పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
యుఎన్‌ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం, ఆర్థిక, సాంకేతిక సాయం మాటను అభివృద్ధి చెందిన దేశాలు నిలబెట్టుకోవాలి: శ్రీ ప్రకాశ్ జావడేకర్
హరిత పునరుద్ధరణ చర్యలే కేంద్ర అంశంగా వివిధ దేశాల మంత్రుల వర్చువల్ సమావేశం
Posted On:
07 JUL 2020 7:40PM by PIB Hyderabad
వాతావరణ మార్పులు, చర్యలపై "మినిస్ట్రీరియల్ ఆన్ క్లైమేట్ యాక్షన్" నాలుగో సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది. పారిస్ ఒప్పందంతో దేశాలు ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలను ఎలా సమన్వయం చేస్తున్నాయి, నిరంతర వాతావరణ చర్యలను ఎలా అమలు చేస్తున్నాయన్న అంశాలపై, ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్, చైనా, కెనడా సహాధ్యక్ష దేశాలుగా వ్యవహరించాయి. "యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్" (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) కింద పారిస్ ఒప్పందం సంపూర్ణ అమలుపై చర్చలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ వాతావరణ చర్యలకు రాజకీయపరంగా ఆటంకాలు లేకుండా చూడటంపై చర్చలు జరిగాయి.
వాతావరణ మార్పుల నియంత్రణకు భారత్ అన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నట్లు మనదేశం తరపున సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. యూఎన్‌ఎఫ్‌సీసీసీ, పారిస్ ఒప్పందం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సాయాన్ని అందించాలని అభివృద్ధి చెందిన దేశాలకు సూచించారు. "2020 నాటికి ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అందిస్తామన్న మాటను అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ చర్యలను బలోపేతం చేయడానికి, ఈ ఐదు నెలల్లో అయినా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నా" అని జావడేకర్ స్పష్టం చేశారు.
భారత్ చేసిన ప్రయత్నాల గురించి జావడేకర్ చెబుతూ.., 2005-2014 మధ్యకాలంలో, డీజీపీ ఉద్గారాల తీవ్రతలో 21 శాతాన్ని తగ్గించామని, తద్వారా, 2020కి ముందే స్వచ్ఛంద లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గత ఐదేళ్లలో 226 శాతం పెరిగిందని, 87 గిగావాట్ల కంటే ఎక్కువే సాధించామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజ రహిత వనరుల వాటా 2015 మార్చిలో 30.5 శాతం ఉండగా, 2020 మే నాటికి 37.7 శాతానికి పెరిగిందని వెల్లడించారు. భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచాలన్న లక్ష్యాన్ని భారత ప్రధాని ప్రకటించారని స్పష్టం చేశారు.
భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 80 మిలియన్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, స్వచ్ఛమైన వంట ఇంధనం, ఆరోగ్యకర వాతావరణం అందించామని జావడేకర్ వర్చువల్ సమావేశంలో వివరించారు. "భారత్‌లో అటవీ, చెట్ల పెంపకం విస్తీర్ణం 8,07,276 చ.కి.మీ. ఇది మొత్తం దేశంలో 24.56 శాతం. ఉజాలా పథకం కింద 360 మిలియన్ ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేశాం. దీనివల్ల ఏటా 47 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాతోపాటు, కార్బన్ డై ఆక్సైడ్ 38 మిలియన్ టన్నులు తగ్గుతోంది" అని వెల్లడించారు.
స్వచ్ఛమైన ఇంధన కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి చెబుతూ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి, బీఎస్-4 ఉద్గార నిబంధనల నుంచి బీఎస్-6కు భారత్ మారిందని అన్నారు. 2024 నుంచి దీనిని పాటించాల్సివున్నా నాలుగేళ్లు ముందుగానే అమలు చేస్తున్నామన్నారు. అత్యంత స్పష్టమైన హరిత చర్యల్లో భాగంగా, 400 రూపాయల బొగ్గు సెస్‌ను వసూలు చేసిన అంశాన్ని మంత్రి వివరించారు. ఇది ఇప్పుడు జీఎస్‌టీ కిందకు వచ్చిందన్నారు. "ఆకర్షణీయ నగరాల కార్యక్రమంలో భాగంగా, తొలిసారిగా, "క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2019"ను ప్రారంభించాం. వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి నగరాలు, పట్టణ ప్రాంతాలకు స్పష్టమైన మార్గం చూపడం దీని ఉద్దేశం" అని సమావేశంలో మంత్రి తెలిపారు.
దాదాపు 30 దేశాల మంత్రులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ సమావేశాన్ని తొలిసారిగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. వాతావరణ చర్యల్లో పురోగతి ఉండేలా చూడటం ఈ సమావేశం ఉద్దేశం.
*****
(Release ID: 1637114)
Visitor Counter : 372