మంత్రిమండలి

అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు-2016లో అధికారిక సవరణలకు మంత్రివర్గం ఆమోదం

Posted On: 21 MAR 2018 8:24PM by PIB Hyderabad

‘‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు-2016’’లో అధికారిక సవరణలు చేపట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతరుల కొరకు తాను బిడ్డను కనేటటువంటి (సరొగసి) ప్రక్రియ ను భారతదేశం లో నియంత్రించడం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయి లలో ప్రత్యేక బోర్డు లతో పాటు రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో సముచిత ప్రాధికార సంస్థ లను ఏర్పాటు చేయాలని ‘సరొగసి (రెగ్యులేశన్) బిల్లు, 2016’ ప్రతిపాదిస్తోంది.  దేశంలో నిస్సంతులైన దంపతులకు అవసరమైన మేర ఉపకారం చేసే రీతిలో అద్దె గర్భం ప్రక్రియ కు ప్రతిపాదిత చట్టం హామీని ఇస్తుంది.  అదే సమయంలో వాణిజ్య పరమైన అద్దె గర్భం ప్రక్రియ ను నిరోధించడంతో పాటు నియంత్రిస్తుంది కూడాను. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి చట్టంగా రూపొందిన తరువాత ‘జాతీయ అద్దె గర్భం ప్రక్రియ బోర్డు’ ఏర్పాటవుతుంది.  దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ను వెలువరించిన అనంతరం 3 నెలల వ్యవధిలో రాష్ట్రాల లోని, కేంద్ర పాలిత ప్రాంతాల లోని ప్రభుత్వాలు వాటి వాటి స్థాయిలలో బోర్డు లతో పాటు సముచిత ప్రాధికార సంస్థ లను ఏర్పాటు చేయవలసివుంటుంది.

ప్రధాన ప్రభావం:

ఈ చట్టం అమలు లోకి వస్తే దేశంలో అద్దె గర్భం సేవలను నియంత్రిస్తుంది.  అలాగే అనైతిక అద్దె గర్భాల ప్రక్రియను నిరోధించడంతో పాటు వాణిజ్య పరంగా దీన్ని అనుసరించకుండా అడ్డుకొంటుంది.  అంతేకాక నిస్సహాయురాళ్లయిన అద్దె గర్భం తల్లులు, మరొకరి కోసం వారు జన్మను ఇచ్చే పిల్లలు దోపిడి కి గురి కాకుండా చూస్తుంది.  వాణిజ్య పరంగా అద్దె గర్భాల ప్రక్రియ ను నిషేధించడమే కాకుండా మానవ పిండాల, పరిణత బీజ కణాల అమ్మకాలను,  కొనుగోళ్లను నిషేధిస్తుంది.  నిస్సంతులైన దంపతుల కోసం నిర్దిష్ట విధి విధానాలకు, షరతులకు అనుగుణంగా సంతాన ప్రాప్తికి అవసరమైన మేర నైతిక తోడ్పాటును ప్రసాదిస్తుంది.  నిస్సంతులైన భారత వివాహిత దంపతులెవరైనా దీని వల్ల లబ్ధి ని పొందేందుకు వీలు ఉంటుంది.  అలాగే అద్దె గర్భాన్ని ధరించే తల్లి యొక్క హక్కులకు, ఆమె జన్మనిచ్చే పిల్లల హక్కులకు సంపూర్ణమైనటువంటి రక్షణ లభిస్తుంది.  జమ్ము & కశ్మీర్ రాష్ట్రం మినహా మిగతతా భారతదేశమంతటికీ ఈ బిల్లు వర్తిస్తుంది.

పూర్వరంగం:

వివిధ దేశాల నుండి వచ్చే జంటలకు భారతదేశం ఓ అద్దె గర్భాల కూడలి గా రూపొందింది.  ఈ నేపథ్యంలో అనైతిక పద్ధతులు, అద్దె గర్భం తల్లులకు అన్యాయం, వారు జన్మనిచ్చిన పిల్లలు అనాథలు కావడం వంటి అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.  మానవ పిండాలు, పరిణత బీజ కణాల దిగుమతి కోసం దళారుల ముఠాలు తయారయ్యాయి.  దీంతో కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా వాణిజ్య పరమైన అద్దె గర్భం ప్రక్రియను నిషేధించాలని, అదే సమయంలో నైతిక ప్రక్రియను అనుమతించాలని లా కమిషన్ తన 228 వ నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  తదనుగుణంగా ‘‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు- 2016’’ను ప్రభుత్వం 2016 నవంబరు 21వ తేదీన లోక్‌ స‌భ‌లో ప్రవేశపెట్టింది. ఆరోగ్య-కుటుంబ సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ బిల్లును 2017 జనవరి 12న నివేదించారు. స్థాయీ సంఘం దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య వృత్తి నిపుణులు, న్యాయవాదులు, పరిశోధకులు తదితర వివిధ భాగస్వాములతో పలు సమావేశాలను నిర్వహించింది. ఈ సందర్భంగా చర్చలలో పాల్గొని సలహాలను, సూచనలను ఇచ్చేందుకు వీలుగా తల్లితండ్రులను, అద్దె గర్భం తల్లులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించింది.  అటుపైన ‘‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు-2016’’పై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన సదరు స్థాయీ సంఘం సమర్పించిన 102 వ నివేదిక ను ప్రభుత్వం 2017 ఆగస్టు 10వ తేదీన ఒకే సారి లోక్‌ స‌భ‌ మరియు రాజ్య సభ ముందు ఉంచింది.


***
 



(Release ID: 1525985) Visitor Counter : 206


Read this release in: Assamese , Tamil , English