కొద్ది నెలల కిందట, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడు... ఆయన దూరదృష్టి, స్పష్టమైన ఆలోచనా విధానం సుస్పష్టమయ్యాయి. ఈ రోజు, గత కొద్ది గంటలుగా మా మధ్య జరిగిన చర్చల్లో నేపాల్ భవిష్యత్తు పట్ల, భారత్-నేపాల్ సంబంధాల పట్ల ఆయనకున్న స్పష్టమైన దృక్పథాన్ని, అచంచలమైన నిబద్ధతనూ నేను ప్రత్యక్షంగా గమనించాను.
ఈ ఏడాది నేపాల్ ప్రజలు ఆయనను గెలిపిస్తూ అందించిన చరిత్రాత్మక తీర్పు... ఆ దేశ యువతరం ఆకాంక్షలు, ఆశలకు అద్దం పడుతోంది.
శక్తిమంతమైన, సుసంపన్న దేశంగా ఎదిగే దిశగా నేపాల్ సాగిస్తున్న ప్రయాణంలో భారత్ ఎల్లప్పుడూ నిబద్ధత కలిగిన భాగస్వామిగా ఉంది. ఇదే స్ఫూర్తితో, ఈ ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మేం ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
మిత్రులారా,
భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధం కేవలం పొరుగు దేశాల మధ్య ఉండే సాధారణ సంబంధం మాత్రమే కాదు. అది లోతైన ఆత్మీయత, చెక్కుచెదరని విశ్వాసంతో ముడిపడి ఉంది. మావి ఉమ్మడి సంతోషాలు... ఉమ్మడి సవాళ్లు. ఒకరి ప్రగతిలో మరొకరం భాగస్వాములుగా ఉంటూ... కష్టకాలంలో ఒకరికొకరం అండగా నిలుస్తాం.
ఆగస్టులో నేపాల్‌ను అతలాకుతలం చేసిన భీకరమైన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మేం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నేపాల్ పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడేందుకు రూ. 24,000 కోట్ల నేపాలీ రూపాయల విలువైన అభివృద్ధి సహకార ప్యాకేజీనీ మేం ఈ రోజు ప్రకటిస్తున్నాం.
బాధిత కుటుంబాల జీవితాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా చూడటం, వారి కోసం కొత్త అవకాశాలను సృష్టించడం, భవిష్యత్తులో ఎదురయ్యే విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా నేపాల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే మా సంకల్పం.
మిత్రులారా,
భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధం ఉమ్మడి చరిత్ర, విశ్వాసం, సంస్కృతి, ప్రజల మధ్య గాఢమైన అనుబంధాలనే దారాలతో పెనవేసుకుపోయి ఉంది. శ్రీరాముడు, సీతామాత మన ఉమ్మడి నాగరికతకు, విశ్వాసానికి శాశ్వత ప్రతీకలు.
2018లో జనక్‌పూర్ పవిత్ర భూమిపై నేను ఇలా అన్నాను... “నేపాల్ లేకుండా మన తీర్థయాత్రలు అసంపూర్ణం. నేపాల్ లేకుండా మన శ్రీరాముడూ అసంపూర్ణమే.”
2024లో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ చరిత్రాత్మక ఘట్టం మన ఉమ్మడి విశ్వాసంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి, బాలరాముడి ఆశీస్సులు పొందేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. ఒక్క 2025 సంవత్సరంలోనే, భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 30 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నారు.
ఈ రోజు ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’ రైలు సేవలను ప్రారంభించడం ద్వారా, ఈ పవిత్ర బంధానికి మేం ఒక కొత్త కోణాన్ని జోడిస్తున్నాం. దీనివల్ల అయోధ్యను సందర్శించే భక్తులు జనక్‌పూర్‌కు సులభంగా ప్రయాణించి, సీతామాత ఆశీస్సులూ పొందేందుకు వీలు కలుగుతుంది.
లుంబిని, బోధ్ గయ సహా ఇరు దేశాల్లోని పవిత్ర బౌద్ధ క్షేత్రాలతో పాటు... శివశక్తితో, బుద్ధుడితో ముడిపడి ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంపొందించేందుకూ మేం కలిసి పనిచేస్తాం.
మిత్రులారా,
ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ధార్చులా రహదారి వంతెనను మేం ఈరోజు ప్రారంభించాం. బన్బసా వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్మాణానికీ శంకుస్థాపన చేశాం. నేపాల్ భూభాగంలోని దోధారా-చాందిని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అభివృద్ధి పనులనూ మేం వేగవంతం చేస్తాం. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య వాణిజ్యాన్ని, ప్రజల రాకపోకలను మరింత సులభతరం చేస్తాయి.
బీహార్, ఉత్తరప్రదేశ్, ఇతర భారతీయ రాష్ట్రాల నుంచి నేపాల్ వెళ్లడానికి రూపొందించిన రహదారి, రైలు, సరిహద్దు అనుసంధాన ప్రాజెక్టులను మేం మరింత వేగవంతం చేస్తాం. నేపాల్ రవాణా వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు కాండ్లా, పారాదీప్ ఓడరేవుల వినియోగానికి అనుమతి కల్పిస్తాం. మెరుగైన వాణిజ్యం, అనుసంధానం, పెట్టుబడుల దిశగా మేం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ నేపాల్ ఆర్థికాభివృద్ధికి సరికొత్త ఊపునిస్తాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
నేపాల్ నదుల్లో పరిశుద్ధ ఇంధన ఉత్పత్తికి అపారమైన సామర్థ్యం అందుబాటులో ఉంది. భారత్‌లోని విశాలమైన ఇంధన మార్కెట్ ఈ సామర్థ్యాన్ని నేపాల్ ఆర్థిక శ్రేయస్సుకు బలమైన పునాదిగా మార్చగలదు.
అరుణ్-3 ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం పట్ల మా నిబద్ధతతో పాటు, ఈ రోజు లోయర్ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఈ దృక్పథంలో ఒక అంతర్భాగం.
మిత్రులారా,
గత అనేక సంవత్సరాలుగా నేపాల్‌కు పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంది. మా 'పొరుగువారికే తొలి ప్రాధాన్యం' విధాన స్ఫూర్తికి అనుగుణంగా... ఈ ఏడాది చమురు సరఫరాకు సంబంధించి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ, నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల నిరంతరాయ సరఫరానూ మేం నిర్ధారించాం.
ఈ రోజు మోతీహారీ–అమ్లేఖ్‌గంజ్ పైప్‌లైన్ రెండో దశ ప్రారంభోత్సవం... ఝాపా పెట్రోలియం టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.
మిత్రులారా,
నేపాల్ యువతరం అపారమైన ప్రతిభ, ఉత్సాహం, ఉన్నతమైన ఆకాంక్షలతో ఉరకలెత్తుతోంది. వారి కలలను సాకారం చేయడంలో నిబద్ధత కలిగిన భాగస్వామిగా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోంది.
ఈ నిబద్ధతను ఆచరణలో పెట్టేందుకు నేపాల్‌లో ఒక 'స్టార్టప్ ఇంక్యుబేటర్', ఒక 'ఇన్నోవేషన్ హబ్' సహా 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (ఐఐటీ) ఆఫ్‌షోర్ క్యాంపస్‌నూ మేం ఏర్పాటు చేస్తాం.
న్యాయ, సాంకేతిక రంగాల్లో భారత్‌లో చదువుకునే నేపాల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలనూ మేం మరింత విస్తరిస్తాం. ఆహార శుద్ధి, వ్యాల్యూ అడిషన్‌లను ప్రోత్సహించేందుకు నేపాల్‌లో ఒక 'ఆగ్రో-ఇండస్ట్రియల్ పార్క్' అభివృద్ధికీ మేం సహకరిస్తాం.
మిత్రులారా,
చలనచిత్రాలు, ఆధునిక సాంకేతికత ద్వారా రామాయణ గాథ నేటి యువతరానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువవుతోంది. భారత్-నేపాల్ దేశాలకు చెందిన యువ సృజనకారులు కలిసి పనిచేస్తూ... కొత్త, వినూత్న మాధ్యమాల ద్వారా మన ఉమ్మడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఈ దిశగా, తదుపరి 'వేవ్స్' సదస్సులో నేపాల్ నుంచి భారీ ప్రతినిధి బృందానికి మేం స్వాగతం పలుకుతాం.
నేపాల్‌లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, క్రీడాకారుల శిక్షణలో ముఖ్యంగా క్రికెట్ రంగంలో మా సహకారాన్ని మరింత పెంచుతాం.
గౌరవనీయులారా,
మన ఉమ్మడి భవిష్యత్తు కోసం కొత్త దిశను నిర్దేశించేందుకు మేం ఈ రోజు ఒక 'జాయింట్ విజన్ డాక్యుమెంట్' ను ఆవిష్కరిస్తున్నాం. ‘వికసిత్ భారత్... సమున్నత నేపాల్’ అనే మన ఉమ్మడి ఆకాంక్షలను కలిసికట్టుగా సాకారం చేసుకునేందుకు ఇది ఒక చక్కని కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తుంది.
మనకు స్పష్టమైన లక్ష్యాలు, పరస్పర విశ్వాసం, వాటిని సాకారం చేసుకునే సామర్థ్యం ఉన్నాయి. ముఖ్యంగా... సీతామాత, శ్రీరాముడు, గౌతమ బుద్ధుడి ఆశీస్సులూ మనకు తోడుగా ఉన్నాయి.
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ... మన ఉమ్మడి దార్శనికతను స్పష్టమైన విజయాలుగా మలుస్తూ, ఇరు దేశాలూ ఐక్యంగా భారత్-నేపాల్ సంబంధాల్లో నూతన సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
భారత్–నేపాల్ స్నేహం వర్ధిల్లాలి!
చాలా ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
***