రైల్వే మంత్రిత్వ శాఖ

ఇకపై ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో పాటుగా

ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు శిక్షణ

హైదరాబాద్, సర్దార్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో తర్ఫీదు

తదుపరి బ్యాచ్ ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో పాటుగా

ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు తొలిదశ శిక్షణ

క్షేత్రస్థాయిలో ఉభయ సర్వీసుల మధ్య మెరుగైన సమన్వయం, సహకారమే లక్ష్యం

Posted On: 13 NOV 2020 5:52PM by PIB Hyderabad

భారతీయ రైల్వే రక్షణ దళం సర్వీసు (ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్..)కు ఎంపికైన అధికారులకు ఇకపై హైదరాబాద.లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్.వి.పి.ఎన్.పి.ఎ.)లో శిక్షణ ఇవ్వబోతున్నారు. తదుపరి బ్యాచ్ రైల్వే రక్షణ దళం అధికారులకు తొలిదశ శిక్షణను, ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో సహా అందించబోతున్నారు. ఉభయ సర్వీసుల అధికారులకు ఒకే చోట శిక్షణ ఇవ్వడంవల్ల, వారిని క్షేత్రస్థాయి యూనిట్లలో నియమించినపుడు, ఉభయ సర్వీసుల మధ్య మరింత మెరుగైన సమన్వయం నెలకొనే అవకాశం ఉంటుంది.

  ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) నియమిస్తుంది. సివిల్ సర్వీసు పరీక్షల నిర్వహణ ద్వారా వారిని ఎంపిక చేస్తారు. ప్రతి సంవత్సరం 5 లేక ఆరుగురి బ్యాచ్ తో ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. ప్రొబేషనర్ల ఎంపిక జరుగుతుంది. వారికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా సంస్థ (ఎల్.బి.ఎస్.ఎన్.ఎ.ఎ.)లోను, వడోదరలోని జాతీయ రైల్వే అకాడమీ (ఎన్.ఎ.ఐ.ఆర్.)లోను ఫౌండేషన్ కోర్సులో శిక్షణ కల్పిస్తారు. లక్నోలోని జగ్జీవన్ రామ్ రైల్వే రక్షణ దళం అకాడమీలో కూడా వారికి వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు.

  ఇప్పటివరకూ 1998నుంచి 1999వరకూ మొత్తం 3 బ్యాచులకు సంబంధించిన ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు ఐ.పి.ఎస్. అధికారులతో కలిపి శిక్షణ అందించారు. అయితే, ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ పద్ధతిని నిలిపివేశారు.

  అయితే, ఇదే పద్ధతిని తిరిగి ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు.  రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు, చర్చల అనంతరం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు కెరీర్ ప్రారంభ శిక్షణను, ఈ ఏడాది శీతాకాలంలో మొదలయ్యే తదుపరి బ్యాచ్ ఐ.పి.ఎస్. ప్రొబేషనర్లతో కలిపి నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణనను మొదలు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 

   ఎస్.వి.పి.ఎన్.పి.ఎ.లో శిక్షణ సందర్భంగా ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్. అధికారులకు మరింత సమర్థవంతమైన తర్ఫీదు లభించే అవకాశం ఉంది. దీనివల్ల రైల్వే భద్రతా విధులను వారు మరింత సామర్థ్యంతో, మెరుగైన వృత్తి నైపుణ్యంతో నిర్వహించేందుకు వీలవుతుంది. శిక్షణ అనంతరం ఐ.ఆర్.పి.ఎఫ్.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులను క్షేత్రస్థాయి యూనిట్లలో నియమించినపుడు ఉభయ సర్వీసుల అధికారుల మధ్య మెరుగైన సమన్వయం, సహకారం ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ భద్రతా యంత్రాంగంలో రైల్వే భధ్రతా విభాగానికి నానాటికీ ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో,..రైల్వే భద్రతా దళం వృత్తిపరంగా మరింత సామర్థ్యం, నాయకత్వ పటిమను అలవర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఉద్యోగ ప్రారంభంలోనే ఐ.పి.ఎస్. అధికారులతో పాటుగా శిక్షణ అందించినపుడే  వారికి వృత్తిపరంగా, విధినిర్వహణపరంగా మెరుగైన సామర్థ్యం అలవడుతుంది.

**********



(Release ID: 1672788) Visitor Counter : 120