రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారి భద్రత, నిర్మాణ నాణ్యత, సుస్థిర సాంకేతికతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

హైదరాబాద్‌లో జరిగిన భారత రహదారుల కాంగ్రెస్ 85వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి

రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రి వినియోగం, శాస్త్రీయ ప్రణాళిక, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 6:43PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారత రహదారుల కాంగ్రెస్ (IRC) 85వ వార్షిక సమావేశంలో ప్రసంగించారు. దేశంలోని రహదారుల మౌలిక సదుపాయాల నాణ్యత, భద్రత, మన్నిక, సుస్థిరతను మెరుగుపరిచేందుకు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, విధాన నిర్ణేతలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, IRC అధ్యక్షుడు శ్రీ ఎల్.కె. పాధీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ (రోడ్డు అభివృద్ధి), ప్రత్యేక కార్యదర్శి శ్రీ సుదీప్ చౌధరి, భారత రహదారుల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ రాహుల్ గుప్తా తదితర ప్రముఖులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

దేశంలోని జాతీయ రహదారుల నెట్‌వర్క్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులను అభినందించిన శ్రీ గడ్కరీ, వారి అంకితభావం, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాల కల్పనకు పరిజ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను అనుసరించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

రహదారుల రంగంలో సాంకేతిక ప్రమాణాల రూపకల్పనలో భారత రహదారుల కాంగ్రెస్ (IRC) పోషిస్తున్న పాత్రను ప్రస్తావించిన మంత్రి, దేశంలో రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గనిర్దేశం చేసే అనేక సాంకేతిక నియమావళులు, మార్గదర్శకాలు, మాన్యువళ్లు, ప్రచురణలను IRC రూపొందించిందని తెలిపారు. మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా భారతీయ ప్రమాణాలను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు పరిజ్ఞానం, సాంకేతికత, విజయవంతమైన విధానాల పరస్పర మార్పిడిని మరింత ప్రోత్సహించాలని ఆయన కోరారు.

నిర్మాణ నాణ్యత, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి

 

రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రత, మన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజినీర్లలో జవాబుదారీతనాన్ని మరింత పెంచాలని, నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీకి పాల్పడినా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల అమలు పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో, ఫలితాల ఆధారంగా జరగాలని ఆయన సూచించారు.

 

వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల (DPRs) నాణ్యతను మెరుగుపరచడం, సాంకేతిక పర్యవేక్షణను బలోపేతం చేయడం, రహదారి భద్రతా తనిఖీలను సమర్థవంతంగా అమలు చేయడం అవసరమని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించి, సరైన ప్రణాళిక, మెరుగైన కూడళ్ల రూపకల్పనతో పాటు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం ద్వారా వాటిని సరిదిద్దాలని ఇంజినీర్లకు సూచించారు.

మానవ ప్రాణాల పరిరక్షణ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, మెరుగైన ఇంజినీరింగ్, రూపకల్పన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్‌లను పూర్తిగా తొలగించడం కోసం సమష్టి నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆవిష్కరణలు, సుస్థిర నిర్మాణ విధానాలు

 

నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తూనే నాణ్యతను మెరుగుపరిచేందుకు వినూత్న, ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రి వినియోగాన్ని మరింత పెంచాలని మంత్రి సూచించారు. సాంకేతికంగా అనుకూలమైన చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు, వినియోగించిన టైర్లు, స్టీల్ స్లాగ్, మున్సిపల్ ఘన వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాలను రహదారుల నిర్మాణంలో ఉపయోగించే అవకాశాలను ఆయన వివరించారు.

 

వరి గడ్డితో తయారుచేసిన బయో-బిటుమెన్ వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిపై పరిశోధనలు, క్షేత్రస్థాయి అనువర్తనాలు సుస్థిర జాతీయ రహదారుల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించగలవని పేర్కొన్నారు.

 

నిర్మాణ పరికరాల్లో విద్యుత్, ఇథనాల్, బయోడీజిల్, CNG, LNG, హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతలతో సహా ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాల వినియోగాన్ని విస్తృతం చేయాలని మంత్రి ప్రోత్సహించారు. ఇవి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని, వ్యవసాయ ఉత్పత్తులను ఇంధన రంగం వైపు మళ్లించడం ద్వారా రైతులకు అదనపు అవకాశాలను కల్పిస్తాయని ఆయన వివరించారు.

పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ కార్యకలాపాల్లో శుద్ధి చేసిన మురుగునీటిని మరింతగా వినియోగించాలని శ్రీ గడ్కరీ సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మున్సిపల్ వ్యర్థాల రీసైక్లింగ్, అందుబాటులో ఉన్న వనరుల పునర్వినియోగం ప్రాధాన్యతను ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేసేందుకు చెట్లను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించే విధానం (Tree Transplantation), జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటడంపై పరిశోధనలను కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

 

ఆర్థిక వృద్ధికి చోదకంగా రహదారుల మౌలిక సదుపాయాలు

 

నాణ్యమైన రహదారుల మౌలిక సదుపాయాలు అనుసంధానాన్ని మెరుగుపరచడం, ప్రయాణ సమయం, రవాణా వ్యయాలను తగ్గించడం ద్వారా వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు మద్దతునిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను ప్రస్తావిస్తూ, మార్కెట్లు, ఆర్థిక అవకాశాలకు మెరుగైన ప్రాప్యత కల్పించేందుకు అన్ని కాలాల్లోనూ ప్రయాణించగల రహదారుల నెట్‌వర్క్ ద్వారా గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు (PPP), ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల ఆస్తుల మానిటైజేషన్‌తో సహా వినూత్న ఆర్థిక వనరుల సమీకరణ విధానాలను అన్వేషించాలని ఆయన సూచించారు.

 

సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించడానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై కూడా భారత రహదారుల కాంగ్రెస్ దృష్టి సారించాలని శ్రీ గడ్కరీ కోరారు. రహదారుల రంగంలో ఎదురవుతున్న నూతన సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు, ఇంజినీరింగ్ నిపుణుల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు.

 

భారతదేశంలో మరింత సురక్షితమైన, మన్నికైన, సుస్థిరమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన రహదారుల మౌలిక సదుపాయాల కల్పనకు 85వ వార్షిక సమావేశంలో జరిగే చర్చలు దోహదపడతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

****


(రిలీజ్ ఐడి: 2338705) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी