యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

గౌర‌వ‌నీయ ప్ర‌ధాని ఫిట్ ఇండియా సంవాదంలో భాగ‌మ‌వ్వ‌డం గౌరవంగా భావిస్తున్నాను : విరాట్ కోహ్లి

ప్ర‌ధాని ఫిట్ ఇండియా సంవాదంలో భాగ‌మ‌వుతున్న ఫిట్ నెస్ ప్ర‌భావ‌శీలుర అభిప్రాయాలు

Posted On: 23 SEP 2020 4:44PM by PIB Hyderabad

సెప్టెంబ‌ర్ 24 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో  ఫిట్ ఇండియా సంవాదం నిర్వ‌హించ‌బోతున్నారు. ఆయ‌న దేశంలోని ప‌లువురు ముఖ్య‌మైన ఫిట్ నెస్ ప్ర‌భావ‌శీలుల‌తో (ఇన్ ఫ్లుయెన్సెర్స్‌) మాట్లాడ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు కూడా పాల్గొన‌బోతున్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని త‌మ ఆలోచ‌న‌ల్ని పంచుకోబోతున్న ప్ర‌భావ‌శీలుల్లో భార‌త‌దేశ క్రికెట్ టీమ్ సార‌థి శ్రీ విరాట్ కోహ్లి, ఫిట్ నెస్ నిపుణుడు మిలింద్ సోమ‌న్‌, పారాలింపియ‌న్ గోల్డ్ మెడ‌లిస్ట్ దేవేంద్ర ఝాఝారియా, పోష‌క ఆహార నిపుణురాలు ర‌జుతా దివేక‌ర్ ( స్థానికంగా ల‌భించే ప‌దార్థాల‌ను ఉప‌యో‌గించి ఆహారాన్ని త‌యారు చేయ‌డంలో నిపుణురాలు, సులువైన ఫిట్ నెస్ సూత్రాలు చెప్ప‌డంలో పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు పోష‌ణ‌కు సంబంధించి అనేక పుస్త‌కాలు ర‌చించారు), జ‌మ్ము కాశ్మీర్ కు చెందిన ఫుట్ బాల్ క్రీడాకారిణి అఫ్సాన్ ఆషిక్‌, ఐఐటి, ఎంఐటిల‌లో అభ్య‌సించిన‌ స్వామి శివ‌ధ్యాన‌మ్ స‌ర‌స్వ‌తి, భార‌తీయ శిక్ష‌ణా మండ‌లికి చెందిన ముకుల్ క‌నిత్క‌ర్ మొద‌లైన వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్నారు. 
భార‌తీయ యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంపైన త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు. గౌర‌వ‌నీయ ప్ర‌ధాని నిర్వ‌హిస్తున్న ఫిట్ ఇండియా సంవాదంలో పాల్గొన‌డం నాకు ద‌క్కిన గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాన‌ని, ఫిట్ నెస్ గురించి ఇంకా ప‌లు విష‌యాల గురించి ఈ కార్య‌క్ర‌మంలో నేను మాట్లాడ‌బోతున్నానంటూ ఆయ‌న వివ‌రించారు. 
 ఫిట్ నెస్ రంగంలో బాగా పేరొందిన‌ ప్ర‌భావ‌శీలుర‌ల‌లో ఒక‌రు శ్రీ మిలింద్ సోమ‌న్‌. ఐర‌న్ మ్యాన్ పోటీలో విజేత‌గా నిలిచారు. ఫిట్ ఇండియా సంవాదంద్వారా త‌న ఫిట్ నెస్ ర‌హ‌స్యాల‌ను పంచుకోబోతున్నారు.చిన్న చిన్న వ్యాయామాల‌ను ప్ర‌చారం చేస్తూ వ‌స్తున్న తాను వాటి గురించి ప్ర‌ధానితో మాట్లాడ‌బోతున్నాన‌ని ఆయ‌న అంటున్నారు.  
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్న‌వారు త‌మ ఫిట్ నెస్ ప్ర‌యాణానికి సంబంధించిన విలువైన అనుభ‌వాల‌ను అంద‌రితో పంచుకోబోతున్నారు. ఇది ఆన్ లైన్ కార్య‌క్ర‌మం. పోష‌ణ‌, ఆరోగ్యం, ఇంకా ఫిట్ నెస్‌కు సంబంధించిన ప‌లు అంశాలు ఈ సంవాదంలో చోటుచేసుకోబోతున్నాయి. 
స్ఫూర్తి ప్ర‌దాత‌గా నిలిచిన‌ పారాలింపియ‌న్ దేవేంద్ర ఝాఝారియా అంద‌రికీ శారీర‌క దారుఢ్యం క‌లిగించాల‌నే ల‌క్ష్యాన్ని క‌లిగి వున్నారు. పారాలింపిక్ క‌మిటీ ప్ర‌తినిధిగా గౌర‌వ‌నీయ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోడీజీతో క‌లిసి ఈ సంవాదంలో పాల్గొన‌బోతున్నానంటూ ఆయ‌న అన్నారు. 
గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ఈ  ఫిట్ ఇండియా ఉద్య‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఆయ‌న దాన్ని గ‌త ఏడాది ఆగ‌స్టు 29న ప్రారంభించారు. మొదటి కార్య‌క్ర‌మంలో మూడున్న‌ర కోట్ల భార‌తీయులు వివిధ అంశాల్లో పాల్గొన్నారు. మ‌రో రెండుకోట్ల మంది గ‌త ఏడాది ఆగ‌స్టు 15న నిర్వ‌హించిన ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. డిజిట‌ల్ ద్వారా వీక్షిస్తూ 30 కోట్ల మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. 
ఫిట్ ఇండియా ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికిగాను ఫిట్ ఇండియా సంవాదాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆరోగ్యం, శారీర‌క దృఢ‌త్వానికి సంబంధించి ప్ర‌జ‌ల‌నుంచి ఆలోచ‌న‌ల్ని స్వీక‌రించి ఈ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకుపోతారు. 
ఎన్ ఐసి వారి లింకు ద్వారా ఎవైనా స‌రే త‌మ పేరును న‌మోదు చేసుకోవ‌చ్చు. లింకు 
https://pmevents.ncog.gov.in ఈ కార్య‌క్ర‌మం డిడి న్యూస్‌, డిడి ఇండియాల‌లో ప్ర‌సార‌మ‌వుతుంది. డిస్నీ హాట్ స్టార్ లాంటి  ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో ప్రసార‌మవుతుంది. 

***
 



(Release ID: 1658584) Visitor Counter : 97