భారత ఎన్నికల సంఘం

రిమోట్ ఓటింగ్ యొక్క సాంకేతికతపై వెబినార్ నిర్వహించబడింది

Posted On: 11 AUG 2020 4:37PM by PIB Hyderabad

“రిమోట్ ఓటింగ్ యొక్క సాంకేతిక అంశాలు : బ్లాక్ చైన్ అన్వేషణ” అనే అంశంపై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ఇ-గవర్నెన్సు ఏజెన్సీ భాగస్వామ్యంతో 2020 ఆగస్టు, 10వ తేదీన ఒక వెబినార్ నిర్వహించింది.  ఈ వెబినార్ భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, విధాన అభ్యాసకులు, సైబర్ భద్రతా నిపుణులను ఒక వేదికపైకి తీసుకువచ్చింది.  ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సునీల్ అరోరా, 2019 అక్టోబర్ 30వ తేదీన మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ని సందర్శించినప్పుడు జరిగిన ఒక చర్చ సందర్భంగా ఈ బ్లాక్ చైన్ ఆధారిత ఓటింగ్ విధానాన్ని వినియోగం గురించి ప్రారంభ ఆలోచన వచ్చింది.

ఎలక్షన్ కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ఈ వెబినార్ ‌లో కీలకోపన్యాసం చేశారు.  "ఎన్నికలలో సమగ్రతను" నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను శ్రీ చంద్ర నొక్కిచెప్పారు.  భౌగోళిక అవరోధం కారణంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని ఆయన ఉద్ఘాటించారు.  వృత్తి, విద్య, వైద్య చికిత్స లేదా ఇతర కారణాల వల్ల, అటువంటి ఓటర్ల ప్రస్తుత నివాసం ఓటరు జాబితాలో నమోదు చేసిన ప్రదేశానికి భిన్నంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి.  సాంకేతికత ఆధారంగా పరిష్కారాన్ని రూపొందించడంలో, “ భాగస్వాములందరి నమ్మకాన్ని ప్రేరేపించడం, ఎన్నికల ప్రక్రియ మరియు గోప్యత యొక్క సమగ్రతతో పాటు బ్యాలెట్ ఉల్లంఘనలు జరగకుండా భరోసా ఇచ్చే సామర్ధ్యం మొదలైన అంశాలలో ప్రాధమిక పరిశీలన చాలా అవసరం ” అని శ్రీ చంద్ర నొక్కి చెప్పారు.  ఈ వ్యవస్థ అవకతవకలకు అవకాశం ఇవ్వదనీ, సురక్షితమైనదనీ, రాజకీయ పార్టీలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  రిమోట్ ఓటింగ్ అనేది, భౌగోళిక ప్రదేశంతో ముడిపడి ఉన్న సాంప్రదాయ పోలింగ్ స్టేషన్ విధానం నుండి బయటపడినట్లు సూచిస్తుందని, శ్రీ చంద్ర పేర్కొన్నారు.  అయితే, ఇంటి నుంచి ఇంటర్నెట్ ఆధారంగా ఓటు వేసే విధానాన్ని కమిషన్ ఊహించటం లేదని ఆయన స్పష్టం చేశారు.  రిమోట్ ప్రదేశాలలో నివసించే ఓటర్లను, వారికి నియమించబడిన పోలింగ్ కేంద్రాలకు దూరంగా, సురక్షితమైన పద్ధతిలో బ్యాలెట్ వేయడానికి, రిమోట్ ఓటింగ్ ప్రాజెక్టు అనుమతిస్తుంది.  నిపుణుల మధ్య చర్చలు మరింత సమగ్రమైన, సాధికారికమైన, బలమైన రిమోట్ ఓటింగ్ నమూనాను రూపొందించడంలో కమిషన్‌కు సహాయపడతాయని శ్రీ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా 800 మందికి పైగా ప్రజలు వెబినార్ కోసం సైన్ అప్ చేసారు.  స్కేలబిలిటీ యొక్క అవకాశాల ఉనికి; సమాచార గోప్యత మరియు నియంత్రణ సమస్యలు;  సమాచార భద్రత; ప్రామాణీకరణ మరియు ధృవీకరణలతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ప్రపంచ అనుభవాలను వక్తలు వివరించారు.  భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్; ఐ.ఐ.టి. భిలాయ్, డైరెక్టర్, ప్రొఫెసర్ రజత్ మూనా;  ఐ.ఐ.టీ. మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి ప్రభృతులు ఈ వెబినార్ లో ప్రసంగించారు. వీరితో పాటు,  గ్లోబల్ బ్లాక్ చెయిన్ బిజినెస్ కౌన్సిల్ సి.ఈ.ఓ. సాండ్రా రో; ట్రస్టెడ్ బ్లాక్ ‌చెయిన్ అప్లికేషన్సు అంతర్జాతీయ సంస్థ సభ్యుడు, మోనిక్ బాచ్నర్; ప్రభుత్వ బ్లాక్‌చెయిన్ అప్లికేషన్ కు చెందిన కున్ ‌ఫుడ్ స్పానిష్ శాఖ అధ్యక్షుడు, ఇస్మాయిల్ అరిబాస్ కూడా ఈ వెబినార్ లో భాగంగా వివిధ అంశాలపై ప్రసంగించారు. 

రిమోట్ ఓటింగ్ యొక్క వివిధ అంశాలపై ఆలోచించే వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా, ఇ.సి.ఐ., ఐ.టి. విభాగం ఇన్‌చార్జి, డిప్యూటీ ఎన్నికల కమిషనర్, శ్రీ ఆశిష్ కుంద్రా, ఈ వెబినార్ ను నిర్వహించారు.

*****



(Release ID: 1645141) Visitor Counter : 184