రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన 'కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్' ద్వారా భారత వైమానిక దళంలో చేరిన యువ నాయకుల బృందం

Posted On: 20 JUN 2020 3:59PM by PIB Hyderabad

    హైదరాబాద్ శివారులోని దుండిగల్ 'ఎయిర్ ఫోర్స్ అకాడమీ'లో నిర్వహించిన 'కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్' (సీజీపీ)ను ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. బధౌరియా సమీక్షించారు. 123 మంది ఫ్లైట్ క్యాడెట్లకు 'ప్రెసిడెంట్స్ కమిషన్', 11 మంది నౌకాదళ, తీర రక్షక దళ అధికారులకు 'వింగ్స్' ప్రదానం చేశారు. శిక్షణ పొందిన 123 మందిలో 61 మంది ఫ్లైయింగ్ బ్రాంచిలో, 62 మంది గ్రౌండ్ డ్యూటీ బ్రాంచిలో చేరారు. వీరిలో 19 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఇద్దరు వియత్నాం వైమానిక దళ అధికారులు కూడా శిక్షణ పూర్తి చేసుకుని 'వింగ్స్' అందుకున్నారు.
 
    కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా, ఎయిర్ చీఫ్ మార్షల్ సాధారణ వందనం అందుకున్నారు. దీనికిముందు జరిగిన 'పిప్పింగ్ సెరెమనీ'లో ఫ్లైట్ క్యాడెట్లు ఫ్లైయింగ్ ఆఫీసర్ ర్యాంకులు పొందారు. వివిధ విభాగాల్లో రాణించినవారు ట్రోఫీలు అందుకున్నారు.  ఫ్లైయింగ్ బ్రాంచిలో అందరికంటే ఎక్కువ ప్రతిభ చూపిన అనురాగ్ నయిన్ 'స్వార్డ్ ఆఫ్ హానర్', రాష్ట్రపతి ఫలకం పొందారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచిలో అందరికంటే ఎక్కువ ప్రతిభ చూపిన ఆంచల్ గంగ్వాల్ రాష్ట్రపతి ఫలకం అందుకున్నారు.
     
    గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన సాహస సైనికులకు అంజలి ఘటించిన ఎయిర్ చీఫ్ మార్షల్ బధౌరియా, తర్వాత పరేడ్ ను ఉద్దేశించి ప్రసగించారు. శిక్షణ పూర్తి చేసుకున్న, అవార్డులు పొందిన అధికారులను ఆయన అభినందించారు. ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూనే శిక్షణ అందించిన బోధన సిబ్బందిని అభినందించారు. భారత వైమానిక దళంలో చేరేలా యువతరాన్ని ప్రోత్సహించి, వారి కలలను నిజం చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శిక్షణ పూర్తికాగానే అధికారులు చేసిన ప్రమాణం.., బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వారికి మార్గదర్శక సూత్రంగా ఉండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ బధౌరియా చెప్పారు.

 


(Release ID: 1632951) Visitor Counter : 142


Read this release in: English , Urdu , Hindi , Tamil