సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ-కశ్మీర్ లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో

జమ్మూడివిజన్ లో కేంద్ర బృందం పర్యటన

Posted On: 19 SEP 2020 8:06PM by PIB Hyderabad

కోవిడ్ బారినుంచి కోలుకుంటున్నవారి శాతంలో దేశంలోనే అతి తక్కువగా జమ్మూలో  నమోదు కావటం పట్ల కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కోవిడ్ పరిస్థితిని కేంద్రం ప్రతిరోజూ పరీక్షిస్తూ ఉంటుందని, జమ్మూలోని వైద్య నిపుణులతో కేంద్ర బృందం సంప్రదింపులు జరుపుతూనే ఉంటుందని చెప్పారు. అదే విధంగా న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ క్రమం తప్పకుండా టెలీ కన్సల్టేషన్స్ జరపటంతోబాటు ఆ ప్రాంతంలో కరోనా తగ్గుముఖం పట్టేదాకా రోజూ సాయం అందిస్తూనే ఉంటుందన్నారు.

జమ్మూ ప్రాంతంలో కోవిడ్ పరిస్థితి కలవరపచే విధంగా ఉన్న నేపథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో  మంత్రికి కేంద్ర బృందం ఆ వివరాలు అందించింది. డాక్టర్ ఎస్ కె సింగ్, డాక్టర్ విజయ్ హండా తో కూడిన కేంద్ర బృందం ప్రస్తుతం జమ్మూలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, అదనపు ఆరోగ్య కార్యదర్శి కిరణ్ అహుజా హాజరయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ ఆరోగ్య సలహాదారు రాజీవ్ భట్నగర్, ఆర్థిక కార్యదర్శి అటల్ దుల్లు, జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ, జమ్మూ ప్రభుత్వ వైద్యకళాశాల  సీనియర్ ఫాకల్టీ సభ్యులు, జమ్మూ డివిజన్ లోని వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు కూడా పాల్గొన్నారు.

హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి ఆక్సీమీటర్లు, సాంద్ర ఆక్సిజెన్ అందించాలని జమ్మూ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూ, కాశ్మీర్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కుంటామని, ఆస్పత్రులలో మెరుగైన చికిత్స అందించి వైరస్ ను అరికట్టే వ్యూహం అమలు చేస్తామని ఆయన అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆక్సిజెన్ సిలిండర్ల కొరత, ఆస్పత్రులలో వైద్య సిబ్బంది కొరత లాంటి సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు.

కేంద్ర ఆరోగ్య, హోం మంత్రిత్వశాఖలు తాను కోరిన వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలోనే కేంద్ర వైద్య బృందాన్ని పంపినందుకు, జమ్మూతోబాటు పరిసర జిల్లాలలో క్షేత్ర స్థాయి పరిస్థితిని అంచనా వేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కేంద్ర బృందం ప్రతిరోజూ అక్కడి వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ మార్గదర్శనం చేస్తుందన్నారు, దీనికి తోడు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వారానికి రెండుసార్లు కన్సల్టేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సంక్షోభం అదుపులోకి వచ్చేదాకా ఈ సాయం కొనసాగుతుందన్నారు.

అవసరమైన అన్ని చర్యలూ అత్యవసర ప్రాతిపదికన  తీసుకుంటూ పరిస్థితిని తిరుగుముఖం పట్టిస్తామని డాక్టర్ జితేంద్రసింగ్ చెప్పారు. ఆస్పత్రులు తప్పనిసరిగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వారి ప్రామాణిక నిర్వహణా పద్ధతులు పాటించాలని, దీనివలన వారిమధ్యనే వైరస్ వ్యాప్తి జరగకుందా చూడవచ్చునని అన్నారు. ప్రజలలు కూడా ఈ విషయంలో అవగాహన పెంచాలని కోరారు. పౌర సమాజంతో, ప్రముఖులతో, మత పెద్దలతో  క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలని, సామాన్యులలో అవగాహన పెంచేందుకు వారి సాయం తీసుకోవాలని ఆర్థిక కార్యదర్శి ( ఆరోగ్యం) అటల్ డుల్లో ని కోరారు. ఒక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా నడపాలని కూడా సూచించారు.

అదే సమయంలో కోవిడేతర రోగులకు కూడా అన్ని రకాల చికిత్సలూ అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య అధికారులను ఆయన ఆదేశించారు. జమ్మూ డివిజన్ లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వ్యాపించటం, మరణాలు ఎక్కువగా నమోదవటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పరీక్షలు చాలా దూకుడుగా జరపాలని, వైరస్ సోకే అవకాశమున్నవారిని గుర్తించి ఐసొలేషన్ లోకి పంపటం, రెడ్ జోన్లు నిర్ణయించటం లాంటివి శాస్త్రీయంగా జరపాలని కోరారు.

కేంద్ర బృందం సూచించిన విధంగా ఆక్సిజెన్ సిలిండర్ల అందుబాటు, వైద్య సిబ్బంది, వ్యాధి నివారణ  మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నర్సులను, పారామెడికల్ సిబ్బందిని అత్యవసరంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించి కొరతను అధిగమించటాన్ని అభినందించారు. 

<><><><><> 



(Release ID: 1656855) Visitor Counter : 196


Read this release in: English , Hindi , Manipuri , Punjabi