వ్యవసాయ మంత్రిత్వ శాఖ

దేవ్ లాలి-దనాపూర్ మధ్య ఈ రోజు ప్రారంభమైన - "కిసాన్ రైలు"

రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెట్టు మరియు ధర పొందడానికి కిసాన్ రైలు సహాయపడుతుంది - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


రైతులను మరింత సంపన్నంగా మార్చడానికి తీసుకుంటున్న చర్యల్లో కిసాన్ రైలు ఒక ముందడుగు - శ్రీ పీయూష్ గోయల్

Posted On: 07 AUG 2020 4:07PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ‘ దేవ్ లాలి-దానపూర్ కిసాన్ రైలు’ ను కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ సమక్షంలో జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు.  పాలు, మాంసం, చేపలతో సహా పాడైపోయే వస్తువుల కోసం ఎటువంటి అవరోధాలు లేని జాతీయ శీతల సరఫరా వ్యవస్థను నిర్మించాలని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఒక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా పి.పి.పి. ఏర్పాటు ద్వారా భారతీయ రైల్వే శాఖ ఒక కిసాన్ రైలును ఏర్పాటు చేస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు. 

 

ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ కిసాన్ రైలు నామమాత్రపు ఖర్చుతో రైతుల ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయడంలో సహాయపడుతుందనీ, తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందనీ చెప్పారు.  2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధానమంత్రి ఆశయాన్ని సాధించడంలో ఇది సహాయపడుతుంది.  పాడైపోయే వస్తువులను ఒక నిర్ణీత కాలంలో రవాణా చెయాలనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆశయానికి శ్రీ తోమర్ కృతజ్ఞతలు తెలిపారు.  రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధర లభించడం లేదని ఆయన అన్నారు.  కోవిడ్ మహమ్మారి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కిసాన్ రైలును ప్రారంభించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.  ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి, వీడియో కాన్ఫరెన్సు ద్వారా సభనుద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగంలో పాడైపోయే ఉత్పత్తుల కోసం ఎటువంటి అవరోధాలు లేని జాతీయ శీతల సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కిసాన్ రైలు ద్వారా రైతుల ప్రాథమిక అవసరాలు నెరవేరుతున్నాయని ఆయన పేర్కొంటూ, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా రైతుల కార్యకలాపాలు ప్రభావితం కాలేదని సంతోషం వ్యక్తం చేశారు.   రబీ పంటల కోతలు మరియు వేసవి విత్తనాలతో పాటు ఖరీఫ్ పంటలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సంతృప్తికరంగా అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. 

మొదటి రైలును 1853 సంవత్సరంలో బోరి బందర్ నుండి థానే వరకు నడిపినట్లు శ్రీ పియూష్ గోయల్ పేర్కొన్నారు. కాగా, ఇప్పుడు మొదటి కిసాన్ రైలును 2020 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం నడుపుతోందని, ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన పి.ఎం.కిసాన్ పథకంలో భాగంగా ప్రతి రైతు కుటుంబానికీ 6000 రూపాయల చొప్పున అందించడంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక ఇతర పథకాలు / కార్యక్రమాలను ప్రవేశపెట్టిందనీ, రైతులు తమ పంటలకు అధిక ధరలను పొందే విధంగా ఆహార సరఫరా రవాణా వ్యవస్థను పెంపొందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ కూడా కృషి చేస్తోందనీ, శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. 

జండా ఊపి రైలును ప్రారంభించిన ఈ కార్యక్రమం, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ అంగడి;  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి, శ్రీ రావు సాహెబ్ డాన్వే, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు, శ్రీ పురుషోత్తమ్ రూపాల మరియు శ్రీ కైలాష్ చౌదరి; మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు,  శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్;  మహారాష్ట్ర ప్రభుత్వ ఆహార, పౌర సరఫరా మరియు వినియోగదారుల రక్షణ మంత్రి, శ్రీ చాగన్ భుజ్ బల్ సమక్షంలో జరిగింది.  ఈ కార్యక్రమంలో,  కార్యదర్శి (ఎ.సి. & ఎఫ్.‌డబ్ల్యు); సభ్యుడు-ట్రాఫిక్ (రైల్వే మంత్రిత్వ శాఖ);  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. 

దేశంలోని వ్యవసాయ రంగానికి చెందిన సమాజం యొక్క ప్రయోజనం కోసం, ఈ కిసాన్ రైళ్ళు బహుళ వస్తువులు, బహుళ సరుకు రవాణాదారులు మరియు సరుకులను తీసుకునేవారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తాయి.  ఈ రైళ్లు ముందుగా నిర్ణయించిన రెండు గమ్య స్థానాల మధ్య రాను పోను కొన్ని స్టేషన్లలో ఆగుతూ నడుస్తాయిమధ్యలో ఆగిన స్టేషన్లలో సరుకులను ఎక్కించదానికీ, దింపుకోడానికీ అనుమతిస్తారు.  రైలు ప్రారంభమయ్యే స్టేషను, గమ్య స్థానం మధ్య రాను, పోను,అవి ప్రయాణించే మార్గాలు, మధ్యలో ఆగే స్టేషన్లు, అవి ఎప్పుడెప్పుడు నడిచేదీ మొదలైన వాటిని, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్ణయిస్తాయి.  తదనుగుణంగా ఈ రైళ్లను నడపడానికి, భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తుంది. 

ఎఫ్.‌పి.ఓ.ల ద్వారా సరుకులను సమీకరించడం, గిడ్డంగులు, ఉష్ణోగ్రత-నియంత్రిత నిల్వలను ఏర్పాటు చేయడం మొదలైన ప్రారంభ ఏర్పాట్లను, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది.  వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో అంకురసంస్థలను ప్రోత్సహించడం, నూతన ఎఫ్.పి.ఓ.లను ప్రోత్సహించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఎఫ్.పి.ఓ. లను వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తుంది. కిసాన్ ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాల్లో ఉత్పత్తి కేంద్రాల వివరాలతో పాటు ఉత్పత్తి యొక్క కాలానుగుణతను మంత్రిత్వ శాఖ అందిస్తుంది. కిసాన్ రైలుకు సంబంధించిన సమాచారం మండీలురైతుల సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ఇతర భాగస్వాములందరి మధ్య సక్రమంగా వ్యాప్తి చెందే విధంగా వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏర్పాట్లకు అవసరమైన నేపధ్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా నిర్ధారించడానికి తగిన చర్యలను కూడా వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా చేపడుతుంది

*****



(Release ID: 1644250) Visitor Counter : 308


Read this release in: Hindi , Punjabi , English , Tamil