నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2026 3:32PM by PIB Hyderabad
తపాలా శాఖ ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఎస్టేట్స్ మేనేజ్మెంట్ స్కీమ్’ (ఆస్తుల నిర్వహణ పథకం) కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో భాగంగా 2026 - 27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030 - 31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.1,491 కోట్ల నిధులను కేటాయించారు.
వ్యూహాత్మక లక్ష్యం
తపాలా శాఖకు చెందిన భవనాలు, స్థిరాస్తుల మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఆధునికీకరించి, మార్పు తీసుకురావడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా తపాలా కార్యాలయాలు, ఉద్యోగుల నివాస కాలనీల నిర్మాణం, పునర్నిర్మాణం, ఆధునికీకరణ, ఏకరీతి డిజైన్, బ్రాండింగ్‌తో పాటు భారతదేశ చారిత్రక తపాలా భవనాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఆధునికీకరణ వ్యూహం ద్వారా తపాలా సేవల తొలి దశ పంపిణీ వ్యవస్థకు మద్దతు లభించడంతో పాటు ఆర్థిక సేవలను మరింత విస్తృత ప్రజానీకానికి చేరువ చేయడం, దేశవ్యాప్తంగా పౌరుల అవసరాలకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాలు ‘డిజిటల్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ వంటి విస్తృత జాతీయ దార్శనికతలకు అనుగుణంగా ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్‌లలో ఒకటైన భారత తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 1.65 లక్షల తపాలా కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 1,49,385 గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఉత్తరాల పంపిణీ, బ్యాంకింగ్ సేవలు (పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్–పీఓఎస్‌బీ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ - ఐపీపీబీ), బీమా సేవలు (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ - పీఎల్ఐ), ఆధార్ సేవలు, పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, ‘డాక్ఘర్ నిర్యాత్ కేంద్రాల’ (డీఎన్‌కే) ద్వారా గ్రామీణ కళాకారులకు సహాయ సహకారాలు అందించడం వంటి అనేక కీలక సేవలను భారత తపాలా శాఖ అందిస్తోంది.
అమలు కాలపరిమితి
2026 - 27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030 - 31 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల వ్యవధిలో ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయనున్నారు.
ఆమోదించిన పథకంలోని ముఖ్యమైన అంశాలు:
-
కొత్త భవనాల నిర్మాణం (రూ.280 కోట్లు): ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న తపాలా కార్యాలయాల స్థానంలో శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో 190 కొత్త తపాలా భవనాలను నిర్మించనున్నారు. తద్వారా అద్దె భారం తొలగించడమే లక్ష్యం.
-
పునర్నిర్మాణం (రూ.108 కోట్లు): శిథిలావస్థకు చేరిన శాఖకు చెందిన 50 తపాలా భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. తద్వారా దీర్ఘకాలికంగా భవనాల పటిష్టత, భద్రతను నిర్ధారించనున్నారు.
-
ఆధునికీకరణ, బ్రాండింగ్ (రూ.318 కోట్లు): ఎస్పీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా 2,550 శాఖాపరమైన సబ్ పోస్టాఫీసులను ఆధునికీకరించి, అన్నింటికీ ఒకే విధమైన బ్రాండింగ్‌ను అమలు చేయనున్నారు.
-
అద్దె భవనాల్లోని తపాలా కార్యాలయాల ఆధునికీకరణ (రూ.37.50 కోట్లు): అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 2,500 తపాలా కార్యాలయాలను ఆధునికీకరించి, అన్నింటికీ ఏకరీతి బ్రాండింగ్ కల్పించనున్నారు.
-
వారసత్వ భవనాల పరిరక్షణ (రూ.180 కోట్లు): తపాలా శాఖ చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు విశిష్ట గుర్తింపు కలిగిన 20 చారిత్రక తపాలా భవనాలకు పునరుద్ధరణ పనులు చేపట్టి, వాటిని పరిరక్షించనున్నారు.
-
నివాస కాలనీల ఆధునికీకరణ (రూ.357.50 కోట్లు): ఉద్యోగుల సంక్షేమం, సంతృప్తి పెంపొందించే లక్ష్యంతో అధిక డిమాండ్ ఉన్న 150 తపాలా ఉద్యోగుల నివాస కాలనీలను సమగ్రంగా ఆధునికీకరించనున్నారు.
-
అనుబంధ, సమ్మిళిత సదుపాయాలు (రూ.100 కోట్లు): సుస్థిర అభివృద్ధిలో భాగంగా సౌర విద్యుత్ వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ‘సుగమ్య భారత్ అభియాన్’ కింద ర్యాంపులు, బ్రెయిలీ సూచికల వంటి అందరికీ అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మరుగుదొడ్లు, శిశువులకు పాలిచ్చే గదులు వంటి అదనపు సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
-
సమీకృత సాంకేతికత కేంద్రం (రూ.100 కోట్లు): అధునాతన తపాలా సాంకేతికత (ఏపీటీ) సేవలను వేగవంతం చేయడానికి, స్వదేశీ ఓపెన్ సోర్స్ టెక్ స్టాక్‌కు అండగా నిలవడానికి బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సెప్ట్) కోసం శాశ్వత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు.
***