ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ - 19పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం
Posted On:
04 MAR 2020 3:55PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా దేశంలో తలెత్తుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరమూ కలిసికట్టుగా పని చేయాల్సి వుందని, అందరూ సమన్వయంతో, ఐకమత్యంతో, యుద్ధ ప్రాతిపదికన పని చేయాల్సి వుందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కోరారు. ఢిల్లీ ప్రభుత్వానికిచెందిన సీనియర్ అధికారులతోను, ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల డైరెక్టర్లు / మెడికల్ సూపరింటెండెంట్లతో కలిపి ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సత్యేంద్ర జైన్ హాజరయ్యారు.
కోవిడ్ -19 కారణంగా జాతీయంగా, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి నందన్ వివరించారు. ఈ రోజు వరకు 78 దేశాల్లో కోవిడ్ -19 విస్తరించిందని ఆమె తెలిపారు. కోవిడ్ -19ను ఎదుర్కోవడానికిగాను దేశంలోను, రాష్ట్రాల్లోను ఉన్నత స్థాయి జాగ్రత్తలను తీసుకోవడం జరిగిందని అదే స్థాయిలో చైతన్యం కలిగిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. విదేశాలకు ప్రయాణం చేసేవారి విషయంలో చేసిన సూచనలు సలహాల్లోని మార్పులు చేర్పుల గురించి ఆమె వివరించారు. వీటిని 2020 మార్చి 3న విడుదల చేయడం జరిగింది. కోవిడ్ 19 ప్రభావంగల చైనా, ఇరాన్, కొరియా, ఇటలీ, జపాన్ దేశాలకు ఎంతో అవసరమైతే తప్ప సాధారణ పరిస్థితుల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరినట్టు చెప్పారు. అంతే కాదు ప్రయాణాలకు సంబంధించి విడుదల చేసిన నియమ నిబంధనల గురించి ఆమె వివరించారు.
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, ఇతర విభాగాల మధ్యన అంతర్గత సమన్వయం వుండేలా జాగ్రత్తలు తీసుకున్నామని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. అంతే కాదు ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అత్యుత్తమ స్థాయిలో చర్యలు తీసుకోవడం, ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ వైరస్ విస్తరణను అడ్డుకునే వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని అన్నారు. అంతే కాదు ఆయా రాష్ట్రాలు, జిల్లాల్లోని పరిశీలనా బృందాల సాయంతో ఈ వైరస్ విస్తరణకోసం తగిన చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ వైరస్ విస్తరణను ఆపాలని ఆయన స్పష్టం చేశారు.
ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దగ్గర అందుబాటులో వున్న ప్రధానమైన ఆరోగ్య రంగ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని డాక్టర్ హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి నిఘా, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, ఆయా ఆసుపత్రుల సన్నద్దత, ఏ క్షణంలోనైనా పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం, సామర్థ్య పెంపుదల, ప్రమాద తీవ్రతను తెలియజేసే కమ్యూనికేషన్ వ్యవస్థ తదితర అంశాలగురించి ఆయన వివరించారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే దీని ప్రభావం వున్న వారిని విడిగా వుంచాల్సి వుంటుంది. ఇందుకోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని రోగ నిర్దారణ లేదా అనుమానిత కేసులను ఎప్పటికప్పుడు గుర్తించగానే వారిని ఆయా జిల్లాల్లోని ఈ ప్రత్యేక సౌకర్యాలకు తరలించాలని డాక్టర్ హర్ష వర్ధన్ ఆయా రాష్ట్రాలకు సూచించారు. దీనికి సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియాలోను తగిన చైతన్యం పెంచాలని ఈ పనిని ఆయా స్థానికభాషల్లో చేయాలన్నారు. అంతే కాదు స్థానికంగా వుండే కేబుల్ టీవీ ఛానెళ్లు, ఎఫ్ ఎం రేడియో సహకారాన్ని తీసుకోవాలని కోరారు.
డాక్టర్ బలరాం భార్గవ, కార్యదర్శి, ఐసిఎంఆర్, శ్రీ సంజీవ్‌కుమార్, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, డాక్టర్ రాజీవ్ గార్గ్ డిజిహెచ్ ఎస్, డాక్టర్ రణదీప్ గులేరియా, డైరెక్టర్ ఏఐఐఎంఎస్ ( ఢిల్లీ), శ్రీ లవ్ అగర్వాల్, జాయింట్ సెక్రటరీ, ఎస్ డి ఎంసీ, ఇడిఎంసీ, ఎన్ డి ఎంసీ, కేంద్రీయ విద్యాలయాల కమిషనర్లు ఇంకా ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(Release ID: 1607087)
Visitor Counter : 95