శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ ప‌రీక్ష‌ల కోసం రూపొందించిన డిబిటి- ఏఎంటిజెడ్ మొబైల్ యూనిట్ ను ప్రారంభించి కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌
డిబిటి ప‌రీక్ష‌ల కేంద్రాల‌ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ప‌రీక్ష‌ల‌కోసం మొబైల్ ప‌రీక్ష‌ల యూనిట్ ను ఉప‌యోగిస్తాం: డాక్ట‌ర్ హర్ష‌వ‌ర్ధ‌న్‌
డిబిటి స‌హాయంతో రికార్డు స‌మ‌యంలో కేవ‌లం 8 రోజుల్లోనే ఐ- ల్యాబును త‌యారు చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మెడ్‌ టెక్ బృందం.
జీవ‌భ‌ద్ర‌త స‌దుపాయం క‌లిగిన ఈ యూనిట్ ద్వారా ఆర్ టి పిసిఆర్ మ‌రియు ఎలిసా ప‌రీక్ష‌ల‌ను చేయ‌వ‌చ్చు..

Posted On: 18 JUN 2020 7:39PM by PIB Hyderabad

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వైర‌స్ ప‌రీక్ష‌ల‌కోసం దేశంలోనే మొద‌టిసారిగా త‌యారైన ఐ ల్యాబ్ ( అంటువ్యాధుల‌ను గుర్తించే ప‌రీక్ష‌ల కేంద్రం)ను కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్రారంభించారు. బ‌యోటెక్నాల‌జీ విభాగం ( డిబిటి) కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ రేణు స్వ‌రూప్‌, ఆంధ్రా మెడ్ టెక్ జోన్ సిఇవో డాక్ట‌ర్ జితేందర్ శ‌ర్మ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప‌లువురు అధికారులు, నిపుణులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఈ ఐ ల్యాబుప‌ట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్య‌క్త‌ప‌రిచారు. ఈ మొబైల్ ప‌రీక్ష‌ల స‌దుపాయాన్ని డిబిటి ప‌రీక్ష‌ల కేంద్రాల ద్వారా దేశంలోని మారు మూల ప్రాంతాలకు పంపిస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో విశిష్ట సేవ‌లందిస్తున్న బ‌యోటెక్నాల‌జీ విభాగాన్ని ( డిబిటి) మంత్రి ప్ర‌శంసించారు. ప్ర‌ధాన‌మైన ప్ర‌యోగ‌శాలల్ని కోవిడ్ ప‌రీక్ష‌ల కేంద్రాలుగా మార్పు చేసి దేశంలో ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచ‌డంలో డిబిటి ముఖ్య‌మైన పాత్ర పోషించింద‌ని ఆయ‌న అన్నారు. డిబిటి కింద దేశంలో 20 ప్ర‌ధాన కేంద్రాలు ప‌ని చేస్తున్నాయి. వీటి కింద వంద ప‌రీక్ష‌ల ల్యాబులున్నాయి. ఇక్క‌డ ఇంత‌వ‌ర‌కూ రెండు ల‌క్ష‌లా అర‌వై వేల న‌మూనాల‌ను ప‌రీక్షించారు. 
కోవిడ్ మ‌హ‌మ్మారి వైర‌స్ ను నియంత్రించ‌డానికిగాను దేశంలో జ‌రుగుతున్న పోరాటంలో డిబిటి- ఏ ఎం టి జెడ్ క‌మాండ్ క‌న్సార్షియా చేస్తున్న సేవ‌ల‌ను మంత్రి ప్ర‌శ‌సించారు. లాక్ డౌన్ స‌మ‌యంలో అవిశ్రాంతంగా ప‌ని చేస్తూ కోవిడ్ టెస్టు కిట్టుల‌ను ఇత‌ర ప‌రిక‌రాల‌ను త‌యారు చేసింద‌ని అన్నారు. అంతే కాదు త‌క్కువ స‌మ‌యంలో ఈ విశిష్ట‌మైన ఐ ల్యాబ్ ను త‌యారు చేయ‌డానికి ఆంధ్రా మెడ్ టెక్ జోన్ బృందం కృషి చేసింద‌ని మంత్రి అన్నారు. ఇండియాకోసం ఇండియాలోనే త‌యారు చేయండి అనే ప్ర‌ధాని సంక‌ల్పం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మెడ్ టెక్ జోన్ ప‌ని చేస్తోంద‌ని శ్రీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌శంసించారు. ప్ర‌స్తుతం దేశంలో 953 కోవిడ్ ల్యాబులున్నాయ‌ని ఈ మ‌ధ్య‌కాలంలో దేశంలో తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా దేశీయంగా ప‌లు వైద్య ఆరోగ్య ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసుకుంటున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లో భాగంగా త్వ‌ర‌లోనే ఆరోగ్య రంగంలో స్వ‌యం స‌మృద్ధి సాధిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. భార‌తీయ శాస్త్ర‌వేత్త‌ల కృషి కార‌ణంగా ప్ర‌తి రోజూ ఐదు ల‌క్ష‌ల ప‌రీక్ష‌ల కిట్లు ఉత్ప‌త్తి చేసుకునే స్థాయికి దేశం చేరింద‌ని డిబిటి కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ రేణు స్వ‌రూప్ అన్నారు.. ఈ ఐ ల్యాబును ఆంధ్రప్ర‌దేశ్ లోని మెడ్ టెక్ జోన్ బృందం కేవ‌లం 8 రోజుల్లోనే త‌యారు చేసింద‌ని ఆమె వివ‌రించారు.  
వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అత్య‌వ‌స‌ర సాంకేతిక వ‌స్తువుల త‌యారీలో వున్న కొర‌త‌ను త‌గ్గించ‌డానికిగాను డిబిటి, ఏపీలోని మెడ్ టెక్ జోన్ క‌లిసి డిబిటి- ఏఎంటిజెడ్ క‌మాండ్ క‌న్సార్షియాగా ఏర్ప‌డ్డాయి. దీని కింద కేవ‌లం 8 రోజుల స‌మ‌యంలోనే ఐ ల్యాబును తయారు చేశారు. ఇది జీవ భ‌ద్ర‌త క‌లిగిన మొబైల్ డ‌యాగ్న‌స్టిక్ యూనిట్‌. దీని ద్వారా మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి ప‌రీక్ష‌లు చేయ‌వ‌చ్చు. ప‌లు మంత్రిత్వ‌శాఖల‌ మ‌ద్ద‌తుతో ఏర్ప‌డిన ఏఎంటిజెడ్ అనే సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప‌ని చేస్తోంది. ఇది మెడిక‌ల్ టెక్నాల‌జీల‌ను దేశానికి అందిస్తోంది. 

 

*****(Release ID: 1632492) Visitor Counter : 70