రక్షణ మంత్రిత్వ శాఖ
నిసర్గ తుపాను నేపథ్యంలో అత్యవసర సాయానికి పశ్చిమ నావికాదళం సన్నద్ధం
ముంబయి, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో నావికాదళ బృందాల మోహరింపు
ముంపు ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటికే అవసరమైన సామగ్రి తరలింపు
అవసరమైతే రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్న డోర్నియర్ విమానం, హెలికాఫ్టర్లు
Posted On:
02 JUN 2020 5:43PM by PIB Hyderabad
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనిశ్చిత పరిస్థితుల్లో ప్రజలను రక్షించడానికి, సాయం చేయడానికి భారత నౌకాదళం ఎప్పుడూ ముందుంటుంది. రుతుపవనాలు, నిసర్గ తుపాను కారణంగా పశ్చిమ తీరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారం అందించేందుకు అవసరమైన సామగ్రిని ఇప్పటికే తరలించింది. పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటోంది.
ముంబయిలోని 'మహారాష్ట్ర నావల్ ఏరియా'లో ఐదు వరద సహాయ బృందాలు, మూడు డైవింగ్ బృందాలు ఈ వర్షాకాలం మొత్తం సిద్ధంగా ఉంటాయి. ఆపత్కాలంలో సత్వర సాయం అందించేలా ఈ బృందాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరించారు. సహాయక కార్యక్రమాల్లో సంపూర్ణ శిక్షణ పొందిన, తగినంత సామగ్రి ఉన్న బృందాలివి. వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ బృందాలు ఇప్పటికే వెళ్లి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాయి.
కార్వార్ నావల్ ఏరియా, గోవా నావల్ ఏరియా, గుజరాత్ డామన్, డయ్యు నావల్ ఏరియాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే చేశారు. విపత్కర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ అధికారులతో నావల్ ఏరియా, స్టేషన్ కమాండర్లు సంప్రదింపులు జరుపుతున్నారు.
అరేబియా సముద్రంలో నిసర్గ తుపాను పొంచివున్న నేపథ్యంలో, ప్రజలకు సాయం చేయడానికి అన్ని బృందాలను సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేయడానికి పశ్చిమ నావికాదళ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముంబయి, గోవా, పోరుబందర్‌లోని నావల్ ఎయిర్ స్టేషన్లలో నావికాదళ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచారు. వరదల కారణంగా వెళ్లలేని ప్రాంతాలకు వాయుమార్గం ద్వారా సహాయక సిబ్బందిని తరలించడానికి, చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు.
(Release ID: 1628797)
Visitor Counter : 203