పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

జాతీయ రాజధాని ప్రాంతం, సరిహద్దు ప్రాంతాల్లో వాయు నాణ్యత

పరిస్థితులపై వాయు నాణ్యత కమిషన్‌ సమీక్ష

తక్షణం అమలు చేయాల్సిన 10 చర్యలు గుర్తింపు

Posted On: 09 NOV 2020 6:10PM by PIB Hyderabad

జాతీయ రాజధాని ప్రాంతంతోపాటు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు నాణ్యత పరిస్థితులపై, వాయు నాణ్యత కమిషన్‌ సభ్యులు సమీక్ష నిర్వహించారు. వివిధ సంస్థలు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, వాయు నాణ్యత మెరుగుదలకు ఇంకా చేపట్టాల్సిన చర్యలపైనా చర్చలు జరిపారు.
    
    మరిన్ని చర్యలు చేపట్టడానికి సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపాలని కమిషన్‌ గుర్తించింది. వాయు కాలుష్యాన్ని తక్షణం తగ్గించడానికి ప్రస్తుతమున్న నిబంధనలు, చట్టాలతోపాటు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరాన్ని కమిషన్‌ స్పష్టీకరించింది. 

    వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రజా చైతన్యం కూడా ముఖ్యమని కమిషన్‌ భావిస్తోంది. తక్షణం చేపట్టాల్సిన పది చర్యలను గుర్తించింది:
1. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం
2. తప్పనిసరైతే తప్ప వాహనాలను వాడకపోవడం
3. ఇంటి నుంచే పని విధానాన్ని ప్రోత్సహించడం
4. నిర్మాణ ప్రాంతాలు సహా అన్ని చోట్లా ధూళి నియంత్రణ చట్టాలు, నిబంధనల అమలును కఠినం చేయడం
5. మున్సిపాలిటీ ఘన వ్యర్థాలు, బయోమాస్‌ దహనాన్ని అడ్డుకునే చర్యలను కఠినంగా అమలు చేయడం
6. దుమ్ము రేగే ప్రాంతాల్లో నీరు చల్లడాన్ని పెంచడం
7. కాలుష్యాన్ని పెంపొందించే ప్రాంతాల్లో, ముఖ్యంగా నిర్మాణ ప్రదేశాల్లో యాంటీ స్మోగ్‌ గన్‌ల వినియోగం
8. పంట వ్యర్థాల దహనం, బాణసంచా వినియోగంపై ప్రస్తుత నిబంధనలు, న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్ల ఆదేశాలను గట్టిగా అమలు చేయడం
9. ఎక్కడైనా వాయు కాలుష్య సంఘటనలు జరిగితే సమీర్‌ యాప్‌లో నమోదు చేసేలా సామాజిక స్ఫృహ గల ప్రజల నుంచి సహకారం కోరడం
10. భవిష్యత్తులో బొగ్గు వినియోగం తగ్గించేలా జాతీయ రాజధాని ప్రాంతంలోని పరిశ్రమలను ప్రోత్సహించడం

 

***



(Release ID: 1671659) Visitor Counter : 242