ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎస్‌బీఐ అధీకృత శాఖల్లో ఎన్నికల బాండ్ల విక్రయం

Posted On: 16 OCT 2020 7:57PM by PIB Hyderabad

జనవరి 2, 2018న ఇచ్చిన గెజిట్‌ ప్రకటన నం.20 ద్వారా, ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల ప్రకారం, భారత పౌరులు లేదా భారత్‌లో ఏర్పాటు చేసిన లేదా విలీనం చేసిన సంస్థలు వీటిని కొనవచ్చు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులు కలిసి కొనవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 29ఎ ప్రకారం నమోదై, గత పార్లమెంటు లేదా శాసనసభ ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు సాధించిన పార్టీలు ఈ బాండ్లను స్వీకరించడానికి అర్హులు. అర్హత ఉన్న పార్టీలు, అధీకృత బ్యాంకులో ఉన్న ఖాతా ద్వారా మాత్రమే ఈ బాండ్లను నగదుగా మార్చుకోగలవు.

    ఈనెల 15వ తేదీ నాటి ఎన్నికల సంఘం లేఖ నం.437/6/సీజీ/ఎల్‌ఏ-బీఆర్‌/ఈసీఐ/ఎల్‌ఈటీ/ఎఫ్‌యూఎన్‌సీటీ/ఎంసీసీ/2020 ద్వారా, ఈ క్రింది షరతుల ప్రకారం, ప్రవర్తన నియమావళి నుంచి ఎన్నికల సంఘం నిరభ్యంతరాన్ని ప్రకటించింది.

i) ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రసంగాలు లేదా పత్రిక ప్రకటన లేదా ప్రజలతో సంభాషణ రూపంలో ఏ రాజకీయ పార్టీ ఈ విషయంలో సూచనలు చేయకూడదు.
ii) ఈసీఐ జారీ చేసిన ప్రవర్తన నియమావళి నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

    14వ దఫా విక్రయాల్లో భాగంగా, 19.10.2020 నుంచి 28.10.2020 వరకు, 29 అధీకృత శాఖల ద్వారా ఎన్నికల బాండ్లను జారీ చేయడానికి, నగదుగా మార్చడానికి ఎస్‌బీఐకి అనుమతి జారీ అయింది.

    జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకు మాత్రమే ఎన్నికల బాండ్లు చెల్లుబాటు అవుతాయి. గడువు తీరిన తర్వాత జమ చేసిన బాండ్లకు రాజకీయ పార్టీలు నగదు పొందలేవు. అర్హత ఉన్న రాజకీయ పార్టీలు, ఎన్నికల బాండ్లను బ్యాంకులో జమ చేసిన రోజునే వాటి ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

***


(Release ID: 1665374) Visitor Counter : 247