జల శక్తి మంత్రిత్వ శాఖ

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం

ఉత్తమ సేవలందించిన 20 జిల్లాలకు కేంద్ర మంతుల చేతుల మీదుగా
స్వచ్ఛతా అవార్డులు,.. 9మంది సర్పంచులతో మంత్రి సంభాషణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జనోద్యమంగా రూపుదాల్చిన స్వచ్ఛ భారత్ పథకం, భారతదేశాన్ని ఎంతో పరివర్తన చెందించింది. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాల సాధనకోసం దేశం ఐదేళ్లలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది.

Posted On: 19 NOV 2020 5:28PM by PIB Hyderabad

 

  ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాల (ఒ.డి.ఎఫ్.) సాధనలో సుస్థిరతను సాధించి, ఒ.డి.ఎఫ్. ప్లస్ పథకం లక్ష్యాల సాధనలో గణనీయమైన ఫలితాలు సాధించిన 20 ఉత్తమ జిల్లాలకు 2020వ సంవత్సరపు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, జలశక్తి సహాయ మంత్రి రత్తన్ లాల్ కటారియా ప్రదానం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ (డి.డి.డబ్ల్యు.ఎస్.) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)కు చెందిన కేంద్ర, రాష్ట్రాల, జిల్లాల అధికారులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,..జన ఉద్యమంగా రూపుదాల్చిన స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకం గ్రామీణ భారతాన్ని పూర్తిగా పరివర్తన చెందించిదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, నాయకత్వంలో పారిశుద్ధ్య సాధనలో ప్రజలను మమేకం చేయడంతో గ్రామీణ ప్రాంతాలు ఎంతో పరివర్తన చెందాయన్నారు. గ్రామీణ భారతాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దే కృషికి సంబంధించి గత ఐదేళ్లలో ఎన్నో మైలురాళ్లను అధిగమించినట్టు చెప్పారు. ఈ అసాధారణ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పథకం రెండవ దశకు ఈ ఏడాది మొదట్లోనే శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాల సాధనలో సుస్థిరత, ఘన, ద్రవ వ్యర్థాల నిర్మూలనా నిర్వహణ (ఎల్.ఎల్.డబ్ల్యు.ఎమ్), గ్రామాల్లో సమగ్ర స్థాయి పరిశుభ్రత తదితర అంశాలపై రెండవ దశలో దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పారు. సురక్షితమైన సామాజిక, ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలతో గ్రామీణ సమాజానికి అనుసంధానం ఏర్పచడం చాలా ముఖ్యమన్నారు. స్వచ్ఛతా లక్ష్యంతో కూడిన ప్రజా ఉద్యమంలో ఎంతో విలువైన సేవలందించిన వారిని గుర్తిస్తూ ఈ రోజు పురస్కారాలను అందజేస్తున్నట్టు మంత్రి షెఖావత్ తెలిపారు.  

  స్వచ్ఛ భారత్ మిషన్ పథకం అమలులో భాగస్వామ్యం వహించి వారందరి సేవలూ అభినందనీయమని జలశక్తి సహాయమంత్రి రత్తన్ లాల్ కటారియా అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్వచ్ఛ భారత్ పథకాన్ని  ప్రశంసనీయంగా అమలు చేయడం గర్వకారణమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య ప్రమాణాల మెరుగుదలకోసం సేవలందించి, అవార్డులు పొందిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ 2వ దశలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.  

  కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి యు.పి. సింగ్ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ తొలిదశలో గణనీయ సేవలందించిన ఆయా రాష్ట్రాల స్వచ్ఛ భారత్ మిషన్ బృందాలను అభినందించారు. మరుగుదొడ్ల వినియోగం, సమగ్ర పరిశుభ్రతవంటి అంశాలపై, రెండవ దశలో పేర్కొన్న లక్ష్యాలు మరింత ముఖ్యమన్నారు.

  ఒ.డి.ఎఫ్. ప్లస్ లక్ష్యాల సాధనలో విశేషమైన సేవలందించిన వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన 9మంది సర్పంచులతో కేంద్రమంత్రి  ఆన్ లైన్ ద్వారా సంభాషించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్మూలనా నిర్వహణ (ఎల్.ఎల్.డబ్ల్యు.ఎమ్) కోసం తాము కీలకంగా నిర్వహించిన కార్యకలాపాలను, ప్రజల భాగస్వామ్యాన్ని గురించి సర్పంచులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. స్ఫూర్తిదాయకమైన తమ విజయ గాథలను వారు ఆన్ లైన్ మీడియా ద్వారా మంత్రికి తెలిపారు. ఒ.డి.ఎఫ్. ప్లస్ కార్యక్రమంపై స్వచ్ఛతా కే పంచ్ మంత్ర పేరిట రూపొందించిన లఘుచిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఒ.డి.ఎఫ్. కార్యక్రమానికి సంబంధించిన కీలకమైన అంశాలను ఈ లఘుచిత్రంలో సృజనాత్మక రీతిలో ప్రదర్శించారు.

 

  ఈ రోజు స్వచ్ఛతా అవార్డులు పొందిన జిల్లాలు వరుసగా,.. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి (ఆంధ్రప్రదేశ్), సియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), కాంకర్, బేమేతారా (చత్తీస్ గఢ్), వడోదర, రాజ్ కోట్ (గుజరాత్), భివానా, రేవారీ (హర్యానా), ఎర్నాకులం, వేనాడ్ (కేరళ), కొల్హాపూర్, నాసిక్ (మహారాష్ట్ర), కొలాసిబ్, సెర్చిప్ (మిజోరాం), మోగా, ఫతేగఢ్ సాహిబ్ (పంజాబ్), సిద్దిపేట, పెద్దపల్లి (తెలంగాణ), కూచ్ బిహార్ (పశ్చిమ బెంగాల్).

 

*****

 


(Release ID: 1674173) Visitor Counter : 258