శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్లినికల్ మైక్రోస్కోప్‌కు (సూక్ష్మదర్శిని) మెరుగైన ప్రత్యామ్నాయం ఫోల్డ్‌స్కోప్
Posted On:
22 JUN 2020 6:27PM by PIB Hyderabad
వైద్యరంగంలో వాడ సూక్ష్మదర్శని(మైక్రోస్కోప్)కు చౌకధరలో , కాగితాన్ని మడతబెట్టి తయారు చేసే వినూత్న ఫోల్డ్‌స్కోప్ ఒక మెరుగైన ప్రత్యామ్నాం కానుంది. వివిధ కాగితపు ముక్కలను ఒక క్రమపద్ధతిలో మడిచి వాటిని అమర్చడం ద్వారా దీనిని రూపొందించవచ్చు. ఈ పరికరం పరిశీలనకు ఉద్దేశించిన స్లైడ్‌ను నిలిపి ఉంచగలదు. ఈ కాగితపు పరికరానికి మొబైల్ ఫోన్ కెమెరా అనుసంధానం చేయడం ద్వారా పరిశీలనకు నిర్దేశించిన నమూనా స్లయిడ్‌ను ఫోన్ కెమెరా ద్వారా వీక్షించవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (IMTECH) ,చండీఘడ్ లోని డాక్టర్ అల్కారావు గ్రూపు, హర్యానాలోని పంచకుల ప్రభుత్వాస్పత్రి అలాగే నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) కు చెందిన ఒక ప్రైవేటు ఆస్పత్రి, ఇంఫాల్‌లోని ఒక మెడికల్ కాలేజితో కలిసి, వివిధ రోగులనుంచి సేకరించిన నమూనాలను ఉపయోగించి వ్యాధుల నిర్ధారణలో ఫోల్డ్ స్కోప్ క్లినికల్ యుటిలిటీని పరిశీలించి, ధృవీకరించింది.
ఈ అధ్యయనం నోరు, మూత్రనాళ సంబంధిత అంటువ్యాధుల నిర్ధారణలో ఫోల్డ్‌స్కోప్ ఉపయోగాన్ని అంచనా వేసింది.అలాగే దేశంలోని పాఠశాలల పిల్లలకు నోటి పరిశుభ్రత, దంత సంరక్షణ ప్రాధాన్యతను తెలియజెప్పడంలో తగిన ప్రేరణ కలిగించేందుకు ఈ ఫోల్డ్‌స్కోప్ ఎంతవరకు పనికివస్తుందన్నది తెలుసుకునేందుకు దాని సమర్థతను కూడా అంచనా వేశారు.
ఫోల్డ్‌స్కోప్, ప్రత్యేకించి మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లను(యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు-యుటిఐ,), మూత్రపిండాలలో రాళ్లసమస్యను గుర్తించడానికి అత్యంత అనువుగా ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఇంట్లోనే ఎవరికి వారు మూత్రపిండాలలో రాళ్ల స్థితిని చిన్న గాజు స్లయిడ్ ద్వారా ఫోల్డ్‌స్కోప్‌తో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండవచ్చు. ఇందుకు ఫోల్డ్ స్కోప్, ఫోను చేతిలో ఉంటే సరిపోతుంది. ఇలాంటి పరిశీలన పరికరం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు నొప్పిస్థాయికి , లేదా మరికొన్ని కేసులలో ఆపరేషన్ వరకు వెళ్లకుండా ముందే జాగ్రత్తపడడానికి అవకాశం ఉంటుంది.
“ సులభంగా ఉపయోగించడానికి వీలున్న, తక్కువ ఖరీదయ్యే ఈ ఫోల్డ్ స్కోప్ ను ప్రజారోగ్య సంరక్షణ కేంద్రాలలో నోటికి సంబంధించి లేదా మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి ప్రాథమిక వ్యాధి నిర్ధారణకు ఉపయోగించవచ్చు. లేదా దీనిని వ్యక్తిగత ఆరోగ్య పరిశీలక పరికరంగా కూడా వాడుకొవచ్చు ” అని ఐ.ఎం.టి.ఇ.సి.హెచ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అల్కారావు తెలిపారు.
ఇందుకు సంబంధించిన పరీక్ష నిర్వహించడానికి పేషెంట్‌కు సంబంధించిన మూత్రం వంటి నమూనాను ఒక పారదర్శక గాజు పలకపై చల్లాలి.దీనిని సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసిన ఫోల్డ్‌స్కోప్ కింద పరిశీలించాలి. మొబైల్ ఫోన్‌కు గల జూమ్ సదుపాయం ద్వారా పేషెంట్ నుంచి సేకరించిన నమూనా బొమ్మను పెద్దదిగా చేయవచ్చు. దీనిని మొబైల్ ఫోన్ మెమరి కార్డులో కూడా భద్రపరచుకుని ఆ తర్వాత దీనిని రెఫరెన్సుగా , పేషెంట్ రికార్డుగా ఉపయోగించుకోవచ్చు. ఫోల్డ్‌స్కోప్‌ను పేపర్ క్లిప్‌లు ఉపయోగించి అసెంబుల్ చేయవచ్చు. ఇందుకు కప్లర్, కొద్దిగా జిగురు ఉపయోగించి సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేయవచ్చు.
పరిశోధకులు ఈ ఫోల్డ్‌స్కోప్ ఫలితాలను వాటి నాణ్యత పరంగా, వైద్యులువాడే మైక్రోస్కోప్ పరీక్షలతో పోల్చి చూశారు. ఇందుకు ఐదు భిన్న రకాల నమూనాలను పరిశీలించి చూశారు.ఈ భిన్న నమూనాలలో ఫోల్డ్‌స్కోప్ పంటిపై గార నమూనాలో ఉన్న ఇన్‌ఫెక్షన్, మూత్ర నమూనాలలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడంలో బాగా పనిచేసినట్టు గుర్తించారు. ఈ బృందం 3 నుంచి 13 సంవత్సరాల వయసుగల 31 మంది పళ్లపై గల గార నమూనాలను అలాగే 11 నుంచి 62 సంవత్సరాల వయసు మధ్యగల 25 మంది మూత్ర నమూనాలను పరిశీలించి విశ్లేషించింది.
“ పిల్లలో దంత సంరక్షణ, నోటి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి వారికి ప్రేరణనిచ్చేందుకు ఒక విద్యా ఉపకరణంగా ఫోల్డ్ స్కోప్ ఉపయోగాన్ని కూడా మేం పరిశీలించి అంచనా వేశాంత. 12 సంవత్సరాల వయసుగల 80 మంది పాఠశాల విద్యార్ధులను ఇందుకు ఎంపిక చేయడం జరిగింది. ఫోల్డ్‌స్కోప్ ఉపయోగించి చూసిన విద్యార్థులు , ఇతర విద్యార్థుల కంటే మరింత మెరుగైన నోటి పరిశుభ్రత అలవాట్లు చేసుకున్నట్టు గుర్తించడం జరిగింద ని” డాక్టర్ రావు తెలిపారు.
ఈ అధ్యయనం ఫలితాల ఆధారంగా చూసినపుడు, కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను చూపించే సామర్ధ్యం ఫోల్డ్‌స్కోప్ కు ఉన్నట్టు తేలింది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యకు ప్రధాన కారణం ఇవే.“ ఈ పరికరాన్ని పర్యావరణ కారణాలు, నీటి నాణ్యతలో లోపాల కారణంగా తలెత్తే మూత్రపిండాలలో రాళ్లసమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో విజయవంతంగా ఉపయోగించవచ్చు” అని డాక్టర్ రావు తెలిపారు. ఈ ప్రయోజనాలన్నింటినీ గమనించినపుడు, ఫోల్డ్‌స్కోప్‌ను ఇంట్లోనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానకి వాడవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రతా పరీక్షా పరికరంగా వాడవచ్చు. ఇది తక్కువ ధరతో కూడినది మాత్రమే కాక దీనికి నిర్వహణ ఖర్చులు కూడా ఏమీ లేవు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు జర్నల్ ఆప్ మైక్రోస్కోపిలో ప్రచురితమయ్యాయి.
*****
(Release ID: 1633524)
Visitor Counter : 233