వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశంలో పారిశ్రామికాభివృద్ధి రేటును ఉద్దీపింపచేసే చర్యలు

Posted On: 23 SEP 2020 2:35PM by PIB Hyderabad

పారిశ్రామిక వృద్ధి వ్యవస్థాత్మక, విదేశీ, ఆర్థికాంశాలతో పాటు పారిశ్రామిక రంగం, ఇతరత్రా విభాగాల భిన్న స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత పారిశ్రామికాభివృద్ధిలో తగ్గుదల అంతర్జాతీయ వృద్ధిలో క్షీణతతో సమాంతరంగా సాగుతోంది. ఆకస్మికంగా కోవిడ్-19 విరుచుకుపడడం వల్ల  ప్రపంచంలోని కొన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ఉండే అమెరికా, యూరోపియన్ యూనియన్, యుకె, ఇండియా వంటి ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రభావితం అయ్యాయి. కోవిడ్-19 విస్తరణను అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ల ప్రభావంతో ప్రపంచ జిడిపి 2020-21 సంవత్సరంలో తగ్గుతుందని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ అంచనా వేశాయి. మన దేశంలో జాతీయ స్థాయి లాక్ డౌన్ కారణంగా విభిన్న రంగాలు ప్రభావితం అయ్యాయి. అయినప్పటికీ లాక్ డౌన్ సడలించిన అనంతరం ఆర్థిక వ్యవస్థలోని భిన్న రంగాల్లో మెరుగుదల కనిపిస్తోంది.

పరిశ్రమల నిరాశాపూరితమైన వృద్ధిరేటును ఉత్తేజింపచేయడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అవి…
(i) ఎంఎస్ఎంఇలకు నూరు శాతం రుణ గ్యారంటీతో హామీరహిత రుణాలు అందించడం, ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఇలకు పాక్షిక గ్యారంటీతో అనుబంధ రుణ సదుపాయం కల్పన, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎంఎస్ఎంఇలకు ఈక్వటీ మద్దతు అందించే ఫండ్ ఆఫ్ ఫండ్స్ సంస్థలకు అందించే రుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులకు పాక్షిక గ్యారంటీ, రైతులకు అదనపు రాయితీ రుణాల జారీ, వీధి వ్యాపారుల కోసం రుణ సదుపాయం (పిఎం స్వనిధి) వంటి పలు సహాయచర్యలు చేపట్టింది.

(ii) పన్ను ఫైలింగ్ ల వాయిదా, ఇతర చట్టపరమైన కట్టుబాటు గడువుల పొడిగింపు, జిఎస్ టి ఫైలింగ్ ల ఓవర్ డ్యూపై జరిమానా వడ్డీరేటు తగ్గింపు, ప్రభుత్వ సేకరణ నిబంధనల్లో మార్పులు, ఎంఎస్ఎంఇల బకాయిల సత్వర జారీ,  ఎంఎస్ఎంఇలకు ఐబిసి నిబంధనల సడలింపు వంటి పలు నియంత్రణాపరమైన, నిబంధనలపరమైన సడలింపులు ఇచ్చింది. 

(iii) ఆత్మనిర్భర్ ప్యాకేజిలో భాగంగా పలు వ్యవస్థాత్మక సంస్కరణలు ప్రకటించారు. వ్యవసాయ రంగంపై నియంత్రణల తొలగింపు; ఎంఎస్ఎంఇల నిర్వచనం మార్పు;  కొత్త పిఎస్ యు విధానం;  బొగ్గు గనుల వాణిజ్యీకరణ;  రక్షణ, అంతరిక్ష రంగాల్లో  ఎఫ్ డిఐ పరిమితులు పెంపు;  పారిశ్రామిక భూములు అభివృద్ధి;  పారిశ్రామిక సమాచార వ్యవస్థల మెరుగుదల, సామాజిక మౌలిక వసతుల విభాగంలో వయబులిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ పునరుజ్జీవం, కొత్త విద్యుత్ టారిఫ్ విధానం, రంగాలవారీగా సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. 

(iv) ప్రభుత్వం జాతీయ మౌలిక వసతుల జాబితా ప్రారంభించడంతో పాటు దశలవారీ తయారీ కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం విస్తరణ, పెట్టుబడులకు ప్రారంభం నుంచి చివరి వరకు మద్దతు ఇచ్చేందుకు కేంద్రీయ పెట్టుబడుల అనుమతి కేంద్రం ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. దేశీయ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకానికి కార్యదర్శుల సాధికార బృందం, ప్రాజెక్టు అభివృద్ధి విభాగాలు ఏర్పాటు చేశారు. ఇపిఎఫ్ వాటాను తగ్గించడంతో పాటు వలస కార్మికులకు ఉపాధి కల్పన అవకాశం కల్పించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలోని పనివారికి బీమా కవరేజి, ఎంజిఎన్ఆర్ఇజిఏ పనివారికి వేతనాల పెంపు, భవన నిర్మాణ కార్మికులకు మద్దతు చర్యలు, స్వయం సహాయక బృందాలకు హామీ రహిత రుణాలు వంటి ఇతర చర్యలు కూడా ఉన్నాయి.

(v) ఎగుమతిదారులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు వినియోగించుకునేందుకు, వాణిజ్య సరళీకరణకు ఆరిజిన్ సర్టిఫికేట్ జారీకి ఉమ్మడి డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్క జిల్లాకు గల ఎగుమతి సామర్థ్యాలను గుర్తించి ఆయా ఉత్పత్తుల ఎగుమతిలో లోటుపాట్లు సరిదిద్దడం, జిల్లా స్థాయిలో స్థానిక ఎగుమతిదారులు/ తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారంలో ఈ వివరాలు అందచేశారు.
 

***



(Release ID: 1658589) Visitor Counter : 170