ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా భేటీ, వివిధ కేంద్ర పథకాల పురోగతిపై చర్చ

Posted On: 10 SEP 2020 6:08PM by PIB Hyderabad

మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ సంగ్మా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్‌ టిన్సోంగ్‌, సీనియర్‌ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, కేంద్ర నిధుల్లో మేఘాలయకు తగిన వాటా దక్కుతోందని, కొత్త ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ సంగ్మాకు వివరించారు.
లాక్‌డౌన్‌కు ముందు, ఈశాన్య ప్రాంతంలో తాను పర్యటించిన రాష్ట్రం మేఘాలయేనని గుర్తు చేశారు. సంగ్మా అభ్యర్థించిన ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రకారం నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. జల్‌ అభియాన్‌ కింద ప్రతి ఇంటికి శుద్ధమైన కొళాయి నీరు అందించే లక్ష్యాన్ని సాధించడానికి, జల్‌ శక్తి మంత్రిత్వ శాఖతో తన శాఖ సమన్వయం చేసుకుంటోందని డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.
 
    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు మద్దతుగా నిలుస్తున్నందుకు కేంద్ర మంత్రికి మేఘాలయ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు అదనపు నిధుల మంజూరు కోసం జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. "షిల్లాంగ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌" నిర్మాణానికి మౌలిక సదుపాయాల భాగం కింద మరిన్ని నిధులు విడుదల చేయాలంటూ మేఘాలయ మంత్రుల బృందం కేంద్ర మంత్రికి విజ్ఞాపన పత్రం అందించింది.
 
    రాష్ట్ర ప్రతిపాదనను అంచనా వేసి, ఓ నిర్ణయానికి వస్తామని డా.జితేంద్ర సింగ్‌, సంగ్మాకు భరోసా ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తన మంత్రిత్వ శాఖ, ఈశాన్య కౌన్సిల్‌ ద్వారా మేఘాలయకు కేటాయించిన నిధుల్లో అధిక భాగం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
 
    షిల్లాంగ్ విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్‌ చేసే అంశంపైనా ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి చర్చించారు. పర్యాటక సామర్థ్యాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని డా.జితేంద్ర సింగ్‌, సంగ్మాకు సూచించారు.

***



(Release ID: 1653133) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Manipuri