Technology
22 భాషలు, డిజిటల్‌గా పునఃకల్పన
సాంకేతికత ద్వారా భారతదేశ భాషా భవిష్యత్తు ఆవిష్కరణ
Posted On:
25 OCT 2025 2:54PM
“భాష కేవలం ఒక సమాచార విధానమే కాదు, ఇది నాగరికత ఆత్మ, సంస్కృతి, వారసత్వం.”
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కీలకాంశాలు
- భాషిణి, భారత్‌జెన్ లాంటి ఏఐ వేదికల ద్వారా 22 షెడ్యూల్డ్ భాషలకు మద్దతు
- ఎస్‌పీపీఈఎల్(అంతరించిపోతున్న భాషల రక్షణ పథకం), సంచికలోని డిజిటలీకరణ జరిగిన భాషల సమాచారంతో బహుభాషా పరిష్కారాల కోసం మెరుగ్గా ఏఐ మోడల్ శిక్షణ
- బహుభాషా డిజిటలీకరణలో సాంకేతికత ఆధార కార్యక్రమాలతో ప్రపంచ అగ్రగామిగా నిలుస్తున్న భారత్
పరిచయం

భారతదేశ భాషా దృశ్యం ప్రపంచంలోనే వైవిధ్యమైన వాటిలో ఒకటి. సువిశాల భౌగోళిక ప్రాంతంలో 22 షెడ్యూల్డ్ భాషాలతో పాటు వందలాది గిరిజన, ప్రాంతీయ మాండలికాలను ప్రజలు మాట్లాడతారు. డిజిటలీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ భాషా వైవిధ్యాన్ని డిజిటల్ రూపంలోకి మార్చడం చాలా కీలకంగా మారింది. ఇప్పుడు సాంకేతికత కేవలం ఒక సమాచార విధానమే కాదు, భాష ఇప్పుడు సమ్మిళితత్వానికి వెన్నెముక.
మేదస్సుతో కూడిన, విస్తరించదగిన భాషా పరిష్కారాలను నిర్మించడానికి భారత ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ), నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ), మెషీన్ లెర్నింగ్, స్పీచ్ రికగ్నీషన్ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగిస్తోంది. సులభతర సంభాషణ, తక్షణ అనువాదం, మాటల ద్వారా నియంత్రించ గల సాధనాలు, స్థానికతకు తగ్గ కంటెంట్ ఇవ్వడం వంటి డిజిటిల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టింది. భాషా వైవిద్యాన్ని గౌరవిస్తూ నిర్మిస్తున్న పటిష్ఠమైన సాంకేతిక వ్యవస్థను నిర్మించడం ద్వారా ప్రతీ పౌరుడు తన మాతృభాషతో సంబంధం లేకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పరిపాలనలో భాగస్వామిగా మారేలా సమ్మిళిత డిజిటల్ భవిష్యత్తుకు భారత్ పునాది వేస్తోంది.
భాషా సమగ్రతకు దోహదపడుతున్న కీలక వేదికలు
ఏఐ ఆధారిత భాషా వేదికలు, విస్తృతమైన డిజిటల్ భాండాగారాలు భారతదేశ భాషల పరిరక్షణ, వినియోగం, అభివృద్ధి ఎలా జరిగిందో పునఃకల్పన చేస్తున్నాయి. భాషిణి, భారత్ జెన్ వంటి వేదికలు పరిపాలన, ఆరోగ్యసంరక్షణ, విద్య వంటి రంగాల్లో బహుభాషా సహాయాన్ని అందిస్తున్నాయి. ఆది-వాణి లాంటి కార్యక్రమాలు గిరిజన భాషలను డిజిటల్ పరిధిలోకి తెస్తున్నాయి. తద్వారా భారతదేశ భాషా వారసత్వాన్ని కేవలం పరిరక్షించడమే కాకుండా వ్యవహారికంగా మారడంతో పాటు డిజిటల్ యుగానికి తగ్గట్టుగా మారుతున్నాయి.
గత దశాబ్దకాలంగా కృత్రిమ మేధ, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డిజిటల్ సదుపాయాలు భారతదేశ భాషా వైవిద్యాన్ని లిఖితపరచడం, డిజిటల్‌గా మార్చడం, పునరుజ్జీవంపచేయడం వంటి ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఈ సాంకేతికతలు వందలాది భాషాలు, మాండలికాలకు సంబంధించి భారీ స్థాయిలో డేటా సేకరణ, ఆటోమేటెడ్ అనువాదం, మాటల ద్వారా గుర్తింపునకు ఈ సాంకేతికతలు అవకాశం కల్పించాయి. ఈ భాషల్లో చాలావరకు గతంలో వెనుకబడ్డాయి. ఈ సాంకేతిక వేగం కమ్యూనికేషన్ అంతరాలను పూడ్చడానికి, సమ్మిళిత పరిపాలనను ప్రోత్సహించడానికి, డిజిటల్ కంటెంట్‌ను మాతృ భాషల్లో అందుబాటులో ఉంచడం ద్వారా సమాజాన్ని శక్తివంతం చేయడానికి దోహదపడ్డాయి.
ఆది-వాణి: గిరిజన భాషల భాగస్వామ్యం కోసం ఏఐ

2024లో స్థాపించిన ఆది-వాణి గిరిజన భాషల సంరక్షణ, తక్షణ అనువాదం కోసం అంకితమైన భారతదేశ మొదటి ఏఐ ఆధారిత వేదిక. అత్యాధునిక భాషా సాంకేతికతల ద్వారా సమాచారాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు రూపొందించిన ఆది-వాణి.. కృత్రిమ మేధ కచ్చితత్వాన్ని, మానవ భాషా నైపుణ్యంతో మిళితం చేయడం ద్వారా అంతరాయం లేని బహుభాషా అనుభూతిని అందిస్తుంది.
సంతాలి, మండారి, గోండి వంటి భాషలకు మద్దతు ఇవ్వడానికి ఆది-వాణి స్పీచ్ రికగ్నీషన్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ) వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తోంది. ఈ భాషల్లో చాలావరకు సంప్రదాయంగా మౌఖికంగా వ్యాప్తి చెందాయి. ఇవి తగినంతగా డిజిటల్ రూపంలో లేవు. గిరిజన భాషలు, ప్రధాన భాషల మధ్య తక్షణ అనువాదానికి అవకాశం కల్పించడం ద్వారా ఈ వేదిక సంపన్నమైన సంప్రదాయాలను సంరక్షించడంతో పాటు విద్య, పరిపాలన, సాంస్కృతిక రచనను అందుబాటులోకి తెచ్చింది.
అంతరించిపోతున్న భాషల పరిరక్షణ పథకం(ఎస్‌పీపీఈఎల్)
అంతరించిపోతున్న భాషల పరిరక్షణ పథకాన్ని(ఎస్‌పీపీఈఎల్) కేంద్ర విద్యా శాఖ 2013లో ప్రారంభించింది. మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీఐఐఎల్) దీనిని అమలు చేస్తోంది. అంతరించిపోతున్న, ముఖ్యంగా 10 వేల మంది కంటే తక్కువ జనాభా మాట్లాడుతున్న భారతీయ భాషలను లిఖించడం, డిజిటల్‌గా భద్రపరచడంపై ఇది దృష్టాసారించింది.
ఇది టెక్స్ట్, ఆడియో, వీడియో డేటాను ఉత్పత్తి చేస్తూ ఏఐ, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ)కి కీలకమైన వనరులకు సమకూరుస్తోంది. ఆవిష్కరణ, సంరక్షణకు ఉపయోగపడుతోంది. సీఐఐఎల్‌కు చెందిన డిజిటల్ వేదిక సంచిక లాంటి వేదికలు ఏఐ మోడల్ శిక్షణ, మెషీన్ అనువాదానికి సహాయపడటంతో పాటు సాంస్కృతికంగా లోతైన భాషా సాంకేతికతల అభివృద్ధికి ఉపయోగపడుతోంది.
సంచిక: భారతీయ భాషల డిజిటల్ కోశాగారం
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ నిర్వహిస్తున్న సంచిక.. షెడ్యూల్డ్, గిరిజన భాషల నిఘంటువులు, ప్రాథమిక, కథా పుస్తకాలు, మల్టీమీడియా వనరులను సమీకరిస్తోంది. ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ శిక్షణ, అనువాద వ్యవస్థల అభివృద్ధి, సాంస్కృతిక కథలను రక్షించడానికి ఈ కేంద్రీకృత డిజిటల్ నిధి కీలక డేటా వనరు.
ఈ వేదిక టెక్స్ట్, ఆడియో, వీడియో సహా భాషాపరమైన డిజిటల్ వనరులను అందించడం ద్వారా విద్యాపరమైన పరిశోధన, భాషా విద్య, సాంస్కృతిక డాక్యుమెంటేషన్‌కు ఉపయోగపడుతోంది. ఈ సంపన్నమైన, వైవిద్యభరిత సేకరణలు సరికొత్త ఏఐ, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్‌లకు ప్రాథమిక డాటాసెట్‌లను అందించడం ద్వారా తక్కువ వనరులు కలిగిన గిరిజన, ప్రాంతీయ భాషాలకు ప్రభావవంతమైన డిజిటల్ సాధానాలను అందిస్తోంది.
భారత్‌జెన్: భారతీయ భాషలకు ఏఐ మోడల్స్
22 షెడ్యూల్డ్ భాషలకు భారత్‌జెన్ అధునాతన టెక్స్ట్-టు-టెక్స్ట్, టెక్స్ట్-టు-స్పీచ్ అనువాద నమూనాలను అభివృద్ధి చేస్తోంది. ఎస్‌పీపీఈఎల్, సంచిక నుంచి డేటాను స్వీకరించి పరిపాలన, విద్య, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే శక్తివంతమైన బహుభాషా సాధనాలను తయారుచేస్తోంది. డిజిటల్ కంటెంట్ అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా భరోసాని ఇస్తోంది.
పరిపాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో సమ్మిళితత్వం, డిజిటల్ సౌలభ్యాన్ని పెంపొందించేలా భారత్‌జెన్ బహుభాషాల ఏఐ వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. తద్వారా భారతీయ వైవిధ్యమైన భాషా దృశ్యంలో నిరాటంకంగా సమాచార ప్రసారానికి, కంటెంట్ అందించడానికి దోహదపడుతున్నాయి.
జీఈఎం, జీఈఎంఏఐ: ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ కోసం ఏఐ ఆధారిత బహుభాషా సహాయకారి
గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్(జీఈఎం) అనేది ప్రభుత్వం చేపట్టే కొనుగోళ్ల కోసం భారతదేశ డిజిటల్ వేదిక. 2016 ఆగస్ట్ 9న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. పారదర్శకత, సమర్థతకు భరోసానిస్తూ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది.
వినియోగదారు సౌలభ్యం, సమాన అవకాశాలను పెంపొందించడానికి జీఈఎంలో జీఈఎంఏఐ అనే ఏఐ ఆధారిత బహుభాషా సహాయకారిని చేర్చారు. బహుళ భారతీయ భాషల్లో సంభాషణ, టెక్స్ట్ ఆధారిత సహాయాన్ని అందించేందుకు అధునాతన నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ), మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను జీఈఎంఏఐ వినియోగిస్తోంది. దీని ద్వారా ఈ వేదికపై సెర్చ్ చేయడానికి, సరైన చోటుకు వెళ్లేందుకు, లావాదేవీలు పూర్తి చేసేందుకు వినియోగదారులకు మరింత సులభతరం అవుతుంది. తద్వారా ప్రభుత్వం చేసే కొనుగోళ్లలో భాషా సంబంధ అడ్డంకులను తొలగించేందుకు వీలవుతోంది.
భాషిణి: సమ్మిళిత భారత్ కోసం ఏఐ ఆధారిత బహుభాషా అనువాదం
జాతీయ భాషా అనువాద మిషన్(ఎన్ఎల్‌టీఎం) కింద ఉండే భాషిణి.. 22 షెడ్యూల్డ్ భాషలు, గిరిజన భాషల తక్షణ అనువాదానికి అవకాశం కల్పించే ఏఐ వేదిక. మెషీన్ ద్వారా అనువాదం, మాటల ద్వారా గుర్తింపు, సహజంగా భాషను అర్థం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు, డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు డిజిటల్ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తోంది.
కీలక విజయాలు:
పార్లమెంటు చర్చల అనువాదం, పౌరుల భాగస్వామ్యం కోసం ఏఐ ఆధారిత సన్‌సద్ భాషిణి రూపొందుతోంది.
గిరిజన పరిశోధన, సమాచార, విద్య, ప్రసార, వేడుకల(టీఆర్ఐ-ఈసీఈ) పథకం
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గిరిజన పరిశోధన, సమాచార, విద్య, ప్రసార, వేడుకల(టీఆర్ఐ-ఈసీఈ) పథకం గిరిజన భాషలు, సంస్కృతులను పరిరక్షించే లక్ష్యంతో చేపట్టే పరిశోధనలు, రచనా ప్రాజెక్టులకు సహాయాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఆంగ్లం లేదా హిందీ టెక్స్ట్, సంభాషణను గిరిజన భాషల్లోకి లేదా గిరిజన భాషల నుంచి ఆంగ్లం లేదా హిందీలోకి అనువాదం చేయగల ఏఐ ఆధారిత సాధనాల అభివృద్ధికి ఈ పథకంలో భాగంగా మంత్రిత్వ శాఖ సహకరిస్తోంది.
అంతరించిపోతున్న గిరిజన భాషల డిజిటల్ రక్షణ, తక్షణ అనువాదానికి ఉపయోగపడేలా మెషీన్ లెర్నింగ్, స్పీచ్ రికగ్నీషన్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ)లతో ఈ సాధనాలు పనిచేస్తాయి. గిరిజన పరిశోధన సంస్థలు, భాషా నిపుణుల సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు సమాజ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతోంది. తద్వారా భాషలో కచ్చితత్వానికి, సాంస్కృతి సున్నితత్వానికి భరోసానిస్తోంది.
డిజిటల్ ప్రాచీన గ్రంథాలయం, విద్యాపరమైన ప్రయత్నాలు
ప్రాచీన రాతప్రతులు, జానపద సాహిత్యం, మౌఖిక సంప్రదాయాలను డిజిటలీకరణ చేయడానికి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీఐఐఎల్), ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్(ఐజీఎన్‌సీఏ) వంటి సంస్థలు భాషిణితో భాగస్వామ్యమయ్యాయి. ఈ డిజిటల్ ప్రాచీణ గ్రంథాలయాలు ఏఐ, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్‌పీ) వ్యవస్థలను మరింత సుసంపన్నం చేస్తున్నాయి. తద్వారా అత్యాధునిక అనువాద పరిష్కారాలకు, సంరక్షణకు తోడ్పడుతున్నాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సాంకేతికత మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తున్నాయి.
ఏఐ ఆధారిత బహుభాషా వేదికలతో విద్య మరింత శక్తివంతం
అభ్యాసనను మరింత సులభతరం, అందుబాటులో ఉంచడం, భాషాపరంగా వైవిధ్యం చేయడం ద్వారా కృత్రిమ మేధ భారతీయ విద్యా వ్యవస్థను మార్చేస్తోంది. కనీసం ఐదో తరగతి వరకు, ఆ తర్వాత ఎనిమిదో తరగతి, ఆ పై వరకు ప్రాధాన్యతగా విద్యార్థుల మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగాలనేది జాతీయ విద్యా విధానం-2020 సంకల్పం దిశగా ఈ ఏఐ ఆధారిత భాషా సాంకేతికతలు నడిపిస్తున్నాయి.
ఈ-కుంభ్ పోర్టల్ అంటే ఏంటి?
ఈ-కుంభ్ అనేది ఏఐసీటీఈకి చెందిన పోర్టల్. మాతృభాషలో విద్యాబోధన జరగాలనే జాతీయ విద్యా విధానం-2020 సంకల్పానికి మద్దతుగా సాంకేతక విద్యకు సంబంధించిన పుస్తకాలు, అధ్యయన వనరులను ఈ వేదికపై బహుళ భారతీయ భాషల్లో ఉచితంగా పొందవచ్చు.
సంస్థాగత స్థాయిలో ఏఐసీటీఈ అనువాదిని యాప్ ఉంది. ఇది భారతీయ భాషల్లోకి ఇంజినీరింగ్, వైద్య, న్యాయ, డిగ్రీ, పీజీ, నైపుణ్యాభివృద్ధి పుస్తకాలను వేగంగా అనువాదం చేయడానికి ఉపయోగపడే స్వదేశీ ఏఐ ఆధారిత బహుభాషా అనువాద సాధనం. అనువదించిన కంటెంట్ ఈ-కుంభ్ పోర్టల్‌లో ఉంటుంది. తద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని మాతృభాషల్లో పొందడానికి వీలు కలుగుతుంది.

ఈ ఏఐ ఆధారిత కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా దీర్ఘకాల జాతీయ ప్రయత్నాలైన పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువాదం చేసే జాతీయ అనువాద మిషన్(ఎన్‌టీఎం), పురాతన రచనలను పరిరక్షించి, డిజిటలీకరణ చేసే జాతీయ మిషన్ ఆన్ మనుస్క్రిప్ట్స్(ఎన్ఎంఎం)కు ఉపయోగపడుతున్నాయి. ఇవి భారతీయ భాషా వారసత్వం, భవిష్యత్తుకు తగ్గట్టుగా మార్చడం, ఏఐ ఆధారిత విద్యా వ్యవస్థ మధ్య సంబంధాన్ని నిర్మిస్తున్నాయి.
స్వయం వంటి డిజిటల్ వేదికలు బహుభాషల్లో కంటెంట్ అందిస్తున్నాయి. 2025 మధ్య నాటికి స్వయంలో దాదాపు 5 కోట్ల మంది అభ్యాసకులు నమోదయ్యారు. రానున్న మూడేళ్లలో అన్ని పాఠశాల, ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ డిజిటల్‌గా భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
భాషిణి లాంటి ఏఐ వేదికల ద్వారా పాఠశాలలు, ఎడ్‌టెక్ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు స్థానిక భాషల్లోకి పుస్తకాలను, అభ్యాస వనరులను అందించడానికి వీలు కలుగుతుంది. తద్వారా భాషాపరమైన అంతరాలను పూడ్చడానికి, ప్రతి విద్యార్థి మాతృభాషలో డిజిటల్ విద్యను అందించేందుకు, అవగాహనను మెరుగుపరిచేందుకు వీలు కలుగుతుంది.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా డిజిటల్ విద్యా చట్రం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు భారతీయ భాషా వైవిధ్యాన్ని మరింత దృఢపరుస్తుంది. దేశంలోని అనేక భాషలు కేవలం సాంస్కృతిక ఆధారాలుగా మిగిలిపోకుండా బోధన, జ్ఞానం, ఆవిష్కరణలకు సజీవ, వ్యవహారిక మాధ్యమంగా మారేలా చేస్తోంది.
పరివర్తన వెనుక సాంకేతికత
భారతదేశ బహుభాషా డిజిటల్ వ్యవస్థ బహుభాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొంది, అధునాతన ఏఐ, కంప్యూటర్ ఆధారిత భాషాశాస్త్ర సాంకేతికతలతో నడుస్తోంది. ఆధునిక ఆవిష్కరణలను వినియోగించడం ద్వారా ఈ సాంకేతికతలు కేవలం భాషా వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా వివిధ భాషల మధ్య నిరంతర, తక్షణ సమాచార ప్రసారానికి సాధనంగా పనిచేస్తుంది. విస్తృత స్థాయిలో డిజిటల్ సౌలభ్యాన్ని పెంచుతుంది.
ఈ వ్యవస్థలోని కీలక భాగాలు:
ఆటోమెటిక్ స్పీచ్ రికగ్నీషన్(ఏఎస్ఆర్): వివిధ భారతీయ భాషల్లో మాట్లాడే పదాలను కచ్చితమైన టెక్స్ట్‌గా మారుస్తుంది. తద్వారా మాటల ఆధారంగా పనిచేసే అప్లికేషన్లు, కమాండ్ ఇంటర్‌ఫేస్‌లు, తక్షణ ట్రాన్స్‌క్రిప్షన్ సేవలకు అవకాశం ఉంటుంది.
టెక్స్ట్-టు-స్పీచ్(టీటీఎస్): స్థానిక భాషల్లో సహజంగా, స్పష్టంగా మాటలను అందిస్తుంది. తద్వారా డిజిటల్ అసిస్టెంట్స్, విద్యాసంబంధ సాధనాలు, ప్రభుత్వ సేవల సౌలభ్యం మరింత పెరుగుతుంది.
న్యూరల్ మెషీన్ ట్రాన్స్‌లేషన్(ఎన్ఎంటీ): డీప్ లెర్నింగ్ మాడళ్లను ఉపయోగించి సందర్భానికి తగ్గట్టుగా, బహుళ భారతీయ భాషల మధ్య తక్షణ అనువాదాలను అందిస్తుంది. వాక్యనిర్మాణ, అర్థ సంబంధిత సమస్యలను అధిగమిస్తుంది.
నాచురల్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్(ఎన్ఎల్‌యూ): ఏఐ వ్యవస్థలు వినియోగదారు ఉద్దేశం, భావోద్వేగం, సందర్భాన్ని స్థానిక భాషల్లో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా సంభాషణాత్మక ఏజెంట్ల పనితీరు, వినియోగదారు సౌలభ్యం మెరుగవుతుంది.
ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత ఆర్కిటెక్చర్లు(ఇండిక్‌బీఈఆర్‌టీ, ఎంబీఏఆర్‌టీ): ఈ అత్యాధునిక మోడళ్లు భారతీయ బహుభాషలపై భారీగా శిక్షణ పొందాయి. తద్వారా ఇవి భాషల అనువాదం, అర్థాన్ని గ్రహించడంలో అధిక కచ్చితత్వంతో పనిచేస్తాయి.
కార్పస్ అభివృద్ధి, డేటా నిర్వహణ: డిజిటలీకరణ చేసిన ప్రాచీన గ్రంథాలు, జానపద కథలు, మౌఖిక సంప్రదాయాలు, ప్రభుత్వ రికార్డులు, విద్యా సంబంధ అంశాల నుంచి విస్తృతమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఇవి భారతదేశంలోని భాషా వైవిధ్యానికి తగ్గట్టుగా సమృద్ధమైన డేటాను అందించి ఏఐ మోడళ్ల శిక్షణ, సరిచేయడానికి ఉపయోగపడతాయి.
భాషిణి, భారత్‌జెన్, ఆది-వాణి లాంటి సాంకేతికత ఆధారంగా పనిచేసే వేదికలు భారతదేశ ప్రత్యేక బహుభాషా సందర్భానికి అనుగుణంగా విస్తరించగల, కచ్చితమైన, సమగ్ర భాషా సాంకేతికతల ఆధారంగా పనిచేస్తున్నాయి.
ముగింపు
భాషా పరిరక్షణలో భారతదేశ భవిష్యత్తు అత్యాధునిక సాంకేతికతతో శక్తివంతమైంది. ఏఐ, డిజిటల్ ఆర్కైవ్స్‌ను జోడించడం ద్వారా దేశ సమృద్ధమైన భాషా వారసత్వాన్ని సచేతనంగా, అందుబాటులో ఉంచుతోంది. భాషిణి, భారత్‌జెన్, ఆది-వాణి వంటి వేదికలు, ఎస్‌పీపీఈఎల్, టీఆర్ఐ-ఈసీ వంటి లక్షిత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పౌరులు వారి సొంత భాషల్లో సేవలు పొందేలా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ సమగ్ర విధానం భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షించడమే కాకుండా సమ్మిళిత డిజిటల్ వృద్ధికి దోహదపడుతోంది. బహుభాషా ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతోంది.
Digital.gov
Ministry Of Home Affairs
Ministry of Electronics & Information Technology
https://dic.gov.in/bhashini
https://aikosh.indiaai.gov.in/home/models/details/ai4bharat_indicbert_multilingual_language_representation_model.html
Ministry Of Tribal Affairs
https://adivaani.tribal.gov.in/
Ministry Of Education
https://swayam.gov.in/
See in PDF
***
(Backgrounder ID: 155787)
Visitor Counter : 1
Provide suggestions / comments