మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

రూర్కీ ఐ.ఐ.టి.లో కొత్త లెక్చర్ హాల్, సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, అధునాతన ఎస్.టి.పి. ప్రారంభం.

లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్

మానవాళికి, జంతువుల మధ్య సంఘర్షణ సమస్యకు తగిన పరిష్కారాన్ని రూర్కీ ఐ.ఐ.టి. కనుగొనాలి. శాస్త్రీయమైన, సామాజిక బాధ్యత నిర్వహణకు కృషి చేయాలి

Posted On: 13 OCT 2020 6:24PM by PIB Hyderabad

   రూర్కీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) ఆవరణలో నిర్మించిన కొత్త లెక్చర్ హాల్. సముదాయాన్ని, సెంట్రలైజ్డ్ హీటింగ్ , వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలను, మురుగునీటి శుద్ధి ప్లాంటును (ఎస్.పి.టి.ని)  కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూర్కీ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ అజిత్ కె. చతుర్వేది, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోరంజన్ పరీదా, ఐ.ఐ.టి.లోని వివిధ అధ్యయన విభాగాల, అధ్యయన కేంద్రాల డీన్స్, అసోసియేట్ డీన్స్, అధిపతులు, ఇన్ చార్జి ప్రొఫెసర్, జాయింట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

   ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ,.. భారతదేశానికే గర్వకారణంగా రూర్కీ ఐ.ఐ.టి.  నిలిచిందని, ఆసియాలోలోనే అతి ప్రాచీన సాంకేతిక పరిజ్ఞాన సంస్థల్లో ఇదీ ఒకటని అన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞాన సంస్థల్లో ఒకటైన రూర్కీ ఐ.ఐ.టీ., విద్యారంగంలో ప్రతిభావంతమైన సంస్థగా ఉన్నత ప్రమాణాన్ని సృష్టించిందన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న ‘నవ భారతావని’ నిర్మాణానికి ఈ సంస్థ ఎంతో క్రీయాశీలమైన సేవలందిస్తోందన్నారు. జీవవైవిధ్యంతో సుసంపన్నమైన హిమాలయ ప్రాంతంలో రూర్కీ ఐ.ఐ.టి. ఉందన్నారు. అయితే,.. ఇక్కడ మానవాళికి, జంతువులతో సంఘర్షణ సాధారణమైపోయిందని, ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని రూర్కీ ఐ.ఐ.టి. కనుగొనాలని, శాస్త్రీయమైన, సామాజిక బాధ్యతను నిర్వహణకోసం ఐ.ఐ.టి. కృషి చేయాలని కేంద్రమంత్రి సూచించారు.

   దేశంలోని యువత కొత్త తరం మేధావివర్గంగా ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికా వ్యవస్థను 2020వ సంవత్సరపు కొత్త విద్యావిధానం రూపొందించిందని పోఖ్రియాల్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. వేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను, భవిష్యత్తు సవాళ్లను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పుకోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నూతన విద్యావిధానం అమలుతో విద్యార్థులు మరింత జ్ఞానసంపన్నులవుతారని, దేశ ప్రగతికి బాటలు వేస్తారని, డిజిటల్ ఇండియాగా, స్వావలంబనతో దేశాన్ని తీర్చిదిద్దుతారని అన్నారు.

   కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ధోత్రే మాట్లాడుతూ,..విద్యలో నాణ్యతను పెంపొందించే కృషిలో మౌలిక సదుపాయాల పాత్ర కీలకమని, రూర్కీ ఐ.టి.ఐ.లో కొత్తగా ప్రారంభించిన లెక్చర్ హాల్ సముదాయం, సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, మురుగునీటి శుద్ధి ప్లాంటు.. మౌలిక సదుపాయాల స్థాయిని మరింత పెంపొందిస్తాయన్నారు. సంస్థ భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల్లో ప్రపంచ ప్రమాణాలను అందుకోవడానికి ఈ సదుపాయాలు దోహదపడతాయని అన్నారు. భవష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో రూర్కీ ఐ.ఐ.టీ. విజయం సాధించాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

   రూర్కీ ఐ.ఐ.టి.లో లెక్చర్ హాల్ సముదాయ నిర్మాణాన్ని 2016లో, రూ. 80.25కోట్ల ఖర్చుతో చేపట్టారు. మొత్తం 13,254చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 4,400మంది సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 250మంది సామర్థ్యంతో కూడిన ఒక్కో తరగతి గది చొప్పున మొత్తం ఏడు గదులకు ఇందులో సదుపాయం కల్పించారు. 150మంది సామర్థ్యంతో కూడిన 11 తరగతి గదులను, 24మంది విద్యార్థులతో కూడిన 24 తరగతి గదులను కూడా ఏర్పాటు చేశారు.  

  కొత్తగా నిర్మించిన సెంట్రలైజ్డ్ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ద్వారా ఒకటవ, రెండవ లెక్చర్ హాల్ భవన సముదాయాలకు సదుపాయం కలుగుతుంది. అలాగే, కాన్వొకేషన్ హాలుకు చిల్ట్ వాటర్ కూలింగ్ పరిజ్ఞాన సేవలు అందుతాయి. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు రూ. 14.35కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తం వ్యవస్థకు బిల్డింగ్ మేనేజిమెంట్ వ్యవస్థ ద్వారా రిమోట్ కంట్రోల్ తో నియంత్రించే సదుపాయం ఉండటం విశేషం. ఇంధనాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకునే రీతిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.

    ఇక మురుగు నీటి, వృధా నీటి శుద్ధీకరణ ప్లాంటును (ఎస్.పి.టిని), రోజుకు 30లక్షల లీటర్ల మురుగునీటి శుద్ధి సామర్థ్యంతో  నిర్మించారు. రూర్కీ ఐ.ఐ.టి. ఆవరణలోని సి-క్లాస్ క్లబ్ సమీపంలో సోలానీ కుంజ్ వద్ద 1800చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రూ. 27.73కోట్ల మొత్తం వ్యయంతో నిర్మించారు. సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ ప్రక్రియను వినియోగించుకుని ఈ ఎస్.టి.పి. పనిచేస్తుంది. ఇది నివాస ప్రాంతంలో ఉన్నందున ఎలాంటి దుర్వాసన రాకుండా అదనపు నియంత్రణ ఏర్పాట్లతో ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. అధునాతనమైన ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ (పి.ఎల్.సి.), సూపర్వైజరీ కంట్రోల్, డాటా అక్విజిషన్ (ఎ.సి.ఎ.డి.ఎ.) వ్యవస్థలను ఈ ప్లాంటుకు అమర్చారు. రూర్కీ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ చతుర్వేది మాట్లాడుతూ,..తమ సంస్థలో కొత్తగా నిర్మించిన మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడానికి తమ విలువైన సమయాన్ని కేటాయించిన కేంద్ర మంత్రికి, కేంద్ర సహాయ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రూర్కీ ఐ.ఐ.టి. ప్రగతి సాధనలో వారి ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.

 

*****

 


(Release ID: 1664288) Visitor Counter : 77


Read this release in: English , Urdu , Hindi , Tamil