ఆయుష్

లెహ్ లో జాతీయ సోవా-రిగ్పా సంస్థ (ఎన్ఐఎస్ఆర్) ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 20 NOV 2019 10:46PM by PIB Hyderabad

లెహ్ లో జాతీయ సోవా-రిగ్పా సంస్థ (ఎన్ఐఎస్ఆర్)ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది.  ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధి లో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ గా ఇది ఏర్పాటు కానుంది. నిర్మాణ దశ నుంచే ఈ ప్రాజెక్టు ను పర్యవేక్షించడం కోసం లెవల్-14 కింద ఒక డైరెక్టర్ పోస్టు (రూ. 1,44,200-2,18,200/-)(ప్రీ-రివైజ్డ్ రూ.37,000-67,000) సృష్టి కి కూడా అనుమతిస్తూ తీర్మానించింది.

లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతం గా ఏర్పాటు చేయడం తో పాటు అక్కడి సంస్కృతి ని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందులో భాగం గా సోవా-రిగ్పా వైద్య విధానం ప్రగతి కోసం లెహ్ లో రూ. 47.25 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో జాతీయ సోవా-రిగ్పా సంస్థ ను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది.  భారతదేశ పరిధి లోని హిమాలయ పర్వత ప్రాంతం లో ప్రజలు అనుసరించే ఒక సంప్రదాయ వైద్యవిధానం ‘సోవా-రిగ్పా’. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ సహా సిక్కిమ్, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్ (పశ్చిమబెంగాల్), హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విశేష ప్రాచుర్యం గల ఈ విధానం నేడు దేశవ్యాప్తం గా అనుసరించబడుతోంది.

ఈ నేపథ్యం లో జాతీయ సోవా-రిగ్పా సంస్థ ఏర్పాటు ద్వారా భారత ఉప ఖండం లో ఈ వైద్య విధానం పునరుజ్జీవనాని కి మరింత ఉత్తేజం లభిస్తుంది.  ఆ మేరకు దేశం లోని యువతకే కాకుండా విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల కు కూడా ఈ సంస్థ లో అవకాశాలు కల్పిస్తారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధి లో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ గా ఏర్పాటవుతున్న ఈ జాతీయ సంస్థ లో సోవా-రిగ్పా సంబంధ పరస్పరాధారిత విద్య-పరిశోధన కార్యక్రమాలు చేపడతారు. ఇందులో భాగంగా విభిన్న వైద్యవిధానాల ఏకీకరణ దిశగా ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంయుక్త కృషి కూడా కొనసాగుతుంది. జాతీయ సోవా-రిగ్పా సంస్థ (ఎన్ఐఎస్ఆర్)ఏర్పాటు తర్వాత ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణ లో గల సోవా-రిగ్పా సంస్థల ను దీనితో సమ్మిళితం చేస్తారు. ఆ మేరకు సారనాథ్, వారణాసి లలోని టిబెటన్ స్టడీస్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ పరిధి లోని లెహ్ లో గల కేంద్రీయ బౌద్ధాధ్యయన సంస్థలు ఎన్ఐఎస్ఆర్  తో మమేకమవుతాయి.

ఈ సమ్మేళనం వల్ల నాణ్యమైన విద్య, శాస్త్రీయ విలువలు, నియంత్రణ నైపుణ్యం-ప్రామాణికత, సోవా-రిగ్పా ఉత్పత్తుల సురక్షత మూల్యాంకనం, సోవా-రిగ్పా ఆదారిత తృతీయ దశ ఆరోగ్య సేవల ప్రామాణీకరణల కు వీలు కలుగుతుంది.  అంతేకాకుండా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ డాక్టొరల్ స్థాయుల లో సోవా-రిగ్పా సంబంధ పరస్పరాధారిత విద్య-పరిశోధనల కు ప్రోత్సాహం లభిస్తుంది. సంప్రదాయ సోవా-రిగ్పా చట్రం చికిత్స సూత్రాల్లోని అత్యుత్తమ విధానాల ను, ప్రామాణిక ప్రక్రియల ను జాతీయ సోవా-రిగ్పా సంస్థ గుర్తిస్తుంది.  సామాన్యుల కు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కల్పన లో పాశ్చాత్య జీవ-కణ వైద్యవిధానం తో సహ-సంబంధం సాధ్యాసాధ్యాల ను కూడా పరిశీలిస్తుంది.

లక్ష్యం

అత్యున్నతమైన జాతీయ సోవా-రిగ్పా సంస్థ ను ఏర్పాటు చేయడం వెనుక గల లక్ష్యం-  సంప్రదాయ సోవా-రిగ్పా పరిజ్ఞానం, ఆధునిక శాస్త్ర సాంకేతికత-ఉపకరణాల మేలు కలయిక గా ప్రజోపయోగకర, ఆమోదిత విధానాన్ని అందుబాటులోకి తేవడమే.  ఆ మేరకు సోవా-రిగ్పా విధానం లో పరస్పరాధారిత విద్య-పరిశోధనల ను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది.

***
 (Release ID: 1592892) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi