ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

55వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన పీఎం


రోడ్డు, విద్యుత్తు, బొగ్గు, రైల్వే రంగాల్లో రూ.78,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సమీక్షించిన ప్రధాని

నిర్మాణ నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను పాటించాలని, సకాలంలో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన ప్రధాని
పీఎం–సేతు అమలుతో సహా ఐటీఐ వ్యవస్థ సమీక్షించిన పీఎం

పీఎస్‌యూ–ఐటీఐల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని, పారిశ్రామిక క్లస్టర్లు, ఆయా రంగాల అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొందించాలని సూచించిన పీఎం

శిక్షణను ఉపాధితో అనుసంధానించేందుకు క్లాస్‌రూమ్–కంపెనీ–కెరీర్ అనే 3సీ విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేసిన ప్రధాని

ఐటీఐలకు, స్థానిక యజమానులకు మధ్య బలమైన సంబంధాలతో స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరించవచ్చన్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 9:07PM by PIB Hyderabad

క్రియాశీలక పాలన, సకాలంలో అమలును ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐసీటీ ఆధారిత, బహుళ-విధాన వేదిక అయిన ప్రగతి 55వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సేవా తీర్థలో అధ్యక్షత వహించారు. అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల పంపిణీని మెరుగుపరచడానికి ఈ వేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏకతాటిపైకి తెస్తుంది.

ఈ సమావేశంలో, ప్రధానమంత్రి రోడ్డు, విద్యుత్తు, బొగ్గు, రైల్వే రంగాల్లో రూ.78,000 కోట్లకు పైగా వ్యయంతో కూడిన అయిదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన పరివర్తన (పీఎం–సేతు) అమలుతో సహా పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ) వ్యవస్థను కూడా సమీక్షించారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం కారణంగా వ్యయం పెరగడం మాత్రమే కాకుండా... పౌరులు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పెండింగులో ఉన్న సమస్యలను పూర్తి బాధ్యతతో, వాస్తవ కాలపరిమితులతో సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. సకాలంలో పనులు పూర్తి చేయడంతో పాటు, నిర్మాణ నాణ్యతలో ఉన్నత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రాజెక్టును ప్రధానమంత్రి సమీక్షించారు. దీనిని వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. వ్యయం కంటే ఫలితాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని పీఎం పునరుద్ఘాటించారు. బొగ్గు ప్రాజెక్టును కూడా ఆయన సమీక్షించారు. ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా అమలు చేయడంతో పాటు పునరావాసాన్ని, తిరిగి నిలదొక్కుకొనేలా సహకారాన్ని సకాలంలో, గౌరవప్రదంగా అందించాలని ప్రధాని సూచించారు.

వికేంద్రీకృత సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టుల కోసం వినూత్న విధానాలను అన్వేషించాలని విద్యుత్తు ప్రాజెక్టును సమీక్షిస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి సూచించారు. స్థానికంగా లభించే వనరులు, గిరాకీని పరిగణించి వినియోగ కేంద్రాలకు సాధ్యమైనంత సమీపంలో ఇలాంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. విశ్వసనీయమైన, తక్కువ ధరలకే లభించే విద్యుత్తును అందించడం, పంపిణీ మౌలిక వసతులపై ఒత్తిడిని తగ్గించడమే ఈ ప్రయత్నాల లక్ష్యంగా ఉండాలని తెలియజేశారు.

ఐటీఐ వ్యవస్థను, పీఎం–సేతు అమలును పీఎం సమీక్షించారు. ఐటీఐలను బలోపేతం చేయడంలోనూ, పీఎం–సేతు పరిధిలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలోనూ కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రులకు, ప్రధాన కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ఐటీఐలతో పరిశ్రమలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, వాటి ఉన్నతీకరణకు తోడ్పడటానికి, ప్రస్తుతమున్న, భవిష్యత్తు అవసరాలకు తగినవిధంగా మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఇదే సరైన సమయమని తెలియజేశారు. యువతకు మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ భాగస్వామ్యాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాలు, ఐటీఐలు, పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని ఆయన సూచించారు.

భవిష్యత్తు మానవ వనరుల అవసరాలను ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) అంచనా వేసుకోవాలని, సంబంధిత విభాగాల్లో శిక్షణ, నియామకాల కోసం ఐటీఐలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ప్రయోగాత్మక శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌లకు తోడ్పాటు ఇవ్వాలని, శిక్షణ పొందిన ఐటీఐ గ్రాడ్యుయేట్ల నియామకాలపై మరింత దృష్టి సారించాలని పీఎస్‌యూలకు చెప్పారు. ఈ తరహా భాగస్వామ్యం... విద్యార్థులకు పారిశ్రామిక అనుభవాన్ని అందిస్తుందని, తమ కార్యాచరణ అవసరాలకు తగిన నైపుణ్యం గల మానవ వనరులను పీఎస్‌యూలకు సులభంగా లభించేలా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

పారిశ్రామిక క్లస్టర్లు, ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు, రాబోయే పెట్టుబడులకు అనుగుణంగా ఐటీఐ విభాగాలు, పాఠ్యప్రణాళికలు, శిక్షణా సామర్థ్యాన్ని రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

స్థానిక అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా సొంత ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి అన్నారు. ఐటీఐలు, స్థానిక యాజమాన్యాల మధ్య బలమైన అనుసంధానం ఉంటే ఇంటికి చేరువలోనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. దీని వల్ల ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గడమే కాకుండా, యువత తమ ప్రాంతాల్లోనే ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి వీలు కలుగుతుందని ప్రధాని వివరించారు.

ప్రధానమంత్రి ఐటీఐ విద్యకు ‘క్లాస్‌రూమ్–కంపెనీ–కెరీర్’ (3సీ) విధానాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను పరిశ్రమలో ఆచరణాత్మక అనుభవంతో అనుసంధానించి, తద్వారా ఉపాధికి, వృత్తిపరమైన పురోగతికి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని, వాస్తవ పని పరిస్థితులపై అవగాహనను, శిక్షణ నుంచి ఉపాధికి స్పష్టమైన మార్గాన్ని అందించడానికి ఐటీఐలు, పరిశ్రమలు కలిసి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2341744) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil