ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ.25 కోట్ల విలువైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కుంభకోణంలో ఇద్దరిని అరెస్టు చేసిన గురుగావ్ డీజీజీఐ
Posted On:
20 NOV 2020 4:44PM by PIB Hyderabad
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గురుగావ్ ప్రాంతీయ యూనిట్, హర్యానాలోని బహదూర్‌ఘర్‌కు చెందిన నరేష్ మిట్టల్, ఛెడిలాల్ మిట్టల్‌ను అరెస్టు చేసింది. ఈ ఇద్దరు వరసకు అన్నదమ్ములు. దిల్లీ-6లోని నయా బజార్‌లో ఇద్దరికీ వ్యాపారాలున్నాయి.
22 అనుమానాస్పద సంస్థల నుంచి వస్తువుల అమ్మకాలు లేకుండానే నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించిన కేసులో దిల్లీ-6లోని సదర్ బజార్‌లో ఉన్న ఒక సంస్థపై (పేరును ప్రకటించడం లేదు, ఎక్స్ కంపెనీగా వ్యవహరించవచ్చు) విచారణ కొనసాగుతోంది. ఈ 22 సంస్థల నమోదిత చిరుమానాలకు అధికారులు వెళ్లితే, అక్కడా సంస్థలు లేవని తేలింది. కొన్ని సంస్థలిచ్చిన చిరునామాల్లో ఖాళీ స్థలాలున్నాయి. మరికొన్ని సంస్థలు నకిలీ విద్యుత్ బిల్లులు, అద్దె ఒప్పందాలను చిరునామాగా జీఎస్‌టీ పోర్టల్‌లో చూపాయి. బ్యాంకు ఖాతాల కోసం ఇచ్చిన వివరాలు కూడా తప్పుడువేనని, లేదా ఇతరుల వివరాలున్నాయని తేలింది. ఆయా సంస్థల నమోదిత చిరునామాలకు తాఖీదులు పంపితే, ఆ చిరునామాతో ఏమీ లేదని, చిరునామా సరిగా లేదని, అసలక్కడేమీ లేదన్న కారణాలతో వెనక్కు వచ్చాయి.
ఎక్స్ సంస్థ యజమాని వాంగ్మూలాన్ని అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. చెల్లింపులన్నీ ఆర్‌టీజీఎస్ ద్వారా చేశానని, ఆ వివరాలను రెండు రోజుల్లో సమర్పిస్తానని ఆ వాంగ్మూలంలో అతను చెప్పాడు. ఆ తర్వాత అతను వివరాలను సమర్పించలేదు. బ్యాంకు ఖాతా లావాదేవీలను అధికారులు పరిశీలిస్తే, చెల్లింపుల నమోదులో సంస్థల పేర్లు రాసినా, ఆ ఖాతాలు మాత్రం ఇతరుల పేర్లతో ఉన్నాయని తేలింది.
దిల్లీ నయా బజార్‌లో ప్రాగ్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట ఈ తరహా సంస్థ ఒకటి ఉంది. సూపర్ టెక్, తులసియన్ ఇంపెక్స్, ఇతర సంస్థల నుంచి ఈ సంస్థకు ఆర్‌టీజీఎస్/ఆన్‌లైన్ ద్వారా భారీ మొత్తంలో నగదు అందినట్లు బ్యాంకు లావాదేవీలు చెబుతున్నాయి. ఈ సంస్థలో సోదాలు జరిపినప్పుడు; పీసీ ట్రేడర్స్ అనే సంస్థకు కూడా ఇవే సంస్థలు, ఇతర సంస్థల నుంచి భారీ మొత్తంలో నగదు ఆర్‌టీజీఎస్/ఆన్‌లైన్ ద్వారా అందినట్లు వెల్లడైంది. విచారణలో తప్పును ఒప్పుకున్న సోదరులిద్దరూ, తమ ఖాతాలకు డబ్బు వచ్చిందని, "అంగడియా"ల ద్వారా దానిని నగదు రూపంలో తీసుకున్నామని చెప్పారు. తమ కమీషన్ మినహాయించుకుని, మిగిలిన డబ్బును తిరిగి ఎక్స్ సంస్థకు, ఇతర సంస్థలకు పంపామని వెల్లడించారు. ఇతరుల పేర్లపై తాను నాలుగు డొల్ల సంస్థలను సృష్టించి, 4-5 శాతం కమీషన్‌తో వస్తువులు అమ్మినట్లు నకిలీ బిల్లులు సృష్టించానని ఛెడీలాల్ చెప్పాడు. ఎక్స్ సంస్థపై దర్యాప్తు జరుగుతోందని తెలియగానే, పాత సంస్థలను మూసివేసి, కొత్త పేర్లతో సంస్థలను సృష్టించి మోసాన్ని కొనసాగించినట్లు కూడా అతను తెలిపాడు.
ఈ నాలుగు సంస్థలకు రూ.26.06 కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అందిందని, రూ.25 కోట్లను ఇతరులకు పంపినట్లు ఛెడిలాల్ విచారణలో వెల్లడించాడు. అధికారులు నిందితులిద్దరినీ గురువారం అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం ఆ ఇద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
***
(Release ID: 1674559)
Visitor Counter : 117