కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇ పి ఎఫ్ ఓ ప్రయత్నాలకు స్పందన ఖాతాదారుల సమస్యల పరిష్కారానికి అందుబాటులోకి వాట్సాప్ హెల్ప్ లైన్

నిర్బద్ కింద ప్రారంభం
నూతన విధానంలో 164000 సమస్యలకు పరిష్కారం

Posted On: 13 OCT 2020 5:19PM by PIB Hyderabad

తన సభ్యులకు మరింత మెరుగైన సేవలను అందించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి  వాట్సాప్ ఆధారంగా పనిచేసే వ్యవస్థను  ఇ పి ఎఫ్ ఓ ప్రారంభించింది. కోవిడ్-19 నేపథ్యంలో తన ఖాతాదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా త్వరితగతిన సేవలను అందించడానికి నిర్బద్ కార్యక్రమంలో భాగంగా ఇ పి ఎఫ్ ఓ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాట్సాప్ ఆధారంగా పనిచేసే ఈ సేవకు ఇ పి ఎఫ్ ఓ సభ్యుల నుంచి మంచి స్పందన వస్తున్నది. వాట్సాప్ ద్వారా ఇంతవరకు ఇ పి ఎఫ్ ఓ 1,64,040  ఫిర్యాదులను  పరిష్కరించింది. దీనితో ఫేస్ బుక్ / ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదుల / విచారణల సంఖ్య 30 % మేరకు మరియు ఇ పి ఫ్ ఐ జి ఎం ఎస్ ( సమస్యల పరిష్కారానికి ఇ పి ఎఫ్ ఓ ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వేదిక ) ద్వారా అందుతున్న ఫిర్యాదుల / విచారణల సంఖ్య 16  % మేరకు తగ్గాయి. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఇ పి ఎఫ్ ఓ తన సేవలను వెబ్ ఆధారిత ఇ పి ఫ్ ఐ జి ఎం ఎస్ పోర్టల్, సి పి జి ఆర్ ఎఎం ఎస్ లతో పాటు సామాజిక మాధ్యమాలు ( పేస్ బుక్, ట్విట్టర్ ), 24  గంటలూ పనిచేసే కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్నది.  అందుబాటులో ఉన్న వేదికలతో వాట్సాప్ ఆధారంగా పనిచేసే సేవను అందుబాటులోకి తెచ్చింది.

    భారతదేశంలో సమాచార వ్యాప్తికి వాట్సాప్ అతి పెద్ద వేదికగా మారినట్టు గుర్తించిన ఇ పి ఎఫ్ ఓ తన సభ్యులు ఖాతాదారులతో నేరుగా సంప్రదింపులు జరపడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ఈ విధానంవల్ల పి ఎఫ్ ఖాతాదారులు ఇ పి ఎఫ్ ఓ ప్రాంతీయ కార్యాలయాలతో వ్యక్తిగతంగా మాట్లాడగలుగుతారు.ఇంటిలో కూర్చుని ఇ పి ఎఫ్ ఓ సేవలను త్వరితగతిన సులువుగా వారు పొందగలుగుతారు.

 

    దేశవ్యాపితంగా ఉన్న తన 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఇ పి ఎఫ్ ఓ తన వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించి సభ్యులు ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చును. ఇ పి ఎఫ్ ఓ సేవలకు సంబంధించిన సమాచారాన్ని తమ పి ఎఫ్ ఖాతా అనుసంధానం చేయబడిన ప్రాంతీయ కార్యాలయం నుంచి పొందవచ్చును. ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్ నెంబర్లు ఇ పి ఎఫ్ ఓ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు.

      మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డిజిటల్ విధానంలో అన్ని సేవలను సభ్యులకు అందుబాటులోకి తేవాలన్న అంతిమ లక్ష్యంతో ఇ పి ఎఫ్ ఓ పనిచేస్తున్నది. సమస్యలను తక్షణం పరిష్కరించి, అనుమానాలను త్వరితగతిన నివృతి చేయడానికి ఇ పి ఎఫ్ ఓ తన ప్రాంతీయ కార్యాలయాల్లో నిపుణులను నియమించడం జరిగింది.

        వాట్సాప్ సేవలు అందుబాటులోకి రావడంవల్ల సందేహాలను నివృత్తి చేసుకోడానికి ఇకపై కార్యాలయాలకు వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం ఉండదు. దీనివల్ల ఇ పి ఎఫ్ ఓ కార్యాలయాల్లో రద్దీ తగ్గి కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటించడానికి అవకాశం కలుగుతుంది.

     కోవిడ్ నేపథ్యంలో తన సభ్యులతో నేరుగా సంబంధాలను కలిగి ఉండటానికి హెల్ప్ లైన్ అందుబాటులోకి తెచ్చుకోవాలని  ఇ పి ఎఫ్ ఓ నిర్ణయించింది. దీనిని పటిష్టంగా అమలు చేయడం ద్వారా సభ్యులకు మరింత వేగంగా ,పారదర్శకంగా సేవలను అందించవచ్చునని  ఇ పి ఎఫ్ ఓ భావిస్తున్నది.

                                                                       

***

 



(Release ID: 1664239) Visitor Counter : 159