ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ హేతుబద్ధ చొరవతోనే ఆర్థిక స్వేచ్ఛ-సంపద సృష్టికి ఉత్తేజం: ఆర్థిక సర్వే సూచన

Posted On: 31 JAN 2020 1:16PM by PIB Hyderabad

 దేశంలో విపణుల పనితీరు సముచితంగా లేనప్పుడు ప్రభుత్వపరంగా చొరవ అవసరమేనని ఆర్థిక సర్వే ఆరంభ వాక్యాల్లోనే పేర్కొంది. అయితే, ప్రత్యేకించి దేశపౌరుల సంక్షేమానికి విపణులు చక్కగా కృషి చేయగలిగినప్పుడు మితిమీరిన ప్రభుత్వ జోక్యం ఆర్థిక స్వేచ్ఛను అణచివేయడంతోపాటు 'ఆర్థిక సామర్థ్య క్షీణత'కు దారితీస్తుందని స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారు, ఉత్పత్తిదారుపరంగా మిగులు సృష్టికి దోహదపడే అవకాశాలు వృథా అవుతాయి. తద్వారా వాటిల్లే నష్టం ఫలితంగా ఉత్పాదక కార్యకలాపాలకు వ్యవస్థాపక వనరులతోపాటు శక్తియుక్తులు కేటాయించి, ఆర్థిక చైతన్యాన్ని ప్రోత్సహించే సమర్థత కుంటుపడి అంతిమంగా సంపద సృష్టిని దెబ్బతీస్తుందని వివరించింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామణ్ ఈ 2019-20 ఆర్థిక సర్వేను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

నిత్యావసర వస్తువుల చట్టం-1955

   రవు, ఆహార కొరత వంటి సమస్యలు దేశాన్ని కలవరపెట్టే 1955 కాలంలో తెచ్చిన నిత్యావసరాల చట్టం అరాచకమైనదని, నేటి భారతానికి ఇది ఎంతమాత్రం సముచితం కాదని ఆర్థిక సర్వే వివరించింది. ఈ చట్టం కింద అనూహ్యంగా, తరచుగా సరకు నిల్వలపై ఆంక్షలు విధించడంవల్ల నిల్వకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రైవేటు రంగాన్ని నిరుత్సాహపరుస్తుందని పేర్కొంది. అంతేగాక వ్వావసాయిక విలువ శృంఖలం ప్రగతికి, వ్యవసాయోత్పత్తులకు జాతీయ విపణి అభివృద్ధికి అడ్డుగోడలు కడుతుందని తెలిపింది. పప్పుదినుసులు, చక్కెర, ఉల్లి నిల్వలపై పరిమితి విధించినప్పటికీ చిల్లర, టోకు ధరల్లో అస్థిరత్వంపై అది ప్రభావం చూపలేదని వెల్లడించింది. ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు చూపుతూ విపణికి మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా ఈ చట్టం మోపుతున్న భారాన్ని తగ్గించాల్సిందేనని పేర్కొంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని చెప్పింది. ఒక్కమాటలో చెబితే కొత్త సంపద సృష్టికి బదులు ఉన్న సంపదలో వాటా కోరడం, వేధింపులకు పాల్పడటానికి తప్ప నిత్యావసరా చట్టం మరెందుకూ పనికిరాని పరిస్థితి ఏర్పడిందని సర్వే విస్పష్టంగా వివరించింది.

 

అందుబాటు ధరలో ఔషధాలు

 

   ప్రజలకు ప్రాణరక్షక ఔషధాల అందుబాటుపై భరోసా ఇచ్చే ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలు మరింత పేదరికంలోకి కూరుకుపోకుండా ప్రభుత్వం తరచూ నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఔషధ ధరలపై నియంత్రణ విధించాల్సి వస్తోంది. తదనుగుణంగా జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (NPPA), ఔషధ ధరల నియంత్రణ ఆదేశాల (DPCO) కింద మందుల ధరలను నియంత్రిస్తోంది. దీనివల్ల నియంత్రిత ఔషధాల ధరలే కాకుండా అదేరకం అనియంత్రిత ఔషధ ధరలు కూడా పెరుగుతున్నాయని సర్వే పేర్కొంది. ఈ పరిణామం ఆశించిన ఫలితమివ్వకపోగా ప్రతికూల ప్రభావానికి దారితీస్తున్నదని విచారం వ్యక్తం చేసింది. చౌక మందులతో పోలిస్తే ధరల పెరుగుదల ప్రభావం ఖరీదైన మందుల విషయంలో ఏ విధంగా ఎక్కువగా ఉన్నదో సర్వే వివరించింది. అదేవిధంగా చిల్లర దుకాణాల్లో అమ్మే మందులతో పోలిస్తే ఆస్పత్రులలో విక్రయించే మందుల ధరలపై ఎక్కువ ప్రభావం ఉందని తెలిపింది. ఔషధ ధరల నియంత్రణ ఆదేశాల అమలుతో ప్రాణరక్షక ఔషధాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతున్నదని వివరించింది.

   ప్రభుత్వం తన అంగాలైన సీజీహెచ్ఎస్, రక్షణ, రైల్వే వంటివాటి ద్వారా అత్యధికంగా ఔషధాలు కొనుగోలు చేస్తూంటుందని సర్వే గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల కొనుగోళ్లను ఏకీకృతం చేయడంద్వారా తన బేరసారాల శక్తిని వినియోగించుకుని, అందుబాటు ధరలో మందులు లభించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించింది. ఈ ఉదాహరణను గమనంలో ఉంచుకుని ప్రభుత్వానికిగల బేరసారాల శక్తిని పారదర్శకంగా, విపణి దృక్పథంతో వినియోగించుకోగల, వక్రీకరణకు తావులేని యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు, దాని ఇతర విభాగాలకూ సర్వే సూచించింది. నియంత్రణ చట్టం విపణి విధుల్లో జోక్యం చేసుకుంటూ సంపద సృష్టికి విఘాతం కలిగించేవిధంగా ప్రోత్సాహకాలు ఇచ్చేవిధంగా ఉందని పేర్కొంది. పర్యవసానంగా అటు సామాజిక శ్రేయస్సు, ఇటు ఆర్థికాభివృద్ధిపై దుష్ప్రభావం పడుతున్నదని తెలిపింది.

ఆహార రాయితీల హేతుబద్ధీకరణ

   హార ధాన్యాల విపణిలో ప్రభుత్వ విధానాలను కూడా సర్వే విశ్లేషించింది. ఈ విధానాలవల్ల ధాన్యం, గోధుమ వంటి ఆహారధాన్యాల అతిపెద్ద కొనుగోలుదారు, నిల్వదారుగా ప్రభుత్వం ఆవిర్భవించిందని తెలిపింది. ఆహార రాయితీల భారం అంతకంతకూ పెరగడానికి ఈ విధానాలు దారితీసినట్లు వివరించింది. దీంతో విపణి సామర్థ్యాలు క్షీణించి, వ్యవసాయ రంగ దీర్ఘకాలిక వృద్ధిని దెబ్బతీయడమేగాక ఈ విపణులలో స్పర్థాత్మకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. భారత ఆహార సంస్థలో ముందుజాగ్రత్త నిల్వల భారం, పెరిగే ఆహార రాయితీ భారం, తృణధాన్యాల గిరాకీ-సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగిపోతూ పంటల వైవిధ్యీకరణను నిరుత్సాహపరచడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల విధానం క్రియాశీలం కావాల్సిన అవసరం ఉందని, తదనుగుణంగా ఆహారధాన్యాల సేకరణ-పంపిణీ వ్యవహారాలను నేరుగా కాకుండా నగదు బదిలీ/ఆహార కూపన్లు/స్మార్ట్ కార్డులు తదితరాల రూపంలో చేపట్టే యోచన చేయాలని సూచించింది.

రుణమాఫీలతో రుణ వితరణ విచ్ఛిన్నం

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రుణమాఫీలను కూడా సర్వే విశ్లేషించింది. పాక్షిక రుణమాఫీ పొందినవారితో పోలిస్తే పూర్తి రుణమాఫీ పొందిన లబ్ధిదారులు తక్కువ వినియోగం, తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడితోనూ, తక్కువ ఉత్పాదకతతోనూ సరిపెట్టుకుంటున్నారని తెలిపింది. రుణమాఫీలు రుణ వితరణ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడమేగాక ఆ లబ్ధిపొందిన రైతులకే అధికారిక రుణ ప్రవాహాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొంది. దీంతో రైతులకు మేలు చేయాలన్న రుణమాఫీ వాస్తవ లక్ష్యం నెరవేరడంలేదని స్పష్టం చేసింది. పాక్షిక మాఫీ లబ్ధిదారులతో పోలిస్తే పూర్తి లబ్ధిపొందినవారికి అధికారిక రుణ పరపతిలో వాటా తగ్గుతుందని, ఫలితంగా రుణమాఫీ లక్ష్యం నెరవేరదని వివరించింది. ఈ పరిస్థితుల నడుమ ఏయే రంగాల్లో విపణులను తక్కువగా అంచనా వేస్తూ ఎక్కడెక్కడ అనవసర జోక్యం చేసుకుంటున్నదీ ప్రభుత్వం క్రమపద్ధతిలో పరిశీలించుకోవాలని సర్వే సలహా ఇచ్చింది. అటువంటి సందర్భాలను నివారించడంద్వారా మాత్రమే స్పర్థాత్మక విపణుల సామర్థ్యం ఇనుమడించి తద్వారా పెట్టుబడులకు, ఆర్థిక వృద్ధి ఉత్తేజం లభిస్తుందని స్పష్టం చేసింది.

***** 


(Release ID: 1601398) Visitor Counter : 226


Read this release in: English , Marathi , Hindi