సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరవై ఒకటో వెనిస్ ఆర్ట్ బియనాలేలో ఉత్తమ జాతీయ భాగస్వామ్యానికి ఇచ్చే ‘విజిటర్స్ లయన్’ పురస్కారం భారత్ కైవసం


ప్రజల ఓట్ల ఆధారంగా భారత్ మండపానికి ‘ఉత్తమ జాతీయ భాగస్వామ్య పురస్కారం’ అందించిన లా బియనాలే డి వెనెజియా

బియనాలే పొడవునా భారత్ పెవిలియన్‌ను చూసిన సందర్శకులు సుమారు 4.5 లక్షల మంది..
ఎక్కువ మంది తిలకించిన జాతీయ మండపాల్లో భారత్ పెవిలియన్‌ ఒకటి

ఏడు సంవత్సరాల తరువాత వెనిస్‌‌లోకి భారత్ బృందం పునఃప్రవేశం.. జాతీయ మండపానికి అగ్ర సత్కారంతో ముగింపు

‘వికాస్ భీ, విరాసత్ భీ’.. 2026 డిసెంబర్ 4 నుంచి 2027 మార్చి నెల 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా బియనాలేకు శుభశకునం ఈ అవార్డు

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 9:05PM by PIB Hyderabad

 

‘వెనిస్ బియనాలే’ (బియనాలే ఆర్టే- 2026)లో భాగంగా ఏర్పాటు చేసిన 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అత్యుత్తమ దేశ భాగస్వామ్యానికి ఇచ్చే ‘‘విజిటర్స్ లయన్’’ పురస్కారాన్ని (విజిటర్స్ లయన్ ఫర్ బెస్ట్ నేషనల్ పార్టిసిపేషన్) భారతదేశం చేజిక్కించుకుంది. కళాప్రపంచంలో ఒలింపిక్స్ గా వెనిస్ బియనాలే ప్రసిద్ధిని పొందింది. లా బియనాలే డి వెనిజియా లో ప్రజల ఓట్ల ఆధారంగా విజిటర్స్ లయన్స్ పురస్కార విజేతలను ఇవాళ ప్రకటించారు.
ఈ ఫలితంపై లా బియనాలే డి వెనిజియా అధ్యక్షుడు శ్రీ పియెత్రాంగెలొ బుట్టఫూకొ మాట్లాడుతూ, సందర్శకులు ‘విజిటర్స్ అవార్డు’ను అందించి ‘ఒక పెయింటింగు.. దానిని ఎవరైనా చూసినప్పుడు మాత్రమే జీవం పోసుకుంటుంది’ అని పాబ్లో పికాసో చెప్పిన మాటలను నిజం చేశారన్నారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ స్పందిస్తూ, ఇది దేశ ప్రజలు ఎంతో సంతోషించే క్షణమన్నారు. ‘‘ఈ అంతర్జాతీయ గుర్తింపు భారతీయ కళాకారుల్లో కొత్త తరం కళాకారులకే కాక భారత సాధికార సమకాలీన కళా రంగానికి కూడా ఒక ప్రమాణంగా నిలుస్తుంది. ఇది భారత చిరకాలిక కళాత్మక సంప్రదాయాలను సమకాలిక అభివ్యక్తుల్లోకి ఎంత ప్రభావవంతంగా బదలాయించవచ్చో, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మనసులను ఎలా ఆకట్టుకోవచ్చో తెలియజేసే సందర్భం. భారతీయ కళాకారుల్లో భావి తరాలకు ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసంతో ప్రపంచంతో జతపడేందుకు స్ఫూర్తిని ఈ బహుమతి అందిస్తుంది’’ అని కూడా మంత్రి అన్నారు.
సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘వెనిస్ బియెనాలేలో ప్రతిష్ఠాత్మక ‘విజిటర్స్ లయన్’ పురస్కారం లభించడం భారతదేశానికి ఒక పెద్ద గౌరవం, జాతి గర్వించదగ్గ క్షణం. సాంస్కృతిక విలువలు, భౌతిక సంప్రదాయాలు పెనవేసుకున్న భారత సమకాలీన కళాత్మక అభివ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా చూపరుల మనసులో చెరగని ముద్రను వేస్తోంది. దీర్ఘ విరామం అనంతరం, వెనిస్ బియనాలేలో భారత్ పునఃప్రవేశం ప్రపంచ సాంస్కృతిక జగతితో మా నూతన అనుబంధంలో ఓ మేలు మలుపు. మండపాన్ని ప్రారంభించినప్పటి నుంచే ఇది ప్రపంచ కళా విమర్శకుల దృష్టిని తన వైపునకు తిప్పుకొంది. దీంతో దీనికి అసాధారణ సానుకూల సమీక్షలు, ఉత్సాహపూర్వక ప్రతిస్పందనలు లభించాయి. ప్రపంచం నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన వారితో పాటు కళా ప్రియుల మెప్పును కూడా ఇది పొందింది. ఈ గౌరవం భారత సాంస్కృతిక యాత్రలో ఓ ముఖ్య మజిలీ. మా వైవిధ్య, చైతన్యభరిత, నిరంతర వికాసాత్మక సృజనశీల అభివ్యక్తీకరణకు తోడయిన సార్వత్రిక సందర్భశుద్ధి, ఆకర్షణలను ఇది పునరుద్ఘాటిస్తున్నది’’ అన్నారు.
భారత్ మండపాన్ని గురించి
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (ఎన్ఎమ్ఏసీసీ), సెరెండిపిటీ ఆర్ట్‌స్ సహకారంతో భారత జాతీయ మండపాన్ని కొలువుదీర్చింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో భాగమైన జాతీయ ఆధునిక కళా ప్రదర్శన శాల (ఎన్‌జీఎమ్ఏ) ఈ మండపానికి కమిషనర్‌గా ఉంది. దీని కార్యాచరణలో భాగస్తురాలి భూమికను ఇందిరా గాంధీ జాతీయ కళా కేంద్రం (ఐజీఎన్‌సీఏ)  నిర్వర్తించింది. మండపానికి ‘‘దూరానికి సంబంధించిన భూగోళం: ఇంటిని జ్ఞాపకం చేసుకోవడం’’ (జియాగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్: రిమెంబరింగ్ హోమ్) అనే పేరును పెట్టారు. దీనిని వెనెజియాకు చెందిన ఆర్సెనాలేలోని చరిత్రాత్మక ఐసొలోటో పరిసరాల్లో ఏర్పాటు చేశారు. మండపాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యటన శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ 2026 మే నెల 6వ తేదీన ప్రారంభించారు.
ఎవరి జీవితం మార్పు లేదా దూరంతో ప్రభావితం అవుతుందో వారి దృష్టిలో ఇల్లు కేవలం ఒక నిర్ణీత స్థానం కాదని, దానిని వారు తమ వెంట తీసుకు తిరిగే స్థితిగా మారుతుందని ఈ ప్రదర్శన చాటిచెబుతుంది. ఈ దశ.. జ్ఞాపకాలు, భౌతిక వస్తువులు, ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత భ్రమల ఆకారాన్ని సంతరించుకుంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, సామగ్రులు, హస్తకళా సంప్రదాయాల ద్వారా ద్వివార్షిక ప్రదర్శన వస్తువైన ‘ఇన్ మైన్ కీస్’ను ఆవిష్కరిస్తుంది ఈ ప్రదర్శన. దీనిని ప్రారంభించినప్పుడు శ్రీ షెఖావత్ మాట్లాడుతూ , ఈ ప్రదర్శన సమకాలీన భారతదేశానికి అద్దం పడుతుందని, సమకాలీన భారత్ తన మూలాలతో అంటు కట్టుకుందని, అదే సమయంలో అది భవిష్యత్తు దిశగానూ పయనిస్తోందన్నారు.

 

కళాకారుల పేరు

కళాకృతి

వివరణ

అల్‌వర్ బాలసుబ్రమణ్యమ్ (బాల)

కేవలం మన కోసం కాదు

తమిళనాడులోని పల్లె ప్రాంతాల మట్టి, ప్రాకృతిక బంకమన్నుతో నిర్మించిన శిల్ప ఫలకాల సమాహారం. ఈ కళారూపాల్లో ప్రాకృతిక బీటలు, చీలికలు అగుపిస్తాయి. ఇవి కాలం గడచిపోవడాన్ని, పర్యావరణ శక్తుల ప్రభావాన్ని సూచిస్తాయి. భూమి, స్మృతి, పరివర్తనల అంతస్సంబంధాలను ఈ కళాకృతులు అన్వేషిస్తాయి.

రంజని శెట్టార్

ఇదే ఆకాశం దిగువన

పూలు, ప్రాకృతిక వికాసం నుంచి ప్రేరణను పొంది, ఒక ఉత్కృష్ట పద్ధతిలో నిర్మించిన వేలాడే శిల్పాకృతి నిర్మాణమిది. సాంప్రదాయిక శిల్ప రీతులను ఉపయోగించి దీనిని దిద్దితీర్చిన తీరు, దీని జైవిక రూపంలో ఒక చిన్న తోటను గుర్తుకు తెస్తుంది. అంతేకాక ప్రకృతి, శిల్పం, ఇంటి ఆలోచనలను కూడా ఇది తనలో ఇముడ్చుకుంది.

సుమాక్షి సింగ్

శాశ్వత చిరునామా

న్యూఢిల్లీలో కళాకారిణికి చెందిన శిథిలమైన కౌటుంబిక నివాసాన్ని పోలివున్న నిలువెత్తు నమూనా ఇది. దీనిని అత్యంత సున్నిత బుటేదారు పనితనంతో తయారు చేశారు. ఇది చూపరుల కళ్లను తన వైపునకు లాగేసుకుంటుంది. ఈ కళారూపం.. జ్ఞాపకం, ఇల్లు, ఆత్మీయ భావనల వంటి విషయాలను తట్టిలేపుతుంది. ఇంటికి సంబంధించిన ఆలోచనలను ఒక శాశ్వత భావనామయ, సాంస్కృతిక అనుభూతిగా మార్చివేస్తుంది.

సక్రమ సోనమ్ తాశీ

గృహ ప్రతిధ్వనులు

కాగితం గుజ్జును ఉపయోగించి తీర్చిన ఈ కళారూపం లద్దాఖ్ సాంప్రదాయిక వాస్తుకళకు తోడు ప్రాకృతిక వాతావరణాన్ని కూడా కట్టెదుట నిలుపుతుంది. ఈ కళాకృతి.. మారుతున్న పర్యావరణ పరిస్థితులను, ఆధునిక నిర్మాణం సమక్షంలో నిలిపి సాంప్రదాయిక భవన నిర్మాణ రీతుల భేద్యతను, అసురక్షను వెలికితీస్తుంది. స్థిరత్వం, సాంస్కృతిక నిరంతరత్వాల గురించిన ప్రశ్నలను అడుగుతుంది.

అసీమ్ వకీఫ్

చాల్

భారతదేశంలో నగర ప్రాంతాల్లో తరచు కానవచ్చే వెదురు రూపాల నిర్మాణ శైలితో స్ఫూర్తిని పొందిన విశాల కళాకృతి ఇది. సాంప్రదాయక నిర్మాణ పద్ధతుల్లో లోతుగా ఇమిడ్చిన సామగ్రిని కలిగి ఉన్న ఈ కళారూపం నగరంలో చోటు చేసుకున్న మార్పులను, పునరుద్ధరణ ప్రక్రియను వెదకుతుంది.


దృశ్య కళను ప్రదర్శించడంతో పాటు, భారతీయ పెవిలియన్‌లో సెరెండిపిటీ ఆర్ట్‌స్ ఏర్పాటు చేసిన మరో విస్త‌ృత ప్రదర్శనా కార్యక్రమం కూడా చోటుచేసుకుంది. ఇది 2026 మే మొదలు నవంబర్ వరకు వెనిస్ లోని మండపంలో, సాంస్కృతిక స్థలాల్లో సంగీతం, నృత్యం, కథ చెప్పే, వివిధ కళల సమాహారంపై ఆధారపడిన ప్రదర్శనల కూడలిగా మారిపోయింది.
వెనిస్‌లో పర్యటకులకు బాగా నచ్చిన స్థానం
రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే ఈ ప్రదర్శనలో, భారతీయ మండపాన్ని సుమారు 45 లక్షల మంది చూశారు. దీంతో ఇది ఈ సంచికలో మిగతా అన్నిటి కన్న ఎక్కువ మందిని ఆకట్టుకున్న జాతీయ పెవిలియన్లలో ఒకటిగా నిలిచింది. ఆగంతుకులలో కళాజగతికి చెందిన ప్రముఖులు, మ్యూజియాల పరిరక్షకులు, కళారూపాలను సేకరించే అలవాటు ఉన్న వారు, విమర్శకులే కాక సంస్కృతి, ప్రజాజీవన రంగాల్లోని లబ్ధప్రతిష్ఠులూ ఉన్నారు.
ప్రదర్శనకు తోడు, సెరెండిపిటీ ఆర్ట్‌స్ 2026 మే మొదలు నవంబర్ వరకు వెనిస్ లోని వివిధ ప్రదేశాల్లో ప్రదర్శనలను, కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దృశ్య, ప్రదర్శన కళల సమ్మేళనాన్ని ఆవిష్కరించారు. దీనిలో భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు, ద్వివార్షిక ప్రదర్శన ఇతివృత్తంపై ఆధారపడిన విభిన్న కళల సమామారం ద్వారా ఆర్సెనాలే పరిమితులకు అతీతంగా, పెవిలియన్‌కు సంబంధించిన ఆలోచనలను పూర్తి నగర సందర్శకుల చెంతకు తీసుకుపోయారు.
ఒక అద్భుత పునరాగమనం.. ముందున్న మార్గం
భారత్ ఏడు సంవత్సరాల విరామానంతరం, 2026లో వెనిస్ కళా ద్వివార్షిక కార్యక్రమంలో పాల్గొన్నది. పునరాగమన వేళ జాతీయ మండపానికి అత్యున్నత గౌరవం లభించడం దీని అసాధారణ పునరాగమనానికి నిదర్శనం. ఇది ప్రపంచ సమకాలీన కళా, సాంస్కృతిక దౌత్య రంగంలో భారతదేశానికి ప్రాముఖ్యం పెరుగుతున్న తీరును ప్రతిబింబిస్తోంది.
ఇదే జోరును కొనసాగిస్తూ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2026 డిసెంబర్ 4 నుంచి న్యూఢిల్లీలో 108 రోజుల పాటు ఇండియా బియనాలేను నిర్వహించనుంది. ‘పురానా కిలా’ (పాత కోట) దీని ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోంది. కార్యక్రమాన్ని ఎర్ర కోట, కుతుబ్ మీనార్, జంతర్ మంతర్, సఫ్‌దర్ జంగ్ గోరీ, అగ్రసేన్ కీ బావ్‌డీతో పాటు నగరంలోని ఇతర సాంస్కృతిక వారసత్వ కట్టడాల్లో నిర్వహించనున్నారు. భారత చరిత్రాత్మక స్మారకాల్లో సమకాలీన కళ, వాస్తుకళ, డిజైన్లను ఇండియా బియనాలేలో ప్రదర్శిస్తారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఒక స్ట్యూడెంట్స్ బియనాలేను కూడా ఏర్పాటు చేస్తారు.  
ఇండియా బియనాలేను ఒక అద్వితీయమైన ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాలను, అవసరమైన సౌకర్యాలను సమకూర్చడంతో పాటు నిర్వహణ వేదికల వరకు చేరుకొనేందుకు   తగిన ఏర్పాట్లు చేస్తుంది.   ప్రదర్శనను సిద్ధం చేసే పనిని ప్రయివేటు భాగస్వాములు చేపడతారు. ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా) భావనతో స్ఫూర్తిని పొందిన ఈ కార్యక్రమ నిర్వహణ భారతీయ, అంతర్జాతీయ సందర్శకులకు ఒక అద్వితీయ బియనాలే పాస్ మాధ్యమం ద్వారా దేశ చైతన్యభరిత వారసత్వంతో పాటు సృజనాత్మక ఉత్సవంలో పాలుపంచుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
 
***

(రిలీజ్ ఐడి: 2341973) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी