హోం మంత్రిత్వ శాఖ
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ రైజింగ్ డే
ఎన్ఎస్జీ ‘మిషన్ గ్రీన్ ఆరావళి' ను ప్రశంసించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
16 OCT 2020 5:13PM by PIB Hyderabad
ఆరావళి కొండల్లో పచ్చదనం పెంచడానికి 'మిషన్ గ్రీన్ ఆరావళి' పేరుతో జాతీయ భద్రతా దళం చేస్తున్న కృషిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దీ నెలల్లోనే ఎన్ఎస్జి కమాండోలు రెండు లక్షలకు పైగా మొక్కలను నాటారు. ఎన్ఎస్జి 36 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కిషన్ రెడ్డి, సిబ్బంది, వారి కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, "సర్వత్ర సర్వోత్తం సురక్ష" అనే తమ నినాదానికి అనుగుణంగా జీవిస్తున్న అధికారులను, సిబ్బందిని అభినందించారు.
శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్జి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, ఒక అత్యంత-సమర్థవంతమైన వ్యక్తుల బృందమని, మన దేశాన్ని, మన పౌరులని రక్షించడం కోసం వీరు తుది శ్వాస వరకు పట్టు వదలకుండా పోరాడతారని, వారి సేవల్ని కొనియాడారు . ఈ కారణంగానే, ఎన్ఎస్జి ప్రతి పౌరుడి హృదయంలో ప్రత్యేక స్థానం పొందింది అని, శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హోంమంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలోని, దూరదృష్టి గల కేంద్ర ప్రభుత్వం, దేశమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తోందని మంత్రి సభకు తెలియజేశారు. గత అనుభవాలను, భవిష్యత్ సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేగవంతమైన వాహనాలు, ఆధునిక ఆయుధాలతో ఎన్ఎస్జిని, కేంద్రం బలోపేతం చేస్తోందని తెలిపారు. జాతీయ భద్రతా దళాన్ని మరింత ధృఢంగా చేయడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అంతకుముందు, డైరెక్టర్ జనరల్ శ్రీ సుర్జీత్ సింగ్ దేస్వాల్ ముఖ్య అతిథి శ్రీ కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, ఆయన తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు, ఇంకా ఎన్ఎస్జి సిబ్బంది మనోధైర్యాన్ని పెంచుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ హైజాకింగ్, అత్యంత ముప్పు గల వ్యక్తుల రక్షణ (హెచ్టిపి), రాష్ట్ర పోలీసు దళాల సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి వృత్తిపరమైన రంగాల్లో ఎన్ఎస్జి ఏ విధంగా విజయాలు నమోదు చేసిందో డిజి మంత్రికి వివరించారు. ప్రపంచ స్థాయిలో శూన్య లోపం దళంగా ఉంటూ, కఠిన పరిస్థితుల్లో వృత్తిపరమైన నైపుణ్యం కనబరుస్తూ, తమ ప్రభావాన్ని చూపిస్తోందని, ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలు, సామాగ్రిని సమకూర్చుకుంటూ వేగంగా ముందుకు వెళ్తోందని డిజీ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌జి తమ క్రమశిక్షణను కొనసాగిస్తూ, దానికి కేటాయించిన ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూ ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గౌరవ చిహ్నంగా ‘‘ శౌర్య స్థల్ ’’ వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఎన్‌ఎస్‌జికి చెందిన 19 మంది అమరవీరులకు అంకితం చేసిన ‘‘శౌర్య’’ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి ఎన్‌ఎస్‌జి సిబ్బందికి పోలీసు పతకాలు, అవార్డులు అందజేశారు. మన దేశపు అత్యుత్తమ అత్యవసర దళం, ఎన్‌ఎస్‌జి యొక్క 36 వ రైజింగ్ డే ను మనేసర్‌లో ఎంతో ఉత్సుకతతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.
***
(Release ID: 1665179)
Visitor Counter : 122