ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ ఆరోగ్య నిధి (ఆర్.ఏ.ఎన్) మరియు ఆయుష్మాన్ భారత్ యోజన (ఎ.బి.వై) ఆధ్వర్యంలో ఒ.పి.డి. సేవలు
Posted On:
23 SEP 2020 6:54PM by PIB Hyderabad
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగుల చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్.ఏ.ఎన్) యొక్క గొడుగు పథకాన్ని అమలు చేస్తోంది. సామాజిక-ఆర్థిక కులాల వారీ జనాభా లెక్కల సమాచారం ప్రకారం గుర్తించబడిన పేద మరియు బలహీన కుటుంబాలకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరితే, ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (ఎ.బి-పి.ఎమ్.జె.ఎ.వై) సంవత్సరానికి 5 లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా కలుగ చేస్తుంది. ఈ పథకాల కవరేజీని అవుట్-పేషెంట్ సేవలకు విస్తరించే ప్రతిపాదన లేదు.
అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆసుపత్రి సేవలు మరియు చికిత్స సేవలను అందించడానికి ఎ.బి-పి.ఎమ్.జె.ఎ.వై. మరియు ఆర్.ఏ.ఎన్. యొక్క గొడుగు పథకం కింద తగిన నిధులు కేటాయించబడ్డాయి. 2020-21 సంవత్సరానికి బడ్జెట్ అంచనాల (బి.ఈ) కింద ఎ.బి-పి.ఎమ్.జె.ఎ.వై. పధకానికి 6,400 కోట్ల రూపాయలు మరియు ఆర్.ఏ.ఎన్. యొక్క గొడుగు పథకానికి 177.32 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్.ఏ.ఎన్. గొడుగు పథకానికి బీ.ఈ. 2020-21 లో కేటాయించిన నిధులలో, అరుదైన వ్యాధుల కోసం 77.32 కోట్ల రూపాయలు కూడా కలిసి ఉన్నాయి.
అరుదైన వ్యాధుల జాతీయ విధానం 2020 యొక్క ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ లో ఈ ముసాయిదాను ఉంచి, భాగస్వాములందరి నుండీ వ్యాఖ్యలను ఆహ్వానించారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల చికిత్స వ్యయానికి దోహదం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వ్యక్తులు, కార్పొరేట్ దాతలకోసం ఒక డిజిటల్ వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ నిధుల యంత్రాంగాన్ని రూపొందించడానికి ముసాయిదా విధానంలో అవకాశం ఉంది. ఈ ప్రయోజనం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది.
బి.ఈ. 2019-20 లో ఏ.బి-పి.ఎమ్.జె.ఏ.వై. కోసం 6400 కోట్ల రూపాయలు కేటాయించారు. సవరించిన అంచనాల దశలో దీనిని 3,200 కోట్ల రూపాయలకు తగ్గించారు. వీటిలో 2,993 కోట్ల రూపాయల మేర నిధులను రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
*****
(Release ID: 1658940)
Visitor Counter : 235