వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్, ఒమన్ ఉమ్మడి కమిషన్ 9వ సమావేశం

Posted On: 19 OCT 2020 9:40PM by PIB Hyderabad

    భారత్- ఒమన్ ఉమ్మడి కమిషన్ 9వ సమావేశం (జె.సి.ఎం.) 2020 అక్టోబరు 19న వర్చువల్ పద్ధతిలో జరిగింది. భారత్ తరఫున కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రి హర్ దీప్ సింగ్ పూరి, ఒమన్ తరఫున ఆదేశ వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి ఖ్యైస్ బిన్ మొహ్మద్ అల్ యూసెఫ్ ఈ సమావేశానికి ఉమ్మడిగా ఆధ్యక్షత వహించారు. ఉభయదేశాల మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు సమావేశంలో పాలుపంచుకున్నారు. 

  వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాల్లో ఇటీవలి పరిణామాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరణకు, పరస్పరం వాణిజ్యంలో పెట్టుబడులను ప్రోత్సహించుకోవాలని ఇందుకోసం ఉభయదేశాలూ చిత్తశుద్ధితో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల్లో ఇప్పటిదాకా వినియోగించుకోని సామర్థ్యాలను వాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వ్యవసాయం, ఆహార భద్రత, ప్రమాణాల రూపకల్పన, వాతావరణ విభాగం, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య, ఔషధ రంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంతరిక్ష పరిశోధన, పౌర విమానయానం, పునరుత్పత్తి ఇంధనంతో సహా ఇంధన రంగం, సాంస్కృతిక వ్యవహారాలు, ఉన్నత విద్య వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఉభయపక్షాలూ తీర్మానించుకున్నాయి.

  అలాగే గనుల తవ్వకం, తూనికలు, కొలతల శాస్త్ర ప్రమాణాలు, ఆర్థిక మేధాసంపత్తి, సాంస్కృతిక వ్యవహారాలు, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ తదిదర రంగాల్లో కొనసాగుతున్న అవగాహనా పత్రాల ప్రక్రియ ప్రగతిపై కూడా సమీక్షించారు. ఈ ప్రక్రియను సత్వరం సంపూర్ణంగా ముగించాలని ఉభయపక్షాలు అంగీకారానికి వచ్చాయి. భారత్, ఒమన్ డబుల్ టాక్సింగ్ ఒప్పందం సవరణకు, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ధ్రువీకరణకు, అవసరమైన అంతర్గత సంప్రదింపులను సత్వరం పూర్తి చేయాలని కూడా భారత్, ఒమన్ తీర్మానించుకున్నాయి. కోవిడ్ -19 వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆరోగ్య, ఆర్థిక ప్రతికూల పరిస్థితులపై ఉభయ పక్షాల ప్రతినిధులు పరస్పరం అభిప్రాయులను పంచుకున్నారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి (ఐ.ఎస్.ఎ.) ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఒమన్ చూపిన చొరవను భారత్ అభినందించింది.

  స్వదేశీ తయారీ రంగానికి ప్రోత్సాహం, సులభతర వాణిజ్య నిర్వహణకోసం ప్రభుత్వ తీసుకునే చర్యల గురించి కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి వివరించారు. వివిధ రంగాల్లోని ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహకా పథకాల అమలుకోసం తీసుకున్న చర్యలను కూడా మంత్రి వివరించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఒమన్ ప్రభుత్వాన్ని, ఒమన్  ప్రైవేటు సంస్థలను ఆయన ఆహ్వానించారు.

  భారత్, ఒమన్ దేశాల మధ్య వేలాది సంవత్సరాలుగా స్నేహ బంధం, సన్నిహిత బాంధవ్యాలు కొనసాగుతూ వస్తున్నాయి. వాణిజ్యం, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో సంబంధాలు క్రియాశీలకంగా ఉంటున్నాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఈ రంగాల్లో ఉభయ పక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా కుదిరాయి. ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడమే ఈ వ్యూహాత్మక సంబంధాలు కీలకాంశం.  

  ఒమన్ అగ్రస్థాయి వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతూ వస్తోంది. ఒమన్ చేసుకుంటున్న దిగుమతులపరంగా చూస్తే ఆ దేశానికి, భారత్ 3వ అతిపెద్ద దేశంగా ఉంటోంది. ఒమన్ నుంచి చమురు కాకుండా ఇతర సరుకుల ఎగుమతుల పరంగా చూస్తే, భారత్ 3వ అతిపెద్ద మార్కెట్ గా కొనసాగుతోంది. 2019-20లో ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, 5.93 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది, అంటే, అంతకు ముందు సంవత్సరం కంటే 8.5శాతం ఎక్కువగా ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. 2019-20లో ఒమన్ కు భారత్ నుంచి 2.26 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఒమన్ నుంచి 3.67బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి.  

  ద్వైపాక్షికంగా పెట్టుబడుల ప్రవాహం కూడా బాగా సాగుతోంది. ఒమన్ లోని ఇనుము ఉక్కు, సిమెంట్, ఎరువులు, జవుళి, కేబుల్స్, రసాయనాలు, మోటారు వాహనాలు తదితర గంలాల్లో భారతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఒక అంచనా ప్రకారం, 2000వ సంవత్సరం ఏప్రిల్ నుంచి 2020 జూన్ వరకూ,  4,100కు పైగా భారతీయ సంస్థలు 7.5 బిలియన్ అమెరికన్ డాలర్లమేర పెట్టుబడులు పెట్టాయి. ఇదే కాలంలో ఒమన్ నుంచి 535.07 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ కు తరలి వచ్చాయి.

  ఉమ్మడి కమిషన్ 9వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రక్రియను మరింత ముందుకు సాగించాలని ఉభయపక్షాలు నిర్ణయించుకున్నాయి. సమావేశంలో చర్చించిన అంశాలపై ఉభయదేశాల మంత్రిత్వ శాఖలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. 

 

****



(Release ID: 1666287) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Manipuri