ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆరోగ్య మంథన్ కు అధ్యక్షత వహించిన డాక్టర్ హర్షవర్ధన్

“2018 సెప్టెంబర్ లో ప్రారంభించిన నాటి నుంచి 1.26 కోట్ల కన్నా ఎక్కువ మందికి ఉచిత చికిత్స”
12.5 కోట్లకు పైబడి ఇ-కార్డుల జారీ

Posted On: 22 SEP 2020 10:45PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఎబి-పిఎంజెఏవై) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో జరిగిన “ఆరోగ్య మంథన్” కు  కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు.
ఎబి-పిఎంజెఏవైని ఒక “చారిత్రక అడుగు” అని డాక్టర్ హర్షవర్ధన్ కొనియాడుతూ “ప్రపంచంలోనే ప్రభుత్వ మద్దతుతో నడిచే అతి పెద్ద ఆరోగ్య భరోసా పథకం అయిన ఎబి-పిఎంజెఏవై ఆర్థికంగా, సామాజికందా వెనుకబడిన 53 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని, ప్రతీ ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు ద్వితీయ శ్రేణి, ఉన్నత శ్రేణి ఆరోగ్య సంరక్షణ సేవలను నగదురహితంగా అందుబాటులో ఉంచుతోంది. ఇప్పటివరకు రూ.15,500 కోట్లకు పైబడిన చికిత్సలు ఈ స్కీమ్ ద్వారా జరిగాయి. కోట్లాది జీవితాలను కాపాడింది. ప్రతీ ఏడాది వినాశకరమైన ఆరోగ్య సంరక్షణ వ్యయాలతో పేదరికం రేఖకు దిగువకు జారుకుంటున్న6 కోట్ల కుటుంబాలను ఆ దుస్థితికి గురి కాకుండా నిరోధించింది. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారిలో సగం మంది బాలికలు, మహిళలే ఉన్నారు. తుది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఈ పథకం విజయవంతంగా అమలు కావడం నాకు ఆనందం కల్పిస్తోంది” అన్నారు.  ఈ రెండేళ్ల కాలంలో ఈ స్కీమ్ 1.26 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత చికిత్సలు అందించింది. ఇప్పటివరకు 23 వేల ఆస్పత్రులను ప్యానెల్ లో చేర్చారు. 12.5 కోట్లకు పైబడి ఇ-కార్డులు జారీ అయ్యాయి. పిఎంజెఏవై కింద చేసిన వ్యయాల్లో 57 శాతం కేన్సర్, హృద్రోగం, కీళ్ల వ్యాధులు, నియో నాటల్ వ్యాధుల వంటి అత్యున్నత శ్రేణి ఆరోగ్య సేవలకే ఉపయోగపడ్డాయి.

ప్యానెల్ లో చేర్చిన ఆస్పత్రుల్లో 45 శాతం ప్రైవేటు ఆస్పత్రులేనని, ఈ స్కీమ్ కింద చేసిన మొత్తం చికిత్సల్లో 52 శాతం ఈ ఆస్పత్రుల్లోనే జరిగిందని, ఆస్పత్రుల అడ్మిషన్ క్లెయిమ్ సొమ్ము 61 శాతం పెరిగిందని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ స్కీమ్ గల పోర్టబులిటీ సదుపాయం (మార్పిడి) దాని విశిష్ట లక్షణమని ఆయన చెప్పారు. “పిఎంజెఏవై కింద అర్హుడైన రోగి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ప్యానెల్ లో ఉన్న ఏ ఆస్పత్రిలో అయినా చికిత్స పొందవచ్చు. ఈ స్కీమ్ డిజైనింగ్ లోనే ఈ మార్పిడి వసతిని పొందుపరిచాం. దీని వల్ల 1.3 లక్షల మంది వలసదారులు తమ సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే వీలు కలిగింది” అని  వివరించారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ కల నిజం చేయడంలో పిఎంజెఏవై సామర్థ్య నిర్మాణ వైఖరి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ స్కీమ్ అమలుపరుస్తున్న 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆయన అభినందించారు. ఆయుష్మాన్ భారత్  పిఎంజెఏవై స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ విజేతలకు మంత్రి అవార్డులు బహూకరించారు. ఆరోగ్య సంరక్షణ నిరుపేద ప్రజలకు అందించడంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేదందుకు  లబ్ధిదారుల సాధికారత, చికిత్సల నాణ్యత పెంపు, మోసాల సంఖ్య తగ్గింపు, దుర్వినియోగం నివారణ వంటి అమలుకు సంబంధించిన 7 సవాళ్లను అధిగమించేందుకు ఈ స్టార్టప్ లు పలు పరిష్కారాలు సూచించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి ఎబి-పిఎంజెఏవై జాయింట్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. “ఈ కార్యక్రమం మెడికల్ ఆడిట్, ఆరోగ్య బీమా రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు క్లెయిమ్ ల సమర్థవంతమైన ప్రాసెసింగ్;  మోసాలు, దుర్వినియోగం కనిపెట్టి అరికట్టడం వంటి  నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని పెంచుతుందని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు.

ఇదే సమయంలో “ఎబి పిఎంజెఏవై మోసాల నివారణ నియమావళి:  ప్రాక్టీషనర్ల మార్గదర్శక పుస్తకం” కూడా ఆవిష్కరించారు. మోసాల నివారణ మార్గదర్శకాలు, టెక్నిక్ లు, సలహాలు, ప్రస్తుతానికి అమలులో ఉన్న భారతీయ చట్టాల ప్రకారం చట్టపరమైన పరిష్కారాలు/  మార్గాలు ఈ పుస్తకంలో ఉన్నందు వల్ల రాష్ర్టాలకు ఇది సమర్థవంతమైన సాధనంగా ఉంటుందని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే రాష్ర్టాల ఆరోగ్య సంస్థలు ఎబి పిఎంజెఏవైలో చోటు చేసుకునే అక్రమాలు, మోసాలు  గుర్తించి నివారించేందుకు అద్భుతమైన అస్త్రంగా ఉంటుందని ఆయన చెప్పారు.

“ఇంతవరకు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందని వర్గాలు పారిశుధ్య కార్మికులు, రోడ్డు ప్రమాదాల బాధితులు, ట్రక్కు డ్రైవర్లు, ఇతర వర్గాలన్నింటికీ ఈ స్కీమ్ ను విస్తరించడంతో పాటు కేంద్ర ఆరోగ్య పథకాలతో దీన్ని అనుసంధానం చేయడంపై ఈ ఏడాది దృష్టి కేంద్రీకరించబోతున్నాం. అలాగే  ఇటీవల ప్రారంభించిన జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమంతో పాటుగా 130 కోట్ల మంది భారతీయులకు సకాలంలో నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు సరసమైన ధరల్లో అందుబాటులోకి తేవడం కోసం అవసరమైన ఆరోగ్య సంరక్షణ వాతావరణం కల్పించేందుకు, ఆయుష్మాన్ భారత్ ను దేశ ఆరోగ్య వ్యవస్థకు మూల స్తంభంగా మార్చేందుకు కృషి చేస్తాం” అని ఆయన చెప్పారు.

సార్వత్రిక ఆరోగ్య కవరేజిపై  పిఎంజెఏవై ఏ విధంగా దృష్టి పెట్టింది శ్రీ అశ్వినీ కుమార్ చౌబే వివరించారు.

తన వ్యక్తిగత అనుభవాలను వివరిస్తూ సర్వే సంతు నిరామయా అనే ప్రధానమంత్రి కల సాకారం కావడానికి, అందరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.

జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ఏ) సిఇఓ డాక్టర్ ఇందు భూషణ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్ హెచ్ఏకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

***
 



(Release ID: 1658594) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi