రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఎ.పి.లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభం

లాంఛనంగా శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి సదానంద గౌడ
పి.ఒ.ఎస్.3.1 సాఫ్ట్ వేర్, ఎస్.ఎం.ఎస్. గేట్వే సేవలు కూడా మొదలు
కోవిడ్ కారణంగా, 3.1సాఫ్ట్ వేర్ వర్షన్ కింద
ఒ.టి.పి. ఆధారిత ఆథెంటికేషన్ ప్రారంభం
కొత్త ఐ.టి. వ్యవస్థ రూపకల్పనలో నిర్విరామంగా పనిచేసిన ఎ.పి. ప్రభుత్వం, ప్రత్యక్ష నగదు బదిలీ బృందం: సదానంద గౌడ

Posted On: 30 SEP 2020 6:37PM by PIB Hyderabad

   ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్.బి.కె.ల) ద్వారా రైతులకు ఎరువులు అందజేసే సదుపాయాన్ని, పాయింట్ ఆఫ్ సేల్ 3.1 సాఫ్ట్ వేర్.ను, ఎస్.ఎం.ఎస్. గేట్ వే వ్యవస్థను కేంద్ర రసాయనాలు, ఎరువల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ,. 2020, సెప్టెంబరు 30న ప్రారంభించారు.

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి గౌడ మాట్లాడుతూ, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని 2018, మార్చి 1న దేశవ్యాప్తంగా ప్రారంభించినట్టు తెలిపారు. తొలినుంచి ఈ వ్యస్థ చక్కగా పనిచేస్తోందన్నారు. దేశంలో ఎరువుల పంపిణీకి సంబంధించి మొత్తం వ్యవస్థకు కంప్యూటరీకరణ విధానాన్ని విజయవంతంగా అమలు చేసినది ఎరువుల శాఖ మాత్రమే అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రిటెయిల్ విక్రయ కేంద్రం స్థాయిలో ఎరువుల అందుబాటు పరిస్థితిని వాస్తవ ప్రాతిపదికపై పక్యవేక్షించి తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ వీలు కలిగిస్తుందన్నారు. గత రెండేళ్లకు సంబంధించిన ఎరువుల సబ్సిడీ పూర్తి మొత్తాన్ని ఈ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేసినట్టు చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ ప్రత్యేకతను, సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.

  ఎరువులను ఇంటివద్దకే సరఫరా చేసే వ్యవస్థను  అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా కృషి చేశారని మంత్రి గౌడ అభినందించారు. వాస్తవానికి దేశంలో ఇలాంటి వినూత్నమైన చొరవ చూపిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన అన్నారు.

  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ లాల్ మాండవీయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ, ఎరువుల పంపిణీకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమన్నారు.

   పాయింట్ ఆఫ్ సేల్ (పి.ఒ.ఎస్.) 3.1 సాఫ్ట్ వేర్ వ్యవస్థ ప్రకారం, ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెన్సార్ ను చేతితో తాకాల్సిన అవసరంలేని ఒ.టి.పి. ఆధారిత ఆథెంటికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సెన్సార్ పై వేలిముద్ర అవసరం లేకుండా రైతు ఎరువులను కొనుగోలు చేయడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది.

   గతంలో తాను ఎరువులు కొన్న రిటైల్ విక్రయం కేంద్రంలో తాజాగా ఎరువులు అందుబాటులో ఉన్నాయా అన్నది రైతులు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలుసుకునేందుకు ఎస్.ఎం.ఎస్. గేట్వే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు. ఏదైనా విక్రయ కేంద్రంలో ఎరువుల నిల్వ సమాచారాన్ని 77382 99899 నంబరుకు ఎస్.ఎం.ఎస్. పంపి, తెలుసుకోవచ్చునన్నారు. కొనుగోలు చేసిన ఎరువుల పరిమాణం, చెల్లించిన మొత్తం తదితర వివరాలతో వెంటనే  రైతు మొబైల్ ఫోన్.కు ఎస్.ఎం.ఎస్. వెళ్తుందన్నారు.

  లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి (డి.బి.టి.)ని ఎరువుల శాఖ 2018 మార్చి 1న దేశవ్యాప్తంగా ప్రారంభించింది. డి.బి.టి. రెండవ విడత 2019 జూలైలో మొదలైంది. ఆ తర్వాత ఈ పద్ధతిని అనేక విధాలుగా మెరుగురిచి, పాయింట్ ఆఫ్ సేల్ 3.1 సాఫ్ట్ వేర్ వ్యవస్థ ద్వారా ప్రారంభించారు. పాయింట్ ఆఫ్ సేల్ కింద రెండు రకాల ఆథెంటికేషన్, రీ రిజిస్ట్రేషన్ పద్ధతులతో ఈ విధానాన్ని తీర్చిదిద్దారు. పి.ఒ.ఎస్. 3.1 వెర్షన్ ప్రకారం, ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, చేతితో తాకాల్సిన అవసరంలేని ఒ.టి.పి. ఆధారిత ఆథెంటికేషన్ ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల వేలి ముద్రకోసం సెన్సార్ ను తాకవలసిన అవసరం లేకుండా రైతులు ఎరువులను కొనుగోలు చేయగలుగుతున్నారు.

   ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రైతు భరోసా కేంద్రాల (ఆర్.బి.కె.ల) ద్వారా ఎరువులు అందించే విధానం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని గ్రామ పంచాయతీల్లో 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా  రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉపకరణాలు, అనుబంధ సేవలు అందించడమే లక్ష్యం. ఈ విధానంలో రైతులు తమ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనంతరం తమ ఊర్లలోని ఆర్.బి.కె.లనుంచి ఎరువుల కొనుగోలుకు ఆర్డర్ చేయడానికి వీలుంటుంది. కోరిన ఎరువులు వారి ఇంటి ముంగిటికే ఆర్.బి.కె.ల ద్వారా పంపిణీ చేస్తారు.

  కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్ సుఖ్ లాల్ మాండవీయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఎరువుల శాఖ కార్యదర్శి చబిలేంద్ర రౌల్, ఆ శాఖ సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

                                                                               

***


(Release ID: 1660538) Visitor Counter : 185


Read this release in: English , Hindi , Assamese