ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రత్యేక రుణాల ద్వారా రాజస్థాన్ కు రూ. 4,604కోట్లు

జి.ఎస్.టి. అమలుతో లోటు భర్తీకోసం తొలి ప్రత్యామ్నాయం ఎంపిక

Posted On: 05 NOV 2020 6:43PM by PIB Hyderabad

  వస్తుసేవల పన్ను (జి.ఎస్.టి.) అమలు కారణంగా తలెత్తిన ఆదాయం లోటును ప్రత్యేక రుణాల మార్గం ద్వారా తీర్చుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆదాయం లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సూచించిన రెండు ప్రత్యామ్నాయాల్లో తొలిదానికి తాము సమ్మతిస్తున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీనితో మొదటి ప్రత్యామ్నాయం ఎంపిక చేసుకున్న 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల (ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, పుదుచ్చేరి) జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది.

  భారత ప్రభుత్వం సూచనల ప్రకారం తొలి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే రాష్ట్రాలకు జి.ఎస్.టి. అమలుతో తలెత్తే ఆదాయం లోటు మొత్తం ప్రత్యేక రుణాల ద్వారా అందుతుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గం ఇప్పటికే అమలులోకి వచ్చింది. దీనిద్వారా భారత ప్రభుత్వం రాష్ట్రాల తరఫున ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ. 12వేల కోట్లు రుణం తీసుకుంది. దీన్ని 21రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు 2020 అక్టోబు 23న బదలాయించింది. ఇదే మార్గంద్వారా సేకరించిన నిధులు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి కూడా అందబోతున్నాయి. రెండవ విడత నిధులు 2020 నంవబరు 9వ తేదీ విడుదలవుతాయి.

  తొలి ప్రత్యామ్నాయం నిబంధనల ప్రకారం ప్రత్యేక రుణాల సదుపాయంతోపాటుగా, రాష్ట్ర స్థూల స్వదేశీ ఉత్పాదన (జి.ఎస్.డి.పి.)లో చివరి విడత 50శాతం మొత్తాన్ని రుణంగా పొందేందుకు షరతుల్లేని అనుమతులు లభిస్తాయి.  2020 మే నెల 17న భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రకటించిన రెండు శాతం అదనపు రుణాల కింద ఈ సదుపాయం రాష్ట్రాలకు లభిస్తుంది. రూ. 1.1లక్ష కోట్ల ప్రత్యేక రుణాలకు అదనంగా ఈ సదుపాయం లభిస్తుంది. జి.ఎస్.టి. అమలుతో తలెత్తిన ఆదాయం లోటును భర్తీ చేసుకునేందుకు రాజస్థాన్ కు అందిన తొలి  ప్రత్యామ్నాయానికి తోడు  భారత ప్రభుత్వం 2020 నవంబరు 5న అదనపు రుణాలకు అనుమతి ఇచ్చింది. రాజస్థాన్  జి.ఎస్.డి.పి.లో 5శాతానికి సమానమైన రూ. 5,462కోట్లను ఆ రాష్ట్రం రుణంగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

   తొలి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ము కాశ్మీర్, పుదుచ్చేరి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.  21 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా రుణాలు తెచ్చుకునేందుకు ఇచ్చిన అనుమతులు, ప్రత్యేక మార్గం ద్వారా రుణాల ద్వారా ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన నిధుల మొత్తం తదితర వివరాలు అనుబంధంలో పొందుపరిచారు. ఆయా రాష్ట్రాలవారీగా అందవలసిన నిధులను 2020 నవంబరు 5వరకూ బదలాయించారు.

***

 

 



(Release ID: 1670555) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi