సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్మూ, కశ్మీర్ లోని కత్రా - ఢిల్లీ ఎక్స్ ప్రెస్ రోడ్డు మార్గం పనులు ప్రారంభమయ్యాయి; ఈ పనులు 2023 నాటికి పూర్తవుతాయి.
జమ్మూ నుండి ఢిల్లీ ప్రయాణ సమయం కేవలం ఆరు గంటలు పడుతుంది : డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
12 AUG 2020 7:13PM by PIB Hyderabad
జమ్మూ, కశ్మీర్ లోని కత్రా నుండి ఢిల్లీ వరకు అత్యాధునికమైన ఎక్స్ ప్రెస్ రోడ్డు మార్గం పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు 2023 నాటికి పూర్తవుతాయి. ఈ రహదారిపై రాకపోకలు ప్రారంభమయ్యాక కత్రా నుండి ఢిల్లీ వరకు ప్రయాణ సమయం ఆరున్నర గంటలకు తగ్గుతుంది. అదే విధంగా, జమ్మూ నుండి ఢిల్లీ వరకు ప్రయాణ సమయం కేవలం ఆరు గంటలు పడుతుంది.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ రోజు ఇక్కడ ఈ విషయాలు వెల్లడిస్తూ, ఈ ఎక్స్‌ప్రెస్ రోడ్డు మార్గంలో రాకపోకలు ప్రారంభమైన అనంతరం, ప్రజలు రైలు లేదా వాయుమార్గంలో ప్రయాణించే బదులు రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. ఈ రోడ్డు మార్గం యొక్క లక్షణం ఏమిటంటే, ఇది పవిత్ర నగరాలైన కత్రా మరియు అమృత్సర్ లను కలుపుతుంది, అదే సమయంలో రెండు గమ్యస్థానాల మధ్య కొన్ని ఇతర ముఖ్య మతపరమైన పుణ్యక్షేత్రాలను కూడా కలుపుతుందని ఆయన చెప్పారు.
ఫీడ్‌బ్యాక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ సర్వే పూర్తి చేసిన తరువాత, భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ దాదాపుగా పూర్తయిందనీ, భూమిపై పనులు ప్రారంభమయ్యాయనీ, డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 35,000 కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. ఈ ఎక్స్ ప్రెస్ రోడ్డు మార్గంలో జమ్మూ, కశ్మీర్ లోని జమ్మూ, కథువా తో పాటు పంజాబ్ లోని జలంధర్, అమృత్సర్, కపుర్తలా, లుధియానా మొదలైన ముఖ్య నగరాలు ఉన్నాయి.
ఇలా ఉండగా, పఠాన్ కోట్, జమ్మూల మధ్య జాతీయ రహదారిని 4 వరుసల నుండి 6 వరుసల రహదారిగా ఏకకాలంలో వెడల్పు చేయడం కూడా జరుగుతోందని, డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూ, కథువా, పఠాన్‌కోట్ మధ్య ప్రయాణికులకు ఇది ఒక గొప్ప వరంగా ఉంటుంది.
ఇది మూడేళ్ల నిర్ణీత కాలపరిమితిలో పూర్తి కానుందని, డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఈ రహదారి ఒక విప్లవాత్మక ప్రగతిని తీసుకు వచ్చే అవకాశం ఉంది. కథువా, జమ్మూ వంటి నగరాలలో ఆర్థిక కేంద్రాల వృద్ధికి కూడా ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.
కత్రా వైష్ణో దేవికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ) డాక్టర్ జితేంద్ర సింగ్ 2015 నుండి ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తున్న విషయం ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఉంది. మూడున్నర సంవత్సరాల క్రితం కత్రాలో ఒక కార్యక్రమం సందర్భంగా మొదటిసారి, ఆయన ఈ ప్రతిపాదనను సమర్పించినప్పుడు, ఈ ప్రాజెక్టును ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అంగీకరించారు. అయితే, విధానపరమైన సమస్యలు మొదలైన వాటి కారణంగా కొంత ఆలస్యమయింది.
గత ఆరు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో కొత్త రహదారులు మరియు వంతెనలను నిర్మించడానికి ఉదారంగా కేంద్ర నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, డాక్టర్ జితేంద్ర సింగ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో అత్యాధునికంగా నిర్మించిన చెన్నై - నష్రి సొరంగం వంటి స్మారక కట్టడాల గురించి ఆయన వివరించారు. దీనిని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రారంభించారనీ, ఇది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టబడిన మొట్టమొదటి ప్రాజెక్టు అనీ, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
<><><>
(रिलीज़ आईडी: 1645429)
आगंतुक पटल : 135