నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో రూ. 1,011 కోట్ల ఐటీఐ ఆధునికీకరణ ప్రాజెక్టుల కోసం పీఎం-సేతు పథకం కింద ప్రభుత్వంతో ఎస్‌హెచ్ఏలపై సంతకాలు చేసిన అపోలో మెడ్‌స్కిల్స్, న్యూలాండ్ ఫౌండేషన్, జెన్ టెక్నాలజీస్, శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 5:34PM by PIB Hyderabad

పీఎం-సేతు (ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) పథకం అమలులో ఒక ముఖ్యమైన కీలక ఘట్టం నమోదైంది. తెలంగాణలోని నాలుగు పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ) క్లస్టర్ల కోసం అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్, న్యూలాండ్ ఫౌండేషన్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ సంస్థలను యాంకర్ ఇండస్ట్రీ భాగస్వాములుగా (ఏఐపీలు) నియమిస్తూ షేర్‌హోల్డర్స్ ఒప్పందాలపై (ఎస్‌హెచ్ఏలు) సంతకాలు జరిగాయి. పాతబస్తీ, సంగారెడ్డి, మేడ్చల్, పటాన్‌చెరు క్లస్టర్ల కోసం ఆమోదం పొందిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల (ఎస్ఐపీలు) అమలు దశ ప్రారంభానికి ఈ ఒప్పందాలు నాంది పలికాయి. తద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల పరిశ్రమ-ఆధారిత పరివర్తనకు మార్గం సుగమమైంది.

పీఎం-సేతు కింద ఈ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తూ భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ), తెలంగాణ ప్రభుత్వం, సంబంధిత పరిశ్రమ భాగస్వాముల మధ్య ఈ షేర్‌హోల్డర్స్ ఒప్పందాలపై (ఎస్‌హెచ్ఏ) సంతకాలు జరిగాయి.

ఈ నాలుగు క్లస్టర్లు దాదాపు రూ. 1,011 కోట్ల ఆమోదిత పెట్టుబడిని కలిగి ఉన్నాయి. వీటి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • రూ. 241 కోట్ల ఆమోదిత పెట్టుబడితో ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల రంగంలో యాంకర్ ఇండస్ట్రీ భాగస్వామిగా అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్‌తో కూడిన పాతబస్తీ క్లస్టర్

  • రూ. 241 కోట్ల ఆమోదిత పెట్టుబడితో ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ రంగంలో యాంకర్ ఇండస్ట్రీ భాగస్వామిగా న్యూలాండ్ ఫౌండేషన్‌తో కూడిన సంగారెడ్డి క్లస్టర్

  • రూ. 254 కోట్ల ఆమోదిత పెట్టుబడితో రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగంలో యాంకర్ ఇండస్ట్రీ భాగస్వామిగా జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో కూడిన మేడ్చల్ క్లస్టర్

  • రూ. 275 కోట్ల ఆమోదిత పెట్టుబడితో వైవిధ్యభరిత తయారీ రంగంలో యాంకర్ ఇండస్ట్రీ భాగస్వామిగా శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్‌తో కూడిన పటాన్‌చెరు క్లస్టర్

షేర్‌హోల్డర్స్ ఒప్పందాలపై (ఎస్‌హెచ్ఏలు) సంతకాలు చేయడంతో ఆమోదించిన ప్రాజెక్టుల అమలు విషయంలో భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమ భాగస్వాముల మధ్య సహకారం లాంఛనప్రాయమైంది. ప్రాజెక్టుల అమలు, దీర్ఘకాలిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇప్పుడు ప్రతి క్లస్టర్ కోసం ఎస్‌పీవీలు (స్పెషల్ పర్పస్ వెహికిల్స్) ఏర్పాటవుతాయి. పీఎం-సేతు ఫ్రేమ్‌వర్క్ కింద ఎస్‌పీవీలో పరిశ్రమ భాగస్వామికి 51 శాతం వాటా ఉండగా.. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి 24.5 శాతం చొప్పున ఈక్విటీ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి.

ప్రణాళిక దశ నుంచి అమలు దశకు చేరుకున్న పీఎం-సేతు

ఈ ఒప్పందాలపై సంతకాలు జరగడంతో తెలంగాణలోని ఈ నాలుగు ప్రాజెక్టులు ప్రణాళిక దశ నుంచి క్రియాశీల అమలు దశలోకి అడుగుపెట్టాయి. ఈ భాగస్వామ్యాలు వృత్తి విద్యా రంగంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని.. భాగస్వామ్య ఐటీఐలను ఆధునిక, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే సాంకేతిక నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు. దీనితో పీఎం-సేతు కింద సంతకాలు అయిన మొత్తం షేర్‌హోల్డర్స్ ఒప్పందాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా పరిశ్రమ-ఆధారిత సంస్థాగత పరివర్తన వేగాన్ని తెలియజేస్తోంది.

ఆమోదం పొందిన పెట్టుబడి ప్రణాళికలు సమగ్రమైన కార్యచరణల ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నాయి. వీటిలో ఇవి ఉన్నాయి:

  • శిక్షణ మౌలిక సదుపాయాలు, వర్క్‌షాప్‌లు, ప్రయోగశాలల ఆధునికీకరణ

  • పరిశ్రమలకు అనుకూలమైన సాంకేతికతలు, పరికరాల పరిచయం

  • మారుతున్న రంగాల అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికల అనుసంధానం

  • శిక్షకుల సామర్థ్య పెంపుదల, శిక్షణ

  • మెరుగైన పారిశ్రామిక అనుభవం, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు

  • శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పన, ఉద్యోగార్హతల బలోపేతం

ఐటీఐల నియంత్రణ, అభివృద్ధిలో నేరుగా పరిశ్రమ నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల అవసరాలకు అనుగుణంగా స్పందించే సంస్థలను రూపొందించడంతో పాటు వర్ధమాన ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీనిని రూపొందించారు. 

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ.. పరిశ్రమ భాగస్వాములందరికీ స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా ఐటీఐలను ఆధునికీకరించడంలో వారి నిబద్ధతను ఆమె ప్రశంసించారు. సంస్థాగత పరివర్తనలో పరిశ్రమను కేంద్రబిందువుగా నిలపడం ద్వారా నైపుణ్యాభివృద్ధి రంగంలో పీఎం-సేతు ఒక నూతన ఒరవడిని సృష్టిస్తోందని ఆమె పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి వృత్తి విద్యా వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతు ఇవ్వడానికి, భాగస్వామ్య ఐటీఐల ద్వారా అందించే శిక్షణ నాణ్యతను, ఔచిత్యాన్ని పెంపొందించడానికి ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్స్, రక్షణ ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో ఆయా రంగానికి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాన్ని అందించడానికి నాలుగు పరిశ్రమ భాగస్వాముల ప్రతినిధులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

***


(రిలీజ్ ఐడి: 2339163) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Urdu , हिन्दी , Tamil