిలో పెట్టుబడుల అవకాశాలపై దృష్టిని సారించాలని విజ్ఞప్తి చేశారు. “రవాణా యోగ్యమైన సుస్థిర ప్రత్యామ్నాయానికి (ఎస్.ఎ.టి.ఎ.టి.కి) సంబంధించి మనవద్ద సంపూర్ణ ప్రణాళిక ఉంది. ప్రభుత్వానికి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. కోటిన్నర మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 5వేల కంప్రెస్డ్ బయోగ్యాస్ (సి.బి.జి.) ప్లాంట్లు నిర్మించాలన్నది లక్ష్యం. 2వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఈ కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం. భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇందుకోసం ప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ధరలపై ఆఫ్ టేక్ గ్యారంటీ ఇస్తున్నాయి. ఆత్మనిర్భర భారత్, స్వచ్ఛ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల) రంగానికి ప్రోత్సాహకరంగా ఎస్.ఎ.టి.ఎ.టి. కోసం చర్యలు తీసుకుంటున్నాం.  కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి పథకాలను రిజర్వ్ బ్యాంకు కూడా ప్రాధాన్యతా రంగాల్లో చేర్చింది. దీనితో ప్లాంట్ల ఏర్పాటుకు రుణ సదుపాయం సులభమవుతుంది. దేశంలో మొత్తం 1,500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇది ఎంతో ఆనందం కలిగిస్తోంది.“ అని అన్నారు. ఇంధనరంగంపై గత నెలలో జరిగిన సెరా వీక్ (CERA week) సదస్సు 4వ వేదికలో ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రదాన్ ప్రస్తావించారు. దేశ ఇంధన కార్యక్రమం పురోగమనానికి కీలకమైన 7చోదక చర్యలు అవసరమని ప్రధాని ప్రస్తావించినట్టు చెప్పారు. 2030నాటికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించడంతోపాటుగా, సమీకృత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పనపై భారతదేశం దృష్టిని కేంద్రీకరించగలదని అన్నారు. మరింత స్వచ్ఛంగా శిలాజ ఇంధన  వినియోగం, స్వదేశీ ఇంధనాలపై మరింత ఎక్కవగా ఆధారపడటం, విద్యుత్ సేవలను పెంచడం, తాజాగా ఆవిర్భవిస్తున్న హైడ్రోజన్ వంటి ఇంధనాలవైపు మరలడం, అన్ని ఇంధన వ్యవస్థల్లో డిజిటల్ సృజనాత్మక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. పర్యావరణ హితమైన ఇంధనాలపై దృష్టిని కేంద్రీకరించడంతోపాటుగా, పునరుత్పాదక ఇంధన ఉత్పాదక పథకాలపై పెట్టుబడులకు భారతీయ చమురు, గ్యాస్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని, ప్రభుత్వరంగంలోని చమురు కంపెనీలు కూడా దీనిపై ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. కోవిడ్-19 సంక్షోభం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంధన రంగంలో హరిత విప్లవం సత్వరం సాధించాల్సిన ఆవశ్యకత పెరిగిందన్నారు. “ఇప్పటికిప్పుడు ఆర్థికంగా మన గమనం కాస్త మందగించి ఉండవచ్చు. ఇయితే, తక్కువ స్థాయి కర్బన ఉద్గారాలకు మాత్రమే అవకాశం ఉన్న కొత్త భవిషత్తుకోసం ఇంధన పరివర్తన దశను మరింత వేగంగా రూపొందించుకునేందుకు ఇదే తగిన తరుణం. అందుకే మనం కాస్త ఆగి, పునరాలోచించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.” అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

 

******


(Release ID: 1676965) Visitor Counter : 178