నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 6:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ విమానయాన నిర్వహణ-మరమ్మతు-నిశిత తనిఖీ (ఎంఆర్‌ఓ) రంగంపై సింగపూర్‌తో అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య ఈ రంగంలో ‘నైపుణ్యాభివృద్ధి సహా పరిశ్రమ అభివృద్ధిలో సహకారం’ మరింత విస్తృతమవుతుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ నిర్ణయంపై హర్షం ప్రకటించారు. ఈ మేరకు “భారత్-సింగపూర్ మధ్య ఈ అవగాహన ఒప్పందం ఎంతో ప్రభావశీలమైనదేగాక గౌరవనీయ ప్రధానమంత్రి స్వయంసమృద్ధ భారత్ దృక్కోణానికి అనువైనది” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ల్యాండింగ్ గేర్, రాడోమ్, ఇంజన్లు, కాక్‌పిట్ డిస్‌ప్లే, సీట్లు, రెక్కలు, అత్యంత సూక్ష్మ పరికరాలు సహా విమానంలోని ప్రతి విడిభాగానికీ దేశీయంగానే మరమ్మతు సాగాలన్నది మా ఆకాంక్ష. అలాగే, భారత్‌ను ప్రాంతీయ విమానయాన వర్క్‌షాప్‌గా నిలపడం కూడా ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం” అని ఆయన చెప్పారు.
భారత్-సింగపూర్ భాగస్వామ్య సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “సింగపూర్‌లో విమానయాన ‘ఎంఆర్‌ఓ’ వ్యవస్థ సుస్థిరంగా ఉంది. మరోవైపు శరవేగంగా పురోగమిస్తున్న విమానయాన మార్కెట్లలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన విమానాల సముదాయం విస్తురిస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ విమానయాన కూడలిగా మన దేశం వ్యూహాత్మక భౌగోళిక స్థానంలో ఉంది. దీంతోపాటు వాణిజ్య సౌలభ్యం మెరుగుదలకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందువల్ల ఎంఆర్‌ఓ రంగం ప్రగతికి భారత్‌లో అవకాశాలు గణనీయంగా ఉంటాయి” అని వివరించారు.
విజ్ఞాన ఆదానప్రదానం, పారిశ్రామిక అనుభవం ద్వారా భారతీయ శిక్షణ సంస్థలు తమ పాఠ్యప్రణాళికను, శిక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ప్రతిపాదిత ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఇందులో పరిశ్రమల భాగస్వామ్యం పెంపు ద్వారా దేశీయ ‘ఎంఆర్‌ఓ’ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా కాలక్రమంలో విదేశీ నిర్వహణ సేవలపై భారత్ పరాధీనత తగ్గుతుందని అంచనా.
ఈ అవగాహన ఒప్పందంతో రెండు దేశాల మధ్య విజ్ఞానం, నైపుణ్యం, ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానానికి సౌలభ్యం కల్పించే చట్రాన్ని ఏర్పరుస్తుంది.
అవగాహన ఒప్పందంలోని కీలకాంశాలు:
- ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (ఏఎంఈ) శిక్షణ కోసం పరిశ్రమల అవసరాలకు తగినట్లు పాఠ్యప్రణాళికకు సంయుక్త రూపకల్పన.
- నాణ్యమైన పాఠ్యప్రణాళిక రూపకల్పన, భారతీయ సంస్థల నైపుణ్యం పంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచడం.
- భారతీయ విద్యార్థులు ఆచరణాత్మక పారిశ్రామిక అనుభవం సముపార్జించేందుకు వీలుగా సింగపూర్ ‘ఎంఆర్‌ఓ’ సంస్థలతో ఇంటర్న్‌షిప్ సహా ఆదానప్రదాన కార్యక్రమాల నిర్వహణ.
· ‘ఎంఆర్‌ఓ’ సౌకర్యాల విస్తరణకు మద్దతుగా భారత, సింగపూర్ పరిశ్రమ భాగస్వాముల మధ్య భాగస్వామ్య సౌలభ్య కల్పన.
భారత ‘ఎంఆర్‌ఓ’ రంగం అవసరాలపై శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ- “విమానయాన సంస్థలు తమ విమాన సముదాయాన్ని నిరంతరం విస్తరిస్తున్నాయి. దీంతో విమాన రాకపోకలలో భారత్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోంది. దీనివల్ల దేశీయ ‘ఎంఆర్‌ఓ’ సామర్థ్యాలకు, నిపుణులైన విమాన నిర్వహణ ఇంజనీర్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ ‘ఎంఆర్‌ఓ’ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యావశ్యకం. విదేశీ నిర్వహణ సేవలపై పరాధీనత ఫలితంగా మన విమానయాన సంస్థలకు వ్యయం పెరిగిపోవడమే కాకుండా విమానాలను ఎక్కువ కాలం నిలిపివేయాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల నడుమ కుదిరిన ఈ వ్యూహాత్మక అవగాహన ఒప్పందంతో నిపుణులైన ‘ఏఎంఈ’లు, అత్యాధునిక ‘ఎంఆర్‌ఓ’ సౌకర్యాలకు దేశీయంగా పెరిగే అవసరాలు తీర్చడానికి మనకు వీలు కలుగుతుంది. ప్రపంచ విమానయాన నైపుణ్య శిక్షణ కూడలిగా భారత్‌ను రూపొందించడంలో, అలాగే ప్రపంచ విమానయాన సంస్థలకు ‘ఎంఆర్‌ఓ’ గమ్యస్థానంగా నిలపడంలో ఇదొక మలుపు కాగలదు” అని పేర్కొన్నారు.
దేశీయ విమానయాన వ్యవస్థ బలోపేతం, నిపుణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విమానయాన ‘ఎంఆర్‌ఓ’ రంగంలో స్వయంసమృధ్ధ భారత్ దార్శనికత సాకారం దిశగా భారత్-సింగపూర్‌ల మధ్య ఈ అవగాహన ఒప్పందం ఓ కీలక ఘట్టం.
***