జల శక్తి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా రూ. 10,211 కోట్ల విలువైన డ్యాముల పునరావాసం మరియు అభివృద్ధికి జాతీయ ప్రాజెక్టును ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

డ్యాముల భద్రతకు హామీ, దేశంలో జల భద్రత పెంపు మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా స్థిరమైన అభివృద్ధికి తోడ్పాటును అందించే ప్రాజెక్టుల అమలు

Posted On: 29 OCT 2020 4:33PM by PIB Hyderabad

గురువారం 2020 అక్టోబర్ 29వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో విదేశీ ఆర్ధిక సహాయంతో చేపట్టే 'డ్రిప్' (DRIP) రెండవ మరియు మూడవ దశ ప్రాజెక్టును ఆమోదించారు.  తొలుత ఈ ప్రాజెక్టును పందొమ్మిది (19) రాష్ట్రాలు,  మూడు (3) కేంద్ర సంస్థలలో చేపడతారు. పదేళ్ళపాటు అమలుచేసే  ఈ  ప్రాజెక్టుకు బడ్జెటులో   రూ. 10,211 కోట్లు కేటాయిస్తారు.  ఈ స్కీమును రెండు  దశల్లో అమలు చేస్తారు.  ఒక్కొక దశ ఆరేళ్ళ పాటు ఉంటుంది.  ఐదు, ఆరవ సంవత్సరాలలో రెండు దశల పనులు రెండూ ఒకేసారి (ఓవర్లాప్) అమలవుతాయి.  కీలకమైన డ్యాములకు సంబంధించి భౌతిక పునరావాసం,  సామర్ధ్యం పెంపునకు నిధుల కేటాయింపు ఉంటుంది.  తద్వారా  డ్యాములను మంచిగా నిర్వహించడానికి సుశిక్షితులైన, నిపుణులైన  పనివారు లభ్యమయ్యేలా నిశ్చయం చేసుకుంటారు.  

ప్రపంచంలో డ్యాముల నిర్వహణలో 5334 పెద్ద డ్యాములతో  చైనా, అమెరికా తరువాత ఇండియా  మూడవ స్థానంలో ఉంది.  ప్రస్తుతం 411  డ్యాములు నిర్మాణంలో ఉన్నాయి.   అనేక వేల చిన్న డ్యాములు కూడా ఉన్నాయి.  దేశంలో జలభద్రత ఉండేలా చూసేందుకు  ఈ డ్యాములు ముఖ్యమైనవి.   ప్రతి ఏటా సుమారుగా 300 బిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయడం ద్వారా మన దేశ ఆర్ధిక మరియు వ్యవసాయ అభివృద్ధికి భారతీయ డ్యాములు మరియు రిజర్వాయర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.  

ఆస్తుల నిర్వహణ మరియు భద్రతలో ఈ డ్యాములు ప్రధానమైన బాధ్యతను నిర్వహిస్తున్నాయి. డ్యాముల  నిర్వహణ సరిగా లేకపోతే విపత్తులు వాటిల్లే అవకాశం ఉంటుంది.  డ్యాముల వైఫల్యం వల్ల  ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు  పర్యావరణం నాశనమవుతుంది.  ఇంతకు ముందు  చేపట్టిన 'డ్రిప్' మొదటి దశ 7 రాష్ట్రాలలో 223 డ్యాములను సమర్ధవంతంగా నిర్వహించి భద్రతను మెరుగుపరచడానికి తోడ్పడింది.  ఈ కార్యక్రమం మొత్తం మీద దేశంలో డ్యాముల భద్రతను పటిష్టం చేసింది.  

వివిధ రకాల భద్రతతో  పాటు చెమ్మను తగ్గించే పనులు,  కట్టడం స్థిరతకు సంబంచిందిన చర్యలు తీసుకుంటున్నారు.  .  డ్యాముల స్థితిగతులను పర్యవేక్షించి వాటి భద్రతను సమర్ధవంతంగా నిర్వహించడానికి సంబంధించిన 'ధర్మ' DHARMA (Dam Health and Rehabilitation Monitoring),వ్యవస్థ 18 రాష్ట్రాలలో ఉపయోగిస్తున్నారు.  అదేవిధంగా భూకంపాల వల్ల రానున్న ముప్పును విశ్లేషించే సమాచార వ్యవస్థ 'షైసిస్'ను  (SHAISYS)  కూడా అభివృద్ధి చేస్తున్నారు.    

ప్రస్తుతం అమలులో ఉన్న డ్రిప్ మొదటి దశ పనులు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా కొత్త స్కీములకు ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ చెరొక 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తాయి.  దీంతో 19 రాష్ట్రాలలో పెద్ద డ్యాముల పునరావాస మరియు అభివృద్ధి పనులు చేపడుతారు.  

డ్యాముల వైఫల్యం వల్ల నదీ ప్రవాహపు దిగువ భాగంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా కాపాడేలా చూడటం ఈ స్కీము ప్రధాన లక్ష్యం. ఇందుకోసం పనులు చేపట్టడం, నిర్వహించడానికి సంబంధించిన కరదీపికలను ,  అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను  చేయడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు  వివిధ ఇతర చర్యలను రూపొందించడంతో పాటు భౌతిక పునరావాసం వంటి చర్యలు ఉన్నాయి.  

ఈ చర్యల వల్ల  ఎంపికచేసిన రిజర్వాయర్ల జీవితకాలం పెరుగుతుంది.  నీటిపారుదల, మంచినీటి సౌకర్యాలు పెరగడం, జల విద్యుత్,  వరదల నివారణ వంటి ప్రత్యక్ష ప్రయోజనాలు కలుగుతాయి.  

ఈ కార్యక్రమం సహకార ఫెడరలిజానికి నమూనా వంటిది.   రాష్ట్రాలు విదేశీ సంస్థల నుంచి రుణ సహాయం పొంది తమ డ్యాముల పునరావాసానికి చర్యలు తీసుకోవచ్చు.  కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందజేస్తుంది.  డ్యాముల నిర్వహణలో ఉత్తములైన వృత్తినిపుణులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటుంది.  అంతేకాక ప్రముఖ విద్యా సంస్థలు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు ,  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భాగస్వాములుగా మారుతాయి.  డ్యాము యజమానులతో పాటు  అయిదు (5) కేంద్ర సంస్థల సామర్ధ్యం పెంపు ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేస్తారు. డ్యాము యజమానులకు సహాయం చేయాలనే  దీర్ఘకాలిక ప్రయోజనాల లక్ష్యంతో ఇందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని మరియు జనశక్తి వనరులను సమీకరించుకోవడం ద్వారా  ఇండియా డ్యాముల భద్రత రంగంలో  దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో అగ్రగామిగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది.  

ఆ విధంగా ఈ కార్యక్రమం దేశంలో డ్యాముల భద్రతా సంస్కృతిని వృద్ధి చేస్తుంది.  

ఈ కార్యక్రమం డ్యాముల భద్రతా బిల్లు, 2019 నిబంధనలను పరిపూర్ణం చేస్తుంది.  ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఈ  చర్యలన్నింటి వల్ల నైపుణ్యం లేని కార్మికులకు 10 లక్షల పని దినాలు,  వృత్తి నిపుణులకు 2.50 లక్షల పని దినాలు ఉత్పత్తి అవుతాయి.  జలభద్రత పెరుగుతుంది మరియు  ధారణీయ అభివృద్ధికి తోడ్పడుతుంది.  

***



(Release ID: 1668701) Visitor Counter : 166