కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇ.పి.ఎఫ్., ఎం.పి. చట్టం కింద క్వాజీ జ్యుడిషియల్ కేసుల వర్చువల్ విచారణ ప్రారంభం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్రమంత్రి గాంగ్వర్
గరిష్ట అష్యూరెన్స్ ప్రయోజనాన్ని రూ 6లక్షలనుంచి రూ.7లక్షలకు పెంచేందుకు
ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ బీమా పథకం సవరణకు ఆమోదం
8.50శాతం వడ్డీ రేటునే సిఫార్సు చేసిన కేంద్ర ట్రస్ట్ బోర్డు
ఇ.పి.ఎఫ్. కేంద్ర ట్రస్ట్ బోర్డు 227వ సమావేశం నిర్వహణ
Posted On:
09 SEP 2020 4:51PM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్యనిధి కేంద్ర ట్రస్టు బోర్డు 227వ సమావేశం ఈ రోజు జరిగింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీని వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల కార్యదర్శి హీరాలాల్ సమారియా ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు. ఉద్యోగుల భవిష్యనిధి (ఇ.పి.ఎఫ్.) కేంద్ర ట్రస్ట్ బోర్డు సభ్య కార్యదర్శిగా కేంద్ర భవిష్యనిధి కమిషనర్ సునీల్ బర్త్వాల్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
కేంద్ర ట్రస్ట్ బోర్డు సమావేశం విశేషాలు ఇవి...
- 1952వ సంవత్సరపు ఇ.పి.ఎఫ్. ఎం.పి. చట్టం కింద క్వాజీ జ్యుడిషియల్ కేసుల విచారణ సదుపాయాన్ని కేంద్ర మంత్రి గాంగ్వర్ ప్రారంభించారు. సురక్షితమైన, డెస్క్ టాప్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లకు అనుగుణమైన ఐ.టి. అప్లికేషన్ల వినియోగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. విచారణాధికారి సమక్షంలో కక్షిదారులు భౌతికంగా హాజరు కావలసిన అవసరం లేకుండా సుదూర ప్రాంతాలనుంచి ఉద్యోగులకు, యాజమాన్య సంస్థలకు శ్రమనుంచి విముక్తిని కలిగిస్తూ సౌకర్యం కల్పించడమే లక్ష్యం. వర్చువల్ విచారణ ప్రక్రియను, ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.) ఈ-కోర్టు ప్రక్రియకు సంబంధించిన వెబ్ పోర్టల్ (https://eproceedings.epfindia.gov.in) తో సమ్మిళితం చేయడం ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారుల విలువైన సమయాన్ని, ప్రయాణ భారాన్ని, వ్యయాన్ని ఆదా చేయడమేకాక, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనను పాటించేందుకు, ఇ.పి.ఎఫ్. సభ్యులైన కార్మికుల బకాయిలను వేగంగా అంచనా వేసేందుకు, తద్వారా క్వాజీ జ్యుడిషియల్ యంత్రాగంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీలవుతుంది. ఇ.పి.ఎఫ్.ఒ.లో ముఖాముఖి సంప్రదింపుల ప్రమేయం లేని క్వాజీ జ్యుడిషియల్ విచారణ నిర్వహించాలనే లక్ష్యం దిశగా ఇది కీలక పరిణామం.
- డిపాజిట్ తో ముడివడిన 1976వ సంవత్సరపు ఉద్యోగుల బీమా పథకంలోని 22(3)వ పేరా గ్రాఫ్.కు ప్రతిపాదించన ఒక సవరణకు కేంద్ర ట్రస్టు బోర్డు ఆమోదం తెలిపింది. గరిష్ట అష్యూరెన్స్ ప్రయోజనాన్ని 6లక్షల రూపాయలనుంచి 7లక్షల రూపాయలకు పెంచేందుకు వీలు కల్పిస్తూ ఈ సవరణను తీసుకువచ్చారు. ఈ పథకంలో సభ్యత్వం ఉన్నవారు, దురదృష్టవశాత్తూ మరణానికి గురైనపక్షంలో వారిపై ఆధారపడిన కుటుంబాలకు అదనపు ప్రయోజనం చేకూర్చడానికి సవరణ ఉపకరిస్తుంది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ బీమా పథకాన్ని వాస్తవిక విలువతో లెక్కగట్టడం వల్ల, 5లక్షల రూపాయల కనీస అష్యూరెన్స్ మొత్తాన్ని 2020 మార్చి 14 తర్వాత కూడా సభ్యుల కుటుంబాలకు వర్తింపజేయడానికి అవకాశం ఉంటుందని సభ్యులు కేంద్ర ట్రస్ట్ బోర్డుకు తెలిపారు. సభ్యుల మరణించిన నెలకు పూర్వం 12నెలలు బహుళ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న పక్షంలో వారి కుటుంబాలకు కూడా కనీస అష్యూరెన్స్ ప్రయోజనం అందించేందుకు ఈ సవరణ వీలు కలిగిస్తుందని కేంద్ర ట్రస్టు బోర్డుకు సూచించారు. ఇ.పి.ఎఫ్. కేంద్ర ట్రస్ట్ బోర్డు 226వ సమావేశంలో ఆమోదం మేరకు ఈ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
- కోవిడ్19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా,..వడ్డీ రేటుకు సంబంధించిన అజెండాపై కేంద్ర ట్రస్ట్ బోర్డు సమీక్ష జరిపింది. డిపాజిట్లపై గతంలోలాగే 8.50శాతం వడ్డీనే ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో 8.15 శాతాన్ని రుణాదాయంనుంచి, మిగిలిన 0.35శాతాన్ని ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇ.టి.ఎఫ్.) క్యాపిటల్ గెయిన్ నుంచి సమకూర్చుతారు. 2020 డిసెంబర్ 31లోగా డిపాజిట్ల వృద్ధికి అనుగుణంగా ఇది ఉంటుంది.
- కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో భాగస్వామ్య వర్గాలన్నింటికీ నిర్బంధమైన నిరాటంకమైన సేవలు అందించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.) తీసుకున్న పలు చర్యలను గురించి ఈ సమావేశంలో కేంద్ర ట్రస్ట్ బోర్డుకు సభ్యులు వివరించారు. ఈ చర్యలను కేంద్ర ట్రస్ట్ బోర్డు సభ్యులు అభినందించారు. భాగస్వామ్య వర్గాలన్నింటికీ మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై వారు సూచనలు ఇచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన (పి.ఎం.జి.కె.వై.) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలను గురించి కూడా సభ్యులు కేంద్ర ట్రస్ట్ బోర్డుకు వివరించారు. డిజిటల్ వేదికపై ఇ.పి.ఎఫ్.ఒ. అమలు చేస్తున్న చర్యలను ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డుకు తెలియజేశారు.
- ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.)ను కాగితాల ప్రమేయం లేని పేపర్ లెస్ సంస్థగా తీర్చి దిద్దేందుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో ఇటీవల తీసుకున్న చొరవను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను కేంద్ర ట్రస్టు బోర్డు ఈ సందర్భంగా గుర్తించింది. అధునాతన పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులను అనుసరిస్తూ, అంతర్గత సేవల మెరుగుదలకోసం ప్రభుత్వంలోని ఇతర విభాగాలు చేపట్టిన చర్యలను వినియోగించుకోవడంతోపాటు, సామర్థ్యాలను మరింత పెంపొందించుకునేందుకు ఇ.పి.ఎఫ్.ఒ. చేస్తున్న కృషిని కేంద్ర ట్రస్టు బోర్డు సభ్యులు అభినందించారు.
******
(Release ID: 1652851)
Visitor Counter : 153