నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2026 10:03PM by PIB Hyderabad
త్రిపురలోని అగర్తలాలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) మరో కీలక ఆపరేషన్ నిర్వహించి, 8 కిలోల మెథాంఫెటమిన్ మాత్రలను (యాబా) స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఒక మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడిని అరెస్టు చేసింది. 2026 నవంబర్ 17న డీఆర్ఐ చేపట్టిన ఈ ఆపరేషన్, ఈశాన్య ప్రాంతంలో సింథటిక్ మాదకద్రవ్యాల సీమాంతర అక్రమ రవాణాను అరికట్టేందుకు డీఆర్ఐ నిరంతరం చేస్తున్న కృషిలో మరో కీలక ముందడుగుగా నిలిచింది.
మాదకద్రవ్యాల నిల్వలను తరలిస్తున్నట్లు అందిన కచ్చితమైన నిఘా సమాచారంతో డీఆర్ఐ అధికారులు అనుమానిత వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమానాస్పదంగా కనిపించిన తెల్లటి మారుతి సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కారును ఆపాలని అధికారులు సంకేతం ఇవ్వగా, డ్రైవర్ వేగంగా వాహనాన్ని నడుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో డీఆర్ఐ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించి ఇచ్ఛా బజార్ రైల్వే క్రాసింగ్ సమీపంలో అడ్డగించారు. వాహనంలోని వ్యక్తులు కారును అక్కడే వదిలేసి, పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, వారిలో ఒకరిని అధికారులు పట్టుకోగలిగారు. మిగిలిన వారు తప్పించుకున్నారు.
వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ముందు ప్రయాణికుడి సీటు కాళ్ల వద్ద ఉండే భాగంలో దాచి ఉంచిన ప్లాస్టిక్ సంచి బయటపడింది. అందులో ఎనిమిది నల్లటి ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కో నల్లటి ప్యాకెట్‌లో ఐదు తెల్లటి ప్యాకెట్లు ఉండగా, వాటిలో ఒక్కోదానిలో పది చొప్పున మెథాంఫెటమిన్ మాదకద్రవ్యాలుగా అనుమానిస్తున్న నారింజ రంగు మాత్రలున్న పౌచ్‌లు ఉన్నాయి.
స్వాధీనం చేసుకున్న 8 కిలోల (నికర బరువు) మెథాంఫెటమిన్ మాత్రలతో పాటు, వాటిని తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చట్టంలోని నిబంధనల మేరకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
ఈ ఆపరేషన్ ఈశాన్య ప్రాంతంలో భారీ మొత్తంలో సింథటిక్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డీఆర్ఐ నిరంతరంగా చేపడుతున్న చర్యలకు మరింత బలాన్నిచ్చింది. ఈ ప్రాంతంలో ఇటీవల డీఆర్ఐ నిర్వహించిన పలు ఆపరేషన్లలో గణనీయమైన స్థాయిలో మెథాంఫెటమిన్ మాత్రలు, క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత వారం సిల్చార్‌లో 20 కిలోల యాబా మాత్రలను స్వాధీనం చేసుకోగా, గత నెలలో సిల్చార్, ఐజ్వాల్‌లో వేర్వేరుగా నిర్వహించిన రెండు ఆపరేషన్లలో 20 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్, 30 కిలోల మెథాంఫెటమిన్ మాత్రలను అధికారులు పట్టుకున్నారు.
వరుసగా చేపట్టిన ఈ దాడులు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను గుర్తించి, వాటిని ఛేదించడంలో డీఆర్ఐకి గల నిఘా సమాచార సేకరణ సామర్థ్యాన్ని, అప్రమత్తతతో కూడిన కార్యాచరణను స్పష్టం చేస్తున్నాయి.
***