సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

115 ఆకాంక్ష జిల్లాల్లో ఎం.ఎస్.‌ఎం.ఈ. ల ఉనికిని మెరుగుపరచాలని నొక్కి చెప్పిన - శ్రీ నితిన్ గడ్కరీ.

ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ఉద్ధరించడానికి ఆలోచనలు, సలహాలతో ముందుకు రావాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచిన్న - శ్రీ గడ్కరీ.

ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా "ఫైనాన్సియల్ క్లోజర్" ను వేగవంతం చేయడానికి వీలుగా బ్యాంకు హామీ అవసరాన్ని భర్తీ చేస్తూ రోడ్డు మౌలిక సదుపాయాల బీమా పధకాన్ని రూపొందించాలని సి.ఐ.ఐ. ని కోరిన - శ్రీ గడ్కరీ.

Posted On: 08 AUG 2020 2:15PM by PIB Hyderabad

భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన "ఇండియా@75 సదస్సు : మిషన్ 2022"  నుద్దేశించి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు ప్రసంగించారు.  దేశంలో గుర్తించబడిన 115 ఆశాజనక జిల్లాల్లో ఎం.ఎస్.‌ఎం.ఈ. పరిశ్రమల ఉనికిని వెంటనే మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  జి.డి.పి. లో వీటి వాటా ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వాటి వైపు దృష్టి కేంద్రీకరించినట్లయితే, ఇవి ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున పెంపొందిస్తాయని శ్రీ గడ్కరీ చెప్పారు. 

సూక్ష్మ ఆర్థిక అవసరాలను కోరే చిన్న యూనిట్లను ఎం.ఎస్.‌ఎం.ఈ. పరిధిలో చేర్చడానికి వీలుగా ఒక పథకం రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు.  ప్రభుత్వం ఇటీవల, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. పరిధిని విస్తరించింది. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కొత్త నిర్వచనంలో పరిశ్రమల పెట్టుబడి విలువ 50 కోట్ల రూపాయలు, టర్నోవర్ విలువ 250 కోట్ల రూపాయల మేర పెంచడం జరిగింది.  అలాగే, ఎం.ఎస్.‌ఎం.ఈ. కింద తయారీ మరియు సేవా రంగాలు రెండింటికీ సమానమైన నిర్వచనాలు ఇవ్వడం ద్వారా వాటిని విలీనం చేయడం జరిగింది. 

దేశం యొక్క మొత్తం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన ఆలోచనలు, సలహాలను తెలియజేయాలని, సి.ఐ.ఐ. ప్రతినిధులకు శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంలో ఆయన చైనా ఉదాహరణను పేర్కొంటూ, అక్కడ అగ్ర స్థానంలో ఉన్న 10 వ్యాపార వర్గాలు, ఆదేశ ఎగుమతి బిల్లులో 70 శాతం మేర వాటాను కలిగి ఉన్నాయని తెలియజేశారు.  సాంకేతికత స్థాయిని పెంపొందించడం ద్వారా ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగంలో కొత్త ఎగుమతి మార్గాలను కూడా భారతదేశం అన్వేషిస్తోంది.  ఇది పెద్ద సంఖ్యలో అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. 

బ్యాంకు గ్యారెంటీ (బి.జి) అవసరాన్ని తొలగించే విధంగా రహదారుల బీమా కోసం ఒక ప్రతిపాదనను రూపొందించాలని కూడా శ్రీ గడ్కరీ సి.ఐ.ఐ.ని కోరారు.  ఇది రహదారి ప్రాజెక్టుల "ఫైనాన్సియల్ క్లోజర్" ను వేగవంతం చేస్తుంది. తద్వారా, ఆర్థిక సహాయం పెరగడానికీ, ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావడానికీ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.  దేశంలో రోడ్ల పరిస్థితి ఎలా మెరుగు పడుతుందో శ్రీ గడ్కరీ వివరిస్తూ, ఇది ప్రతిపాదిత 22 కొత్త గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులతో మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు. 

*****



(Release ID: 1644456) Visitor Counter : 133