మంత్రిమండలి
జాతీయ విద్యా విధానం 2020 కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
దీనితో దేశంలో పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో పరివర్తనతో కూడిన సంస్కరణలకు వీలు.
• 2030 నాటికి పాఠశాల విద్యలో 100% జిఇఆర్ తో ప్రీ-స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం నూతన విధానం లక్ష్యం
• ఎన్.ఇ.పి 2020, పాఠశాల వెలుపల ఉన్న 2 కోట్ల మందిని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురానుంది.
• 6 వ తరగతి నుంచే ఇంటర్న్ షిప్‌తో కూడిన వృత్తి విద్య
• కనీసం 5 వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధన
• ఉన్నత విద్యా వ్యవస్థలో జిఇఆర్ ను 2035 నాటికి 50 శాతానికి పెంపు,
• ఉన్నత విద్యలో 3.5 కోట్ల సీట్ల అదనపు సీట్ల జోడింపు
• దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి వీలు కల్పిస్తూ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు
• 15 సంవత్సరాలలో అఫిలియేషన్ వ్యవస్థ తొలగింపు, కళాశాలలకు గ్రేడెడ్ అటానమీ
• నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
• నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాళి, పర్షియన్, పాక్రృతి , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేషన్,ఇంటర్‌ప్రిటేషన్ ఏర్పాటు చేయనున్నారు
Posted On:
29 JUL 2020 5:20PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020ని ఈ రోజు ఆమోదించింది. పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున పరివర్తనతో కూడిన సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ఈ నూతన విద్యా విధానాన్ని ఆమోదించారు. ఇది 21వ శతాబ్దపు తొలి విద్యా విధానం. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో విద్య, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, అందుబాటులో విద్య, జవాబుదారిత్వం వంటి ప్రధాన అంశాలపై ఇది రూపుదిద్దుకుంది. ఇది 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. పాఠశాల, కళాశాల విద్యను సమగ్రమైనదిగా తీర్చిదిద్దడం, 21 వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడం, ప్రతి విద్యార్ధిలోని ప్రత్యేక సామర్ధ్యాలను వెలికితీయడం ద్వారా ఇండియాను ఒక శక్తివంతమైన జ్ఞాన సమాజంగా, ప్రపంచ విజ్ఞాన మహాశక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రీ స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉండేలా ఎన్.ఇ.పి 2020 కట్టుబడి ఉంది. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలిక సదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన వారు తిరిగి ప్రధాన స్రవంతిలోకి రానున్నారు. ఎన్.ఇ.పి 2020 కింద బడి వెలుపల ఉన్న సుమారు 2 కోట్ల మందిని తిరిగి విద్యారంగ ప్రధాన స్రవంతిలోకి ఎన్.ఇ.పి 2020 తీసుకురానున్నది.
పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. ఇవి 3-8, 8-11, 11-14, 14-18 సంవత్సరాల విద్యార్ధులు దీని పరిధిలోకి వస్తారు. ఇక ముందు 3-6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. అంతర్జాతీయంగా ఇది కీలకమైన , పిల్లల మానసిక వికాసానికి అనువైన దశ అని గుర్తించడం జరిగింది. కొత్త విధానంలోమూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది.
పాఠశాల స్థాయి పాఠ్యాంశాలు, బోధనలో అభ్యసించేవారి సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. కీలక ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉందడు. వృత్తి విద్యను 6వ గ్రేడ్ నుంచే ఇంటర్న్ షిప్ తో పాటుగా ప్రారంభిస్తారు.
కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్- NCFSE 2020-21ని ఎన్.సి.ఇ.ఆర్.టి అభివృద్ధి చేయనుంది.
భాష శక్తి:
జాతీయ విద్యావిధానం-2020 మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయభాషను బోధన మాధ్యమంగా కనీసం 5 వ గ్రేడ్ వరకు ఉంచాలని, గ్రేడ్ 8 ఆ పై వరకూ దీనిని కొనసాగించవచ్చని చెప్పింది. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిలలో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. భారతదేశంలోని ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుండాలని ఈ నూతన విధానం స్పష్టం చేసింది. 6-8 గ్రేడ్ ల మధ్య ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమం కింద పలు విదేశీభాషలు సెకండరీ విద్యాస్థాయిలో ఆఫర్ చేయడం జరుగుతుంది.
భారతీయ సంజ్ఙా భాషలను దేశవ్యాప్తంగా ప్రామాణీకరిస్తారు. ఇందుకు వినికిడి లోపం కల విద్యార్ధులకు దేశ, రాష్ట్రస్థాయి పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేస్తారు.
పుట్టుకవల్ల కానీ తన నేపథ్యం వల్ల కానీ ఏ విద్యార్థీ నేర్చుకోవడానికీ, రాణించడానికి అవకాశం కోల్పోరాదన్నది ఎన్.ఇ.పి 2020 లక్ష్యం. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలు, గ్రూపులకు స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ లు జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయినుంచి ఉన్నత విద్య వరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. ఇందుకు బోధకుల మద్దతు, రిసోర్సు సెంటర్లు, తగిన వసతి, సహాయక ఉపకరణాలు, తగిన సాంకేతిక పరిజ్ఞానంతోకూడిన ఉపకరణాలు ఇలా వారి అవసరాలకు తగినట్టు ఏర్పాట్లు చేస్తారు. ప్రతి రాష్ట్రం, జిల్లా బాలభవన్ లు ఏర్పాటుచేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవి పగటిపూట బోర్డింగ్ స్కూళ్లుగా ఉంటాయి. కళలు, ఆటలు వంటివి నేర్పడానికి వీటిని వినియోగిస్తారు. పాఠశాల అనంతరం ఈ సదుపాయాలను సామాజిక చేతన కేంద్రాలుగా వాడుకోవచ్చు.
పారదర్శక విధానంలో ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్:
ఉపాధ్యాయ నియామకాలను పటిష్టమైన, పారదర్శక ప్రక్రియ ద్వారా చేపడతారు. ప్రమోషన్లు మెరిట్ ఆధారితంగా ఉంటాయి. ఎప్పటికప్పడు వారి పనితీరును అంచనావేసే బహుళ మార్గ సమాచార సేకరణ ద్వారా దీనిని చేపడతారు. ఉపాధ్యాయులకు ఉమ్మడి జాతీయ వృత్తి ప్రమాణాలను (ఎన్.పి.ఎస్‌టి) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ -ఎన్.సి.ఇ.ఆర్.టి, ఎస్.సి.ఇ.ఆర్.టి,. ఉపాధ్యాయులు, వివిధ ప్రాంతాలు వివిధ స్థాయిలలోని నిపుణుల సంస్థలతో సంప్రదించి 2022 నాటికి అభివృద్ధి చేస్తుంది.
పాఠశాలలను కాంప్లెక్సులుగా లేదా క్లస్టర్లుగా ఏర్పాటుచేసి, దానిని పాఠశాల పాలనకు మౌలిక యూనిట్‌గా పరిగణిస్తారు. దీనికి మౌలిక సదుపాయాలు, విద్యాపరమైన లైబ్రరీలు, బలమైన టీచర్ల వ్యవస్థ కల్పిస్తారు.
పాఠశాల విద్యకు ప్రమాణాలు:
ఎన్.ఇ.పి 2020 విద్యా సంబంధ, నిర్వహణా పరమైన, నియంత్రణ పరమైన, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సంకల్సిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర పాఠశాల ప్రమాణాల అథారిటీ (ఎస్.ఎస్.ఎస్.ఎ)ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎస్.సి.ఇ.ఆర్.టి పాఠశాల నాణ్యతా అంచనా , అక్రిడిటేషన్ ఫ్రేమ్ వర్క్ (ఎస్.క్యు.ఎఎ.ఎఫ్)ను సంబంధిత భాగస్వామ్య పక్షాలతో కలసి చర్చించి అభివృద్ధి చేస్తుంది.
2035 నాటికి 50 శాతానికి జిఇఆర్:
ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి (జిఇఆర్)ని 26.3 శాతం (2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఉన్న విద్యా సంస్థలకు 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు.
మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రిసెర్చ్ యూనివర్సిటీలు (ఎం.ఇ.ఆర్.యు)లను ఐఐటిలు, ఐఐఎం లతో సమానంగా ఏర్పాటు చేయనున్నారు. దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ మల్టీ డిసిప్లినరీ విద్యకు నమూనాగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ను ఉన్నతస్థాయి సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధన సామర్ధ్యాన్ని, పరిశోధన సంస్కృతిని పెంచడానికి దీనిని ఏర్పాటు చేస్తారు.
నియంత్రణ:
మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థకు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఇసిఐ) ని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్య మాత్రం దీనినుంచి మినహాయింపు. హెచ్.ఇ.సి.ఐ కి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ (ఎన్.హెచ్.ఇ.ఆర్.సి) అనేది రెగ్యులేషన్ కోసం, ప్రమాణాలను నిర్దేశించడం కొసం జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జిఇసి), ఫండింగ్ కు హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ (హెచ్.ఇ.జి.సి), అక్రిడిటేషన్‌కు నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్.ఎ.సి) ఏర్పాటు అవుతాయి. రెగ్యులేషన్, అక్రిడిటేషన్, అకడమిక్ ప్రమాణాలకు సంబంధించి పబ్లిక్, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలన్నింటికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపచేస్తారు.
కళాశాలల అనుబంధాన్ని 15 సంవత్సరాలలో దశలవారీగా తొలగించాలని, కళాశాలలకు గ్రేడెడ్ స్వయంప్రతిపత్తిని ఇవ్వడానికి దశల వారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. కొంతకాలానికి ప్రతి కాలేజీ ఒక స్వతంత్ర డిగ్రీలు మంజూరుచేసే కాలేజీగా లేదా యూనివర్సిటీ భాగస్వామ్య కళాశాలగా తయారయ్యేట్టు చూస్తారు.
ఉపాధ్యాయ విద్య:
ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ , ఎన్.సి.ఎఫ్.టి.ఇ 2021 ని ఎన్‌సిటిఇ రూపొందించనుంది. ఎన్.సి.ఇ.ఆర్.టి తో సంప్రదించి దీనిని రూపొందిస్తుంది. 2030 నాటికి బోధనకు కనీస డిగ్రీ అర్హత, నాలుగు సంవత్సరాల బిఇడి డిగ్రీ కానున్నది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ప్రతిభ గల ఎస్.సి., ఎస్.టి, ఒబిసి ఇతర ఎస్ఇడిజి విద్యార్దులకు ప్రోత్సాహకం అందించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ను విస్తరింపచేసి స్కాలర్‌షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు వీలైనన్ని ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్ షిప్ లను తమ విద్యార్థులకు అందించేందుకు ప్రోత్సహించనున్నారు.
ఆన్‌లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్:
ఇటీవలి మహమ్మారి నేపథ్యంలో ప్రత్యామ్నాయ నాణ్యమైన విద్యా విధానాలను అనుసరించేందుకు వీలుగా ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించేందుకు సమగ్ర సిఫార్సులను పొందుపరిచారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు, డిజిటల్ కంటెంట్, సామర్ధ్యాల నిర్మాణానికి ఎం.హెచ్.ఆర్.డి లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పాఠశాల, ఉన్నతవిద్య స్థాయిలో ఈ - విద్య అవసరాలను తీర్చనుంది.
ఆర్ధిక వనరులు:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విద్యారంగంలొ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్‌ను వీలైనంత త్వరగా జిడిపి లో ఆరు శాతానికి చేర్చేందుకు కృషి చేస్తాయి.
పెద్ద ఎత్తున సంప్రదింపులు:
జాతీయ విద్యా విధానం 2020, మున్నెన్నడూ లేనంత రీతిలో పెద్ద ఎత్తున సంప్రదింపుల ద్వారా రూపుదిద్దుకున్నది. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6600 బ్లాకుల, 6000 పట్టణ స్థానిక సంస్థలు, 676 జిల్లాల నుంచి 2 లక్షలకు పైగా సూచనలు వచ్చాయి. 2015 జనవరి నుంచి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మున్నెన్నడూ లేనంతగా సమగ్ర , ఉన్నతస్థాయి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. 2016 మే నెలలో మాజీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి, దివంగత శ్రీ టి.ఎస్.ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో, కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆప్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా మంత్రిత్వశాఖ ముసాయిదా జాతీయ విద్యావిధానం- 2016 కొన్నిఅంశాలను రూపొందించింది. 2017 జూన్‌లో, ప్రముఖ శాస్త్రవేత్త పద్మవిభూషణ్ డాక్టర్ కె. కస్తూరి రంగన్ నేతృత్వంలో కమిటీ ఫర్ ద డ్రాప్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019ని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రికి 2019 మే 31న అందజేసింది. ఈ ముసాయిదా జాతీయ విద్యా విధానం 2019 ను ఎం.హెచ్.ఆర్.డి వెబ్‌సైట్ లో, మై గవ్ ఇన్నొవేట్ పోర్టల్ లో అప్ లోడ్ చేసి ప్రజలు భాగస్వామ్య పక్షాలు నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, వ్యాఖ్యలను ఆహ్వానించింది.
***
(Release ID: 1642090)
Visitor Counter : 929
Read this release in:
Punjabi
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada