వ్యవసాయ మంత్రిత్వ శాఖ

10వేల వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాల పరిధిలోకి తేనె ఉత్పత్తిదార్ల సంఘాలు

నాఫెడ్ అధ్వర్యంలో ఈ సంఘాలకు శ్రీకారం

చిన్న రైతుల ఆదాయం పెంపుదలకు ఇవి దోహదం చేస్తాయన్న

కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 26 NOV 2020 3:46PM by PIB Hyderabad

జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) ఆధ్వర్యంలో తేనె ఉత్పత్తి రైతుల సంఘాల (ఎఫ్.పి.ఒ.)ల ఏర్పాటు ప్రక్రియను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2020 నవంబరు 26న ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్తగా తేనె ఉత్పత్తి దారులైన రైతులు, ఇతర రైతులతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలు (ఎఫ్.పి.ఒ.లు) పాల్గొన్నాయి.

 ఈ సందర్భంగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ,..భారతదేశంలో తేనెటీగల పెంపకం ఎక్కువగా అసంఘటిత రంగంలో, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సాగుతోందని అన్నారు. దేశంలో భారీ స్థాయిలో తేనె ఉత్పత్తి సామర్థ్యానికి అవకాశాలు ఉన్నప్పటికీ, తేనెటీగల పెంపకం పరిశ్రమ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు.  వివిధ రకాల అడ్డంకుల కారణంగా తేనెటీగల పెంపకాన్ని ఎక్కువమంది చేపట్టలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తేనెటీగల పెంపకానికి సంబంధించి సరఫరా వ్యవస్థకు, పెంపకందార్లయిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మధ్య నాఫెడ్ సరైన మధ్యవర్తిగా నాఫెడ్ తన పాత్రను పోషిస్తుందని, సంబంధిత సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. తేనె ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా, ఉపాధికి నోచుకోని మహిళల్లో, గిరిజనుల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం, తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను నాఫెడ్ నిర్వహిస్తుందన్నారు. తేనెటీగల పెంపకంతో చిన్న, సన్నకారు రైతుల జీవన శైలి సమూలంగా మార్చవచ్చని, రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని మంత్రి చెప్పారు.

   దేశంలో వ్యవసాయ సంస్కరణలను అమలులో వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలకు (ఎఫ్.పి.ఒ.లకు) ఉన్న గణనీయమైన పాత్రను దృష్టిలో పెట్టుకుని సదరు సంఘాల ఏర్పాటును భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయాన్ని స్వావలంబనతో తీర్చి దిద్దడానికి తొలుత ఎప్.పి.ఒ.ల ఏర్పాటుచేసి, తగిన ప్రోత్సాహం అందించడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో 10వేల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రాజెక్టు నిర్వహణ, నిధుల మంజూరుకు సంబంధించిన జాతీయ స్థాయి కమిటీ (ఎన్-పి.ఎం.ఎ.ఎఫ్.ఎస్.సి.),..  2,200 ఎఫ్.పి.ఒ.లను వివిధ అమలు సంస్థలకు కేటాయించింది. 2020-21వ సంవత్సరానికి ఈ కేటాయింపు జరిగింది. 500 ఎఫ్.పి.ఒ.లను చిన్నకారు రైతుల వ్యవసాయ వాణిజ్య కూటములకు, 600 ఎఫ్.పి.ఒ.లను జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుకు,  500 ఎఫ్.పి.ఒ.లను జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు (ఎన్.సి.డి.సి.కి), 100 ఎఫ్.పి.ఒ.లను కర్ణాటక వాటర్ షెడ్ అభివృద్ధి శాఖకు, 50 ఎఫ్.పి.ఒ.లను హర్యానా చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటములకు (ఎస్.ఎఫ్.ఎ.లకు), 50 ఎఫ్.పి.ఒ.లను తమిళనాడు చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటములకు, మరో 50 ఎఫ్.పి.ఒ.లను ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ (నెరమాక్)కు, 100 ఎఫ్.పి.ఒ.లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకానికి (ఎన్.ఆర్.ఎల్.ఎం.కు) కేటాయించారు. 2020-21వ సంవత్సరానికి ఈ కేటాయింపు జరిగింది. అదనంగా, ప్రత్యేకమైన ఎఫ్.పి.ఒ.లను కూడా ఏర్పాటు చేయనున్నారు. వంద సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను వ్యవసాయ, సహకార రైతు సంక్షేమ శాఖకు చెందిన సమగ్ర పోషకాహార నిర్వహణ సంస్థ ఏర్పాటు చేస్తుంది. మరో వంద నూనె గింజల సాగుదార్లతో కూడిన ఎఫ్.పి.ఒ.లను కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తుంది. వివిధ సరకుల ఉత్పత్తికి సంబంధించిన మరో 50 ఎఫ్.పి.ఒ.లను నాఫెడ్ ఏర్పాటు చేస్తుంది.

  వివిధ ఎఫ్.పి.ఒ.లను అమలుచేసే సంస్థలు కూడా బ్లాకుల వారీగా ఎఫ్.పి.ఒ. క్లస్టర్లను గుర్తించాయి. క్లస్టర్లు కేంద్రాలుగా పనిచేసే వాణిజ్య సంస్థలు (సి.బి.ఒ.లు) ఈ ఎఫ్.పి.ఒ.లను అభివృద్ధి చేస్తాయి. ఇలాంటి కొన్ని ఎంపిక చేసిన సి.బి.ఒ.లను గుర్తించిన నాఫెడ్, వాటిని ఇప్పటికే తన కమిటీ (ప్యానెల్.)లో పొందుపరిచింది. మిగతా సి.బి.ఒ.లను చేర్చుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

   భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) అనేది,.. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధఇలో జాతీయ స్థాయిలో ఏర్పాటైన 4వ సంస్థ. 10వేల వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటములు (ఎస్.ఎఫ్.ఎ.సి.లు), జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్.సి.డి.సి.)లకు తోడుగా నాఫెడ్ 4వ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిదారుల, కొనుగోలుదారుల సమాఖ్య (ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.-ఫీఫా)ను కూడా నాఫెడ్ ఇటీవల స్వాధీనం చేసుకుంది. భాగస్వామ్య వర్గాలన్నింటికీ సమానంగా అదాయం లభించేలా వ్యవసాయ ఉత్పత్తి విలువల వ్యవస్థలను కుదించడానికి,  సుస్థిరమైన చిన్న సంస్థలను నెలకొల్పేందుకు, పారదర్శకత పెంపుదలకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని వేగవంతం చేసేందుకు నాఫెడ్ ఈ చర్య తీసుకుంది. తేనె ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటును ఫీఫా తన ప్రధాన కార్యక్రమంగా నిర్వహిస్తోంది.

 

  ఇటీల ఐదు రాష్ట్రాల్లోని తేనెటీగల పెంపకందార్లతో, తేనె సేకరణ దార్లతో ఎఫ్.పి.ఒ.లను నాఫెడ్ ఇటీవల ఏర్పాటు చేసింది. తన కమిటీలో పొందుపరిచిన క్లస్టర్ వాణిజ్య సంఘాలు (సి.బి.బి.ఒ.లు), వ్యవసాయ వాణిజ్య నిపుణుల భారతీయ సంఘం (ఐ.ఎస్.ఎ.పి.) ద్వారా ఈ ఎఫ్.పి.ఒ.లను రూపొందించి, వాటిని ప్రోత్సహిస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సుందర్ బన్స్, బీహార్ లోని తూర్పు చంపారాన్, ఉత్తరప్రదేశ్ లోని మథుర, మధ్యప్రదేశ్ లోని మోరెనా, రాజస్థాన్ లోని భరత్ పూర్ ప్రాంతాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయి. తేనె ఉత్పత్తికి సంబంధించిన తొలి ఎఫ్.పి.ఒ. మధ్యప్రదేశ్ లో నమోదైంది. చంబల్ ఎఫ్.ఇ.డి. సాహద్ ఉత్పాదక్ సహకారీ సమితి పేరిట జాతీయ తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి పథకం కింద ఈ ఎఫ్.పి.ఒ. నమోదైంది. సహకార సంఘాల చట్టం ప్రకారం 2020 నవంబరు 11న నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, మోరెనా జిల్లాలో 68 గ్రామాలతో కూడిన 5 బ్లాకులు ఈ ఎఫ్.పి.ఒ. పరిధిలోకి వస్తాయి. మిగతా 4 ఎఫ్.పి.ఒ.లు బీహార్, రాజస్థాన్, ఉత్తప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని 340 గ్రామాలు ఈ ఎఫ్.పి.ఒ.ల కిందికి వస్తాయి. ఈ ఐదు ఎఫ్.పి.ఒ.ల ద్వారా 4నుంచి 5వేల మంది తేనెటీగల పెంపకందార్లు, తేనె సేకరణదార్లు నేరుగా ప్రయోజనం పొందుతారు.

   జాతీయ తేనెటీగల పెంపకం మండలి (ఎన్.బి.బి.), నాఫెడ్.ల ఆధ్వర్యంలో,  వ్యవసాయ వాణిజ్య నిపుణుల భారతీయ సంఘం (ఐ.ఎస్.ఎ.పి.) రూపొందించిన తేనె ఉత్పత్తి దారుల ఎఫ్.పి.ఒ.లు పలు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంలో సభ్యుల నైపుణ్యాల పెంపుదలకు, తేనె,.. అనుబంధ ఉత్పత్తులైన తేనెపట్టు మైనం, తేనెటీగల జిగురు, రాయల్ జెల్లీ, బీ-వెనమ్ వంటి వాటి శుద్ధీకరణకు అధునాతన మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాల్లో ఈ ఎఫ్.పి.ఒలు సహాయపడతాయి. నాణ్యతా ప్రమాణాల నిర్వహణకు పరిశోధనాగారాల నిర్వహణ, తేనె సేకరణ, నిల్వ, సీసాల్లో నిపడం, మార్కెటింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాల్లో కూడా ఇవి సహకరిస్తాయి. జాతీయ తేనె పెంపకం, తేనె పథకం (ఎన్.బి.హెచ్.ఎం.) కింద మినీ మిషన్-1, మినీ మిషన్-2 పథకాల ద్వారా ఈ ఎఫ్.పి.ఒ.లకు ప్రయోజనం లభిస్తుంది. ఉత్పత్తి చేసిన తేనెకు  బ్రాండింగ్, తేనె,.. తదితర అనుబంధ ఉత్పత్తులకు ఉమ్మడిగా మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వంటి అంశాల్లో 5రాష్ట్రాలకు చెందిన తేనెటీగల పెంపకం దార్లకు, తేనె సేకరణ దార్లకు నాఫెడ్ పరిధిలోని మార్కెటింగ్ వ్యవస్థ సహకారం లభిస్తుంది. తేనెటీగల పెంపకం దార్లకు, తేనె సేకరణ దార్లకు ఆదాయం మరింత పెంచేందుకు విదేశాల్లో మార్కెటింగ్ అవకాశాలపై అన్వేషణకు కూడా ఈ ఎఫ్.పి.ఒ.లు కృషి చేస్తాయి.

<><><><>

 


(Release ID: 1676322) Visitor Counter : 246