మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో విద్యారంగం జాతీయ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి చేరుకోవడమే కాకుండా సంపూర్ణమైన స్థాయికి చేరుకుంటోందని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యావిధానం - 2020 అనేది స్వీయ అనుభవాలకు, మమేకమై నేర్చుకునే విధానానికి ప్రాధాన్యతనిస్తోంది : డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్
మాతృభాషను మరింత బలోపేతం చేయనున్న ఎన్ ఇ పి -2020
Posted On:
19 OCT 2020 8:04PM by PIB Hyderabad
ప్రతి మనిషి తన జీవితాంతం నేర్చుకుంటూనే వుంటాడని స్వామి వివేకానందులవారు అంటుండేవారు. స్వీయ అనుభవాల ప్రపంచమే అసలైన గురువు అని ఆయన చెబుతుండేవారు అని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు. స్వామి వివేకానందుని విద్యా దార్శనికత, జాతీయ విద్యా విధానం 2020 అనే అంశం మీద రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( ఆర్ కెఎం విఇఆర్ ఐ) నిర్వహించిన వెబినార్ లో కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పా్ల్గొన్నారు.
శాస్త్ర విజ్ఞానంలోను, కళల్లోను విద్యాబోధన కోసం ఒకప్పుడు దేశ విదేశాలనుంచి భారతదేశానికి విద్యార్థులు వచ్చేవారని వారు నలందా, తక్షశిల లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకునేవారని శ్రీ రమేష్ పోఖ్రియాల్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ వివేకానందులవారి ఆదర్శాల గురించి వసుధైక కుటుంబకం అనే భారతీయ తత్వాన్ని గురించి మాట్లాడారు. ప్రజలను కష్టాలనుంచి బైటపడేయడమే విజ్ఞాన ఆర్జన అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. ఆర్ కెఎంవిఇఆర్ విద్యాసంస్థ కార్యకలాపాలను ప్రశంసించారు. ఈ విద్యాసంస్థ వివేకానందుని ఆదర్శాల ప్రకారం నడుచుకుంటూ వుందని అన్నారు. జీవితాన్ని సముచితమైన రీతిలో సమాజానికి ఉపయోగకరమైన రీతిలో జీవించేలా రామకృష్ణ మిషన్ సంస్థ తన విద్యార్థులను తీర్చిదిద్దుతోందని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం స్వీయ అనుభవాలద్వారా, మమేక జీవనంద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ పోఖ్రియాల్ అన్నారు. ఈ విధానం స్వామి వివేకానందుని ఆదర్శాలతో కూడుకొని వుందని ఆయన అన్నారు. మనిషి తన విజ్ఞానాన్ని తనలోనే వుంచుకోవద్దని స్వామి వివేకానందులు అన్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ విద్యావిధానమనేది విద్యార్థిలోని బుద్ధికి పదును పెడుతుందని, మేధస్సు ఎదగడానికి, అలాగే వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. ప్రతి మనిషిలో విజ్ఞానం వుంటుందని మనుషులు కేవలం దాన్ని కనుగొనడం చేస్తారని కేంద్ర మంత్రి అన్నారు. వేదాంతాన్ని, శాస్త్ర విజ్ఞానంతో మేళవించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన చెప్పారు. ఈ ప్రపంచం పిరికిపిందలకోసం కాదని, ధైర్యవంతులకోసమని స్వామి వివేకానంద చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం సమాజంలో అందరినీ భాగస్వాములను చేస్తుందని, సంపూర్ణమైన విద్యను అందిస్తుందని ఆయన అన్నారు. సమానత్వం, నాణ్యత పరంగా జాతీయ విద్యావిధానాన్ని అందుబాటులోకి తేవాల్సిన సమయమిదని ఆయన అన్నారు.
మనదేశంలోని యువత... బ్రిటీష్ పాలకుల్లాంటి బైటవారి వత్తిడి లేకుండా తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలని స్వామీజీ ఆశించినట్టు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దేశీయంగానే నూతన ఆవిష్కరణలు రావాలన్న విషయాన్ని స్వామి వివేకానందులు చెప్పారని అన్నారు. అందుకోసమే నూతన విద్యా విధానం రూపొందిందని స్పష్టం చేశారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, చరకలాంటి శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితమే దేశంలో విజ్ఞానాన్ని పెంపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. నూతన విద్యావిధానం ద్వారా రూపొందిన విద్యాప్రణాళిక నిర్మాణం ప్రధాని దార్శనికత ప్రకారం సంపూర్ణ విద్యనందించేలా తయారైందని కేంద్ర మంత్రి అన్నారు.. నూతన విద్యా విధాన లక్ష్యం మాతృభాషకు మరింత ప్రాధాన్యతనివ్వడం కూడా అని ఆయన అన్నారు.
దేశంలో కొనసాగాల్సిన సాంకేతిక రంగ అభివృద్ధి గురించి మాట్లాడిన డాక్టర్ పోఖ్రియాల్..దీనికి సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత విద్య చాలా అవసరమని అన్నారు. ఈ అంశంలో ప్రపంచంతో పోటీ పడడానికిగాను ఈ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంకోసం ఐఐటిలు, ఐఐఎస్ ఇ ఆర్ లతో కూడిన జాతీయ సాంకేతిక వేదికను ఏర్పాటు చేసినట్టు కేంద్రమంత్రి వివరించారు. పలు అంతర్జాతీయ సంస్థలైన మైక్రోసాప్ట్, గూగుల్ లాంటివాటిలో భారతీయ నిపుణులు నాయకత్వంవహిస్తున్నారని గుర్తు చేసిన కేంద్రమంత్రి , ప్రపంచ దేశాలు ఇక ముందు విద్యార్జన విషయంలో తమ యువతను భారతదేశానికి పంపవచ్చని సూచించారు. ఆసియా దేశాలకు చెందిన వేయి మందికి పైగా విద్యార్థులు ఇప్పుడు భారతదేశంలో చదువుకుంటున్నాని మంత్రి అన్నారు. జాతీయ విద్యా విధానం కారణంగా మన భారతీయ విద్యార్థులు బైట దేశాలకు వెళ్లి చదువుకోకుండా దేశంలోనే చదువుకుంటారని కేంద్రమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు అందరికీ తగిన ఉద్యోగాలు కూడా దేశంలోనే లభిస్తాయని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. జాతీయవిద్యావిధానం ద్వారా భారతదేశం తగినంతగా బలోపేతమవుతుందని ఆయన అన్నారు. లేవండి, చైతన్యం పొందండి, లక్ష్యాన్ని చేరుకునేంతవరకూ విశ్రమించకండి అని స్వామీ వివేకానందులు చెప్పిన ప్రకారం జాతి నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ కె ఎం విఇఆర్ ఐ కి చెందిన పలువురు ప్రముఖులు మాట్లాడారు.
***
(Release ID: 1666002)
Visitor Counter : 141