బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా మైనింగ్ వీక్-2027తో ఏఐసీ ఐఐటీ ఢిల్లీ భాగస్వామ్యం


స్టార్టప్ పెవిలియన్‌లో ఉచిత స్టాళ్లకు దరఖాస్తుల ఆహ్వానం... తుది గడువు డిసెంబరు 15

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 5:25PM by PIB Hyderabad

నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ మద్దతుతో పనిచేస్తున్న 'అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఐఐటీ ఢిల్లీ – సోనిపట్ ఇన్నోవేషన్ ఫౌండేషన్'... ప్రతిష్ఠాత్మక 'ఇండియా మైనింగ్ వీక్-2027' సదస్సుకు జాతీయ స్టార్టప్ అవుట్‌రీచ్, ఎకోసిస్టమ్ భాగస్వామిగా వ్యవహరించనుంది. భారత ప్రభుత్వ బొగ్గు, గనుల మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో... ఎంజీఎంఐ, ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు 2027 ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా మైనింగ్, బొగ్గు, ఖనిజాలు, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న అంకురసంస్థలు, డీప్-టెక్ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలను ఈ వేదికపైకి తీసుకురావడానికి ఏఐసీ ఐఐటీ ఢిల్లీ దేశవ్యాప్త ప్రచారం నిర్వహిస్తుంది. ఏఐసీ ఐఐటీ ఢిల్లీ సీఈవో శ్రీ అలోక్ పాండే ఈ స్టార్టప్ అవుట్‌రీచ్ కార్యక్రమానికి జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా ప్రయోగశాలలు, ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేస్తూ... ప్రతిభ గల అంకురసంస్థలను గుర్తించడం సహా స్వదేశీ సాంకేతికత, పరిశ్రమ–అంకురసంస్థల భాగస్వామ్యాలు, పైలట్ ప్రాజెక్టులు, సాంకేతిక ధ్రువీకరణ, వాణిజ్యీకరణ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

స్టార్టప్ పెవిలియన్‌లో ఉచిత స్టాళ్లు

ఏఐసీ ఐఐటీ ఢిల్లీ ద్వారా దరఖాస్తు చేసుకొని ఎంపికైన అంకుర సంస్థల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'స్టార్టప్ పెవిలియన్'లో ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ఎగ్జిబిషన్ స్టాళ్లను కేటాయించనున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలు, ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలు, పరిశోధనాభివృద్ధి సంస్థలు, పెట్టుబడిదారులతో పాటు సదస్సులో పాల్గొనే వివిధ దేశాల పారిశ్రామిక ప్రతినిధుల ముందు తమ ఉత్పత్తులు, నమూనాలు, వినూత్న పరిష్కారాలను ప్రదర్శించడానికి ఈ పెవిలియన్ అంకురసంస్థలకు ఒక అద్భుత వేదికను అందిస్తుంది.

ఎనిమిది ప్రధాన రంగాలు

  • మైనింగ్ టెక్నాలజీ, స్మార్ట్ మైనింగ్

  • కీలక ఖనిజాలు, ఖనిజ అన్వేషణ

  • మైనింగ్ పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్

  • కృత్రిమ మేధ, రోబోటిక్స్, డిజిటల్ సాంకేతికతలు

  • గనుల భద్రత, రిస్క్ మేనేజ్‌మెంట్

  • సుస్థిరత, గ్రీన్ మైనింగ్

  • ఖనిజ శుద్ధి, అధునాతన మెటీరియల్స్

  • ఇతర మైనింగ్, అనుబంధ సాంకేతికతలు

మైనింగ్, పారిశ్రామిక రంగాల సవాళ్లకు అనుగుణంగా తమ సాంకేతికతలను మలుచుకోగల ఇతర రంగాల అంకురసంస్థలనూ దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐసీ ఐఐటీ ఢిల్లీ సీఈవో శ్రీ అలోక్ పాండే మాట్లాడుతూ... "డీప్-టెక్ ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక అభివృద్ధి కోసం భారత మైనింగ్, ఖనిజ రంగాలు అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, పరిశ్రమలు, పెట్టుబడి నెట్‌వర్క్‌లతో అర్థవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్న అంకురసంస్థలకు ఏఐసీ ఐఐటీ ఢిల్లీని ఒక వారధిగా మార్చాలనే లక్ష్యంతో మేం ముందుకుసాగుతున్నాం. తద్వారా స్వయం-సమృద్ధ భారత్, వికసిత్ భారత్-2047 వంటి బృహత్తర లక్ష్యాలకు మా వంతు సహకారం అందిస్తాం" అని పేర్కొన్నారు.

అర్హత ప్రమాణాలు

·         భారత్‌కు చెందిన అంకురసంస్థలు లేదా చట్టబద్ధంగా నమోదైన వ్యాపార సంస్థలు అయి ఉండాలి.

·         ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదై ఉండాలి.

·         డీపీఐఐటీ స్టార్టప్ గుర్తింపు ఉన్నవారికి ప్రాధాన్యం, అయితే ఇది తప్పనిసరి కాదు.

·         మైనింగ్, ఖనిజాలు లేదా అనుబంధ రంగాల కోసం వినూత్న ఉత్పత్తి, సాంకేతికత లేదా పరిష్కారాన్ని కలిగి ఉండాలి.

·         నమూనా, కనీస ఆచరణీయ ఉత్పత్తి, పైలట్ ప్రాజెక్ట్ లేదా వాణిజ్య వినియోగ దశలో ఉండాలి.

 దరఖాస్తు విధానం

ఇంక్యుబేషన్ సెంటర్లు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమ సంఘాలు ఈ అవకాశాన్ని తమ అంకురసంస్థల నెట్‌వర్క్‌లతో పంచుకోవాలని నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు.

·         దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబర్ 2026

·         స్టాల్ రుసుము: ఎంపికైన అంకుర సంస్థలకు ఎటువంటి రుసుము లేదు (ఉచితం)

 

·         దరఖాస్తు లింక్: https://forms.gle/hoRfFd3b7vCtJHSC8

·         వెబ్‌సైట్: https://www.indiaminingweek.org


(రిలీజ్ ఐడి: 2342256) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu