సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నషాముక్త్ భారత్ లక్ష్యంగా 40 కిలోమీటర్ల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ పాదయాత్రకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నాయకత్వం


మూడు రోజుల పాదయాత్రకు విశేష ప్రజాస్పందన
ముగింపు కార్యక్రమానికి హాజరైన ముగ్గురు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2026 7:05PM by PIB Hyderabad

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం, సమాజంలోని అన్ని వర్గాల సమష్టి భాగస్వామ్యంతో సమగ్ర విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖలు, పోలీసు వ్యవస్థ, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువజన సంఘాలు, కుటుంబాలు, పౌరులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగ నివారణతో పాటు, బాధితులకు చికిత్స, పునరావాస సేవలు అందించడంలోనూ సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 2029 వరకు నషాముక్త్ భారత్ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషాముక్త్ భారత్’ పాదయాత్ర నవంబర్ 27న జూబ్లీహిల్స్‌లో ఘనంగా ముగిసింది. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రకు సమాజంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన 100 వారాల ‘నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’లో భాగంగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ‘నషాముక్త్ భారత్ అభియాన్’కు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమంగా ఈ పాదయాత్రను అభివర్ణించిన శ్రీ కిషన్ రెడ్డి, 2029 నాటికి భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, “మాదకద్రవ్యాల కారణంగా తన కుమారుడి భవిష్యత్తు నాశనమవడాన్ని ఏ తండ్రి చూడకూడదు” అని అన్నారు. ఆరోగ్యవంతమైన, సాధికారత కలిగిన, మాదకద్రవ్యాల రహిత యువతే భారతదేశానికి గొప్ప సంపద అని పేర్కొన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ జ్ఞానం, క్రమశిక్షణ, నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు సహాయం కోరే వ్యక్తులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని మంత్రి పౌరులను కోరారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన 24 గంటల జాతీయ టోల్ ఫ్రీ డ్రగ్ డీ-అడిక్షన్ హెల్ప్‌లైన్ *14446* ద్వారా కౌన్సెలింగ్, ఇతర సహాయక సేవలను పొందవచ్చని తెలిపారు.

*హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల మీదుగా పాదయాత్ర*

నవంబర్ 25న అంబర్‌పేటలో ప్రారంభమైన పాదయాత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం, బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం, అమీర్‌పేటలోని మైత్రివనం తదితర ప్రముఖ ప్రాంతాల మీదుగా సాగి జూబ్లీహిల్స్‌లో ముగిసింది. పాదయాత్ర సందర్భంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, వైద్యులు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, ఆధ్యాత్మిక, సామాజిక ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్నవారు జాతీయ జెండాలు, ప్రచార టీ-షర్టులు ధరించి ‘డ్రగ్స్‌కు నో చెప్పండి’, ‘మీ జీవితాన్ని మాదకద్రవ్యాలు శాసించనివ్వకండి’ వంటి సందేశాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. పాదయాత్రలో భాగంగా యోగా కార్యక్రమాలు, నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.

*ప్రముఖుల భాగస్వామ్యంతో ముగింపు కార్యక్రమం*

జూబ్లీహిల్స్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముగ్గురు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు – ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కె. చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె. చిరంజీవి మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం యువత ఆశయాలు, ఆకాంక్షలు, భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కుటుంబం, దేశం పట్ల తమ బాధ్యతలను గుర్తించి ఆరోగ్యవంతమైన, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని యువతకు సూచించారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖులు, పౌరులు నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు.

మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సి.హెచ్. విద్యాసాగర్ రావు, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ బండ్రెడ్డి సుకుమార్, ఎంపీలు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ రఘునందన్ రావు తదితరులు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ అలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, శ్రీ మల్క కొమరయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో పాల్గొన్నారు.

పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్ శ్రీ పుల్లెల గోపీచంద్, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి దీపికా రెడ్డి, శ్రీ గడ్డం సమ్మయ్య, సైయెంట్ వ్యవస్థాపకులు శ్రీ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రీ అక్కినేని నాగార్జున, శ్రీ దగ్గుబాటి వెంకటేశ్, శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీ సాయికుమార్, శ్రీ నిఖిల్ సిద్ధార్థ్, కుమారి పాయల్ రాజ్‌పుత్ పాదయాత్రలో పాల్గొన్నారు. దర్శకులు శ్రీ బండ్రెడ్డి సుకుమార్, శ్రీ బోయపాటి శ్రీను, మిమిక్రీ కళాకారుడు శ్రీ శివారెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సినీ నటుడు శ్రీ ప్రభాస్, మాజీ క్రికెటర్ శ్రీ వి.వి.ఎస్. లక్ష్మణ్ వర్చువల్‌గా తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

*యువత భాగస్వామ్యాన్ని పెంపొందించిన విద్యాసంస్థలు*

ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్. నాగరాజు అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, యువతను చైతన్యపరచడం, సమాజ భాగస్వామ్యంతో నివారణ చర్యలు చేపట్టడంలో విద్యాసంస్థల పాత్రను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

40 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా ముగియడం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని స్పష్టమైంది. మాదకద్రవ్యాల నివారణకు అవగాహన, ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో జోక్యం, కౌన్సెలింగ్, పునరావాసం, సామాజిక పునరేకీకరణ వంటి అంశాలపై నిరంతర కృషి అవసరమని ఈ కార్యక్రమం సందేశాన్నిచ్చింది.

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న నషాముక్త్ భారత్ అభియాన్ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువత, బలహీన వర్గాలను చైతన్యపరచడం ద్వారా మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

***


(రిలీజ్ ఐడి: 2343230) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil